‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ కాదు.. ఈజ్‌ ఆఫ్‌ కరప్షన్‌’ | YS Jagan Mohan Reddy Speech In Kakinada Public Meeting | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 18 2018 6:39 PM | Last Updated on Thu, Jul 26 2018 7:22 PM

YS Jagan Mohan Reddy Speech In Kakinada Public Meeting - Sakshi

కాకినాడ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ కాదు ఈజ్‌ ఆఫ్‌ కరప్షన్‌ అని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో లంచాలు లేనిదే పనులు జరగడం లేదన్నారు. గజ దొంగలు పాలిస్తే ఎలా ఉంటుందో దానికి కాకినాడే నిదర్శనమని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ప్రచార ఆర్భాటాలు తప్ప చేసిందేమీలేదని జననేత ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లాలో అంతులేని అవినీతి జరుగుతోందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలను టీడీపీకి కట్టబెట్టినా.. సంతలో పశువులను కొన్నట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొన్నారని వైఎస్‌ జగన్‌ విరుచుకుపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సంతచెరువు వద్ద జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.

అంతకంటే సిగ్గులేని వ్యక్తి ఎవరు ఉండరు..
‘కాకినాడ స్మార్ట్‌ సిటీగా మారలేదు.. అవినీతి మాత్రం స్మార్ట్‌గా జరుగుతోంది. జిల్లాలో 19మంది ఎమ్మెల్యేలకు 17 మంది చంద్రబాబు వద్దే ఉన్నారు. అయినా చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలకు చేసిందేమీ లేదు. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కాకినాడకు చంద్రబాబు ఏంచేశారు? కాకినాడలో ప్రభుత్వం, ప్రైవేట్‌ ఆస్తులను విచ్చలవిడిగా కబ్జా చేస్తున్నారు. కాకినాడలో యథేచ్చగా పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ప్రతీనెల పేకాట క్లబ్బుల నుంచి టీడీపీ నేతలకు మామూళ్లు అందుతున్నాయి. లంచం లేనిదే ఒక్క పని కూడా ముందుకు వెళ్లడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 400 కోట్లు కాకినాడకు వస్తే.. కేవలం రూ. 50కోట్లు కూడా కాకినాడకు ఖర్చు పెట్టని పరిస్థితి. కాకినాడలో డంపింగ్‌ యార్డ్‌ మార్చాలని జనం చెబుతున్నా.. గత నాలుగేళ్లుగా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి కాకినాడకు ప్రకటించిన మంచినీటి పథకం ప్రాజెక్టుల పనులు ఎక్కడి వేసిన గొంగలిలా అక్కడే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వంలో లంచాలు లేనిదే పనులు జరగడం లేదు. పేదవాడి వద్ద అవినీతి చేయాలంటే అంతకంటే సిగ్గులేని వ్యక్తి ఎవరు ఉండరు’ అని వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.

బాహుబలి గ్రాఫిక్స్‌ కనిపిస్తాయి..
‘కాకినాడ అర్బన్‌లో వైఎస్‌ఆర్‌ 13 వేల ఇళ్లు కటించారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్క ఇళ్లైనా కట్టించారా? పేదల ఫ్లాట్లలో కూడా చంద్రబాబు అవినీతి చేస్తున్నారు. చంద్రబాబు ఫ్లాట్లు ఇస్తే తీసుకోండి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఆ ఫ్లాట్లపై ఉన్న అప్పును మాఫీ చేస్తాం. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవు. ఇద్దరు రోగులకు ఒకే బెడ్‌ ఇస్తున్నారు. కాకినాడ ఆస్పత్రిలో 500పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు పాలన అంతా అవినీతి చేయడం, వెన్నుపోట్లు పొడవడం. వారం రోజుల కిందట చంద్రబాబు సింగపూర్‌ పోయారు. అవినీతి గురించి చంద్రబాబు సింగపూర్‌లో మాట్లాడారు. సింగపూర్‌లో చంద్రబాబు అన్ని అబద్ధాలే చెప్పారు. అమరావతిలో ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉన్నాయట. అమరావతిలో ఇప్పటివరకు శాశ్వత భవనాలకు ఒక్క ఇటుక కూడా పడలేదు.

అమరావతిలో ఎమ్మెల్యే గేదెలు గడ్డి మేస్తు కనిపిస్తాయి. అమరావతిలో చంద్రబాబు బాహుబలి గ్రాఫిక్స్‌ కనిపిస్తాయి. సమ్మిట్‌ల ద్వారా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు.. 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు ఊదరగొడుతున్నారు. నాలుగేళ్లలో రూ. 20 వేలకోట్లు పెట్టుబడులు కూడా రాలేదు. ఈజ్‌ ఆఫ్‌ డుయింగ్‌ బిజినెస్‌లో చంద్రబాబు ఫస్ట్‌ ఎలా వచ్చారు? పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలను నాలుగేళ్లుగా బకాయి పెడుతున్నారు. అలాంటి చంద్రబాబుకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఇచ్చిన వాళ్లకు బుద్ది ఉందా? వైఎస్ జగన్‌ పేర్కొన్నారు.

ఈజ్‌ ఆఫ్‌ డుయింగ్‌ కాదు.. ఈజ్‌ ఆఫ్‌ కరప్షన్
‘కరెంట్‌ చార్జీలు రూ.3.75 పైసల నుంచి రూ. 8.75 పైసలకు పెంచడంతో కర్నూల్ జిల్లాలో నాపరాళ్ల పరిశ్రమలు మూతపడ్డాయి. కర్నూల్‌, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో గ్రానైట్‌ పరిశ్రమలపై రాయల్టీ విపరీతంగా పెంచడం ద్వారా ఈ పరిశ్రమలన్నీ మూతపడే స్థాయికి వచ్చాయి. ఇదేనా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంటే? షుగర్‌ ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్‌ మిల్లులు అన్నీ మూతపడుతున్నాయి. మరీ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ఎక్కడ జరుగుతోంది? ఏపీలో ఉన్నది ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ కాదు.. ఈజ్‌ ఆఫ్‌ కరప్షన్‌’ అని రాజన్న బిడ్డ ఎద్దేవా చేశారు.

మోసంలో చంద్రబాబు నంబర్‌ వన్‌ స్థానం..
‘హోదా కోసం వైఎస్సార్‌సీపీ లోక్‌సభ ఎంపీలు రాజీనామా చేశారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి నిరాహారదీక్ష చేసి ఉంటే అప్పుడే దేశం మొత్తం ఏపీ వైపు చూసేది. మోసం చేయడంలో చంద్రబాబుకు నెంబర్‌వన్‌ స్థానం వచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరుగార్చినందుకు చంద్రబాబుకు నంబర్‌వన్‌ స్థానం వచ్చింది. గ్రామాల్లో మన పిల్లలను తాగించడంలో చంద్రబాబుకు నంబర్‌ వన్‌ స్థానం. పెట్రోల్, డీజిల్‌ ధరలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్నందుకు నంబర్‌ వన్ స్థానం. ప్రతీ కులాన్ని మోసం చేయడంలో చంద్రబాబుకు నెంబర్‌ వన స్థానం. హామీలను అమలు చేయమని అడిగితే వారిని కొట్టించడంలో నెంబర్‌ వన్‌. మట్టి ఇసుక, బొగ్గు, కరెంట్‌ కొనుగోళ్ల కాంట్రాక్టులు, రాజధాని భూములు దోచుకోవడంలో చంద్రబాబుకు నంబర్‌వన్ స్థానం. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబుకు నెంబర్‌వన్‌. ఓటుకు కోట్లు కేసులో వ్యవస్థలను మ్యానేజ్‌ చేసుకుని కేసులు లేకుండా చేసుకోవడంలో నెంబర్‌వన్‌ స్థానం. లంచం లేనిదే పనులు జరగకుండా చేయడంలో నెంబర్‌వన్‌ స్థానం. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలు, వెన్నుపోట్లు, మోసాలు, అవినీతి’ అని జననేత విమర్శలు గుప్పించారు.

బయట యుద్ధం.. లోపల కాళ్లబేరం..  
‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై  చంద్రబాబు యుద్ధం చేస్తున్నట్లు డ్రామాలు. వైఎస్సార్‌సీపీ ఎన్నిసార్లు అవిశ్వాసం పెట్టినా స్పీకర్ అనుమతించలేదు.  కాగా, వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి బయటకు వెళ్లిన తర్వాత టీడీపీ అవిశ్వాసం పెట్టడం.. వెంటనే స్పీకర్‌ ఆమోదించడం చాలా ఆశ్చర్యకరం. పార్టీ ఫిరాయించినా బుట్టా రేణుకను డిస్‌క్వాలిఫై చేయాలని ఫిర్యాదు చేశాం. కానీ, అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్‌సీపీ తరఫున బుట్టా రేణుకను పిలిచారు. చంద్రబాబు ప్లాన్‌లో భాగంగానే బుట్టా రేణుకను పిలిచారు. బయటికేమో బీజేపీతో యుద్ధం.. లోపల చూస్తే కాళ్లబేరం. అధికారం కోసం ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడుస్తారు. ఎన్నికలు రాగానే ఎన్‌టీఆర్‌ ఫొటోకు దండ వేసి దండం పెడతారు’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం..
అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ చెప్పారు. ‘ప్రతి సంవత్సరం ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గ్రామ సచివాలయాల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇస్తాం. పెన్షన్‌, రేషన్‌ కార్డులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను 72 గంటల్లో మంజూరు చేస్తాం. పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తాం. ప్రత్యేక హోదా వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుంది. వైఎస్సార్‌సీపీకి చెందిన  25మంది ఎంపీలను గెలిపించండి. హోదా ఎవరిస్తే కేంద్రంలో వారికే మద్దతు ఇస్తామని’ వైఎస్‌ జగన్‌ చెప్పారు.

జనోత్సాహం ఉప్పొంగింది. కాకినాడ జన ప్రభంజనమైంది. ఎగసిపడిన కెరటంలా జన సందోహం వెల్లివిరిసింది. కాకినాడలో ఓ ప్రభంజనంలా వైఎస్‌ జగన్‌ వెంట జనం నడిచారు. కాకినాడ సిటీలోకి ప్రవేశించిన జననేతకు గులాబీ పూలతో  విద్యార్ధినులు స్వాగతం పలికారు. నేడు కాకినాడలోని సంతచెరువు వద్ద జరిగిన బహిరంగ సభకు అశేష జనవాహిని కదలివచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement