ప్రతిపక్ష నేతకు ఆహ్వానం ఇలాగేనా?
- ఉపరాష్ట్రపతి సన్మానంలో ఆనవాయితీ పాటించని ప్రభుత్వం
- కేవలం ఒక్క రోజు ముందే మెయిల్ ద్వారా జగన్‌కు ఆహ్వానం
సాక్షి, అమరావతి: సరైన రీతిలో ఆహ్వానం అందకపోవడం వల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి సన్మాన సభకు హాజరు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష నేతను ముఖ్యమంత్రి లేదా మంత్రులు ఆహ్వానించడం ఆనవాయితీ. వెంకయ్య సన్మాన కార్యక్రమ తేదీ ఎప్పుడో ఖరారైనా.. కేవలం ఒక్కరోజు ముందు అది కూడా సాయంత్రం మెయిల్ ద్వారా ఆహ్వానం పంపినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. దీన్నిబట్టి జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి రావాల్సిన అవసరం లేదన్న సంకేతాలను ప్రభుత్వమే ఇచ్చినట్లుగా ఉందని వైఎస్సార్‌సీపీ ముఖ్య నేత ఒకరు పేర్కొన్నారు.
సన్మాన కార్యక్రమానికి వ్యక్తిగతంగా జగన్ హాజరుకానప్పటికీ వెంకయ్యనాయుడు విషయంలో ప్రతి సందర్భంలోనూ సముచిత గౌరవం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. వెంకయ్య పేరును ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించినప్పుడు తమ పార్టీ ముందే మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. సన్మాన కార్యక్రమానికి హాజరుకానప్పటికీ వైఎస్ జగన్ ప్రత్యేకంగా వెంకయ్యనాయుడిని అభినందించినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు వెల్లడించాయి.
నేడు కాకినాడలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పర్యటించనున్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆయన రెండు చోట్ల బహిరంగ సభలు, రోడ్డు షో నిర్వహించనున్నారని పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు శనివారం మీడియాకు వెల్లడించారు. జగన్ ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో బయల్దేరి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి కారులో కాకినాడకు వస్తారని, ఉదయం 10.30కు అన్నమ్మ ఘాట్ వద్ద సభలో ప్రసంగిస్తారన్నారు. తర్వాత చంద్రిక థియేటర్, జగన్నాథపురం వంతెన మీదుగా సినిమా రోడ్డులో రోడ్డు షోలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు డెయిరీ ఫామ్ సెంటర్‌లో ప్రసంగించిన అనంతరం హైదరాబాద్‌కు వెళ్తారని వివరించారు.