- చురుకైన కార్యకర్తలకు కమిటీల్లో ప్రాధాన్యం
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
అనుబంధ విభాగాలను పటిష్టం చేయండి
Published Wed, Jul 19 2017 12:18 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM
.
కాకినాడ:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలను మరింత పటిష్టవంతం చేసి పార్టీ విధానాలను, తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కోరారు. తన నివాసంలో జిల్లా పార్టీ తొమ్మిది అనుబంధ విభాగాల అధ్యక్షులతో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా విభాగాలకు సంబంధించి జిల్లా, నియోజకవర్గ, గ్రామస్థాయిల్లో కమిటీల ఏర్పాటుపై చర్చించారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ వేధింపులు, పోలీసుల ద్వారా బనాయిస్తున్న తప్పుడు కేసుల నేపథ్యంలో లీగల్‌సెల్‌ను మరింత పటిష్టవంతం చేయాల్సిన అంశంపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కమిటీల నియామకానికి సంబంధించి షెడ్యూల్ సిద్ధం చేసి సకాలంలో పూర్తి చేసేలా ఆయా విభాగాల అధ్యక్షులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి జాతీయ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల పథకాలు, త్వరలో చేపట్టబోయే ‘అన్న వస్తున్నాడు ’ కార్యక్రమంపై కూడా ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. నవరత్నాల పథకాల్లో ఆయా విభాగాలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి వెళ్లాలన్నారు. ప్రధానంగా కొత్తగా నియమించిన అనుబంధ విభాగాల కమిటీల్లో పార్టీ పట్ల అంకిత భావంతో, చురుగ్గా పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, యువజన విభాగం అధ్యక్షుడు అనంతబాబు, వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు హరనా«ద్‌బాబు, రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరు వెంకటేశ్వరరావు, ఎస్సీసెల్ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాస్, వాణిజ్యవిభాగం అధ్యక్షుడు మంతెన రవిరాజు, సేవాదళ్ అధ్యక్షుడు మార్గాని గంగాధర్, మైనార్టీసెల్ అధ్యక్షుడు అబ్దుల్‌బషీరుద్దీన్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement