సాక్షి, హైదరాబాద్: మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు...అసలే నష్టాలతో అల్లాడుతున్న ఆర్టీసీపై సమైక్య ఉద్యమ దెబ్బ పడింది. గత 31 నుంచి సోమవారం వరకు ..ఆర్టీసీ రోజుకు దాదాపు రూ. 9కోట్ల రాబడి కోల్పోయింది. ఆర్టీసీకి రోజుకు దాదాపు రూ. 20 కోట్ల రాబడి వస్తుంది. సమైక్య ఉద్యమం ప్రారంభమైనప్పటినుంచి రోజూ రాబడి రూ. 11 కోట్లు దాటట్లేదని ఆర్టీసీ అధికారవర్గాలు తెలిపాయి. సీమాంధ్ర ప్రాంతంలో దాదాపు 12 వేల బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. అందులో సోమవారం 7,000 బస్సులను ఆర్టీసీ తిప్ప గలిగింది.
మిగతా 5వేల బస్సులు డిపోలకే పరిమితయమ్యాయి. సాధారణంగా ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) దాదాపు 70 శాతం వరకు ఉంటుంది. ఆందోళనల ఫలితంగా ఓఆర్ 30 శాతానికి దాటడం లేదు. 5-10 శాతం ఓఆర్‌తో పలు బస్సులు తిరిగాయని అధికార వర్గాలు చెప్పాయి. కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్క బస్సు కూడా సోమవారం తిరగలేదు. మిగతా జిల్లాల్లోనూ బస్సులు బయటకే రాని డిపోలు ఉన్నాయి. సీమాంధ్రలో దాదాపు 60 డిపోల నుంచి ఒక్కబస్సూ గడప దాటడం లేదు. రాబడి కోల్పోవడం ఒక ఎత్తయితే.. ఓఆర్ కనిష్ట స్థాయికి పడిపోవడం వల్ల నిర్వహణ వ్యయం పెరుగుతుందని, ఫలితంగా నష్టాలు అధికమవుతాయని ఆర్టీసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీకి రోజూ రూ.9 కోట్ల నష్టం
Published Tue, Aug 6 2013 3:42 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
Advertisement