- ఏ అర్హతతో ఎంపిక చేశారు
- ఉమా సొంతశాఖనే మరిచారు
- టీడీపీకి ఇష్టులైన వారికే సత్కారాలు
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఎన్జీవో సంఘ నేతలతోపాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ప్రైవేటు అసోసియేషన్ల ప్రతినిధులకు మంగళవారం బెంజిసర్కిల్‌లో జరిగిన నవ నిర్మాణదీక్షలో ముఖ్యమంత్రి చేతుల మీదగా సత్కారాలు జరిగాయి. ఈ కార్యక్రమంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఏ ప్రామాణికంగా సత్కరించారని పలువురు సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. సమైక్య ఉద్యమంలో పాల్గొని సత్కారం పొందలేకపోయిన కొంతమంది సమైక్యవాదులు ఈ సన్మానాలపై గరంగరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి తమకు సత్కారం చేయకపోయినా పర్వాలేదని.. అయితే తాము చేసిన పోరాటాన్ని గుర్తించకపోవడమే బాధాకరమంటున్నారు.
మంత్రి ఉమా శాఖనే మరిచి
జలవనరుల శాఖకు చెందిన సిబ్బంది, అధికారులు సమైక్యాంధ్ర ఉద్యమంలో తొలిరోజు నుంచి పాల్గొని నీటిపారుదలశాఖ ప్రాంగాణాన్ని స్తంభింపజేశారు. మంత్రి ఉమాకు చెందిన ఈశాఖ ఉద్యోగస్తుల్ని పూర్తిగా విస్మరించారు. ఎక్సైజ్,గ్రంథాలయ సంస్థ, పశుసంవర్థక శాఖ, ఉడా, తదితర ఇతర శాఖల ఉద్యోగులు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని వంటావార్పులు, రోడ్లపైనే ధర్నాలు చేసి నిరసన తెలియజేశారు. వీరిని మాత్రం ప్రభుత్వం గుర్తించలేదు.
ఎన్జీవో సంఘ నేతలతోపాటు రెవెన్యూ, కార్పొరేషన్ వంటి ముఖ్యమైన శాఖల ప్రతినిధులకు మాత్రమే సన్మానాలు జరగడంపై ఈ శాఖల సిబ్బంది గరంగరంగా ఉన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగిన నవనిర్మాణదీక్షలో సత్కారాలు కేవలం జిల్లానేతలకే పరిమితం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో హైదరాబాద్‌లో సచివాలయ ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారని, వారంతా నవనిర్మాణదీక్షలోపాల్గొన్నారని వార్ని ఎందుకు సత్కరించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సమైక్యవాదులు ఆగ్రహం...
ఆప్పట్లో అర్బన్ టీడీపీ కార్యాలయ కార్యదర్శి గోగినేని ధనశేఖర్ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. రెండోసారి టీడీపీ నేతలందరికంటే ముందుగా పార్టీలకు అతీతంగా మదర్ థెరిస్సా విగ్రహం వద్ద ఆమరణదీక్ష చేయడంతో టీడీపీ నేతలంతా పాల్గొన్నారు. ఆయనతో పాటు పార్టీలో ఇంకా కొంతమంది కార్యకర్తలు కీలకంగాపాల్గొన్నారు. అలాగే తొలినుంచి రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ వామపక్ష నేతలు పెద్ద ఎత్తున ఉద్యమాలుచేశారు.
వారిని ప్రభుత్వం గుర్తించలేదు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబు తమకు సత్కరించాల్సిన అవసరంలేదని వామపక్షనేతలు అంటున్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారిని ప్రక్కన పెట్టి ప్రస్తుతం టీడీపీలో ముఖ్యనేతలకు ఇష్టులైన వారికి వివిధ రంగాల తరుఫున గుర్తించి సత్కారాలు చేయించారనే విమర్శలు వస్తున్నాయి. కాగా సమైక్యాంధ్ర ఉద్యమం అంటేనే మాజీ ఎంపీ లగడపాటి గుర్తుకు వస్తారని.. ఆయనను ఈ వేదిక ఎందుకు మరిచిపోయిందంటూ సమైక్యవాదులు ప్రశ్నించడం కొసమెరుపు.
సమైక్య సన్మానంపై గరంగరం
Published Thu, Jun 4 2015 4:20 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM
Advertisement
Advertisement