కొనసాగిన సమైక్య పోరు
Published Tue, Feb 11 2014 1:18 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM
సాక్షి, కాకినాడ :రాష్ట్ర విభజనను అడ్డుకునే సంక ల్పంతో ఏపీ ఎన్జీఓలు చే స్తున్న నిరవధిక సమ్మె సోమవారం ఐదోరోజుకు చేరుకుంది. సమైక్య రాష్ర్ట పరిరక్షణవేదిక పిలుపు మేరకు ఎన్జీఓలు జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి, కార్యకలాపాలను స్తంభింపచేశారు. మరోపక్క ప్రభుత్వ వైద్యులు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది కూడా విధులు బహిష్కరించి సమ్మెలో చేరారు. రాజ్యసభలో మంగళవారం ప్రవేశపెడుతున్న తెలంగాణ బిల్లును లోక్‌సభకు రానివ్వకుండా వీగిపోయేలా సీమాంధ్ర ఎంపీలు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం డిమాండ్ చేశారు. కాకినాడలో ఆశీర్వాదం, సంఘం జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్‌ల ఆధ్వర్యంలో ఎన్జీఓలు బృందాలుగా ఏర్పడి జిల్లా తపాలా, ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. ఉద్యోగులను బయటకు పంపి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
వివిధశాఖల ఉద్యోగులు కలెక్టరేట్ నుంచి జిల్లాపరిషత్ సెంటర్, ఆర్డీఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ ఎదుట నిరసన శిబిరం వరకు ర్యాలీ చేపట్టారు. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక పిలుపు మేరకు మంగళవారం జిల్లావ్యాప్తంగా సినిమా థియేటర్లు బంద్ పాటించాలని ఆశీర్వాదం విజ్ఞప్తి చేశారు. ఎన్జీఓ సంఘం నగర అధ్యక్షుడు గెద్దాడ హరిబాబు ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులు రాజమండ్రి మూడవపట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఏపీ ఎన్జీఓ భవన్ నుంచి ర్యాలీగా బయల్దేరి బీఎస్‌ఎన్‌ఎల్, సీటీఆర్‌ఐ, పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయాలను మూయించారు. ఓఎన్జీసీ, గెయిల్ కార్యాలయాల వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
విధులు బహిష్కరించినా వైద్యసేవలు..
వైద్యుల జేఏసీ పిలుపు మేరకు కాకినాడ జీజీహెచ్, రాజమండ్రి వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో వైద్యులతో పాటు ఇతర సిబ్బంది విధులను బహిష్కరించారు. అయితే విష యం తెలియక ఆస్పత్రులకు వచ్చిన రోగుల కు ఇబ్బంది కలగకుండా మధ్యాహ్నం వరకు వైద్య సేవలను కొనసాగించారు. కాగా మంగ ళవారం నుంచి అత్యవసర సేవలు మినహా సాధారణ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ఆస్పత్రుల వద్ద బోర్డులను ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో కీలకపాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు, ఇతర ఉద్యోగులు కూడా సోమవారం నుంచి సమ్మె బాట పట్టడంతో గ్రామ సచివాలయాలు మూతపడ్డాయి. ఒకపక్క పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాటపట్టగా, సమైక్యాంధ్ర కోసం మున్సిపల్ ఉద్యోగులు రెండు రోజుల పెన్‌డౌన్‌ను సోమవారం ప్రారంభించారు. బుధవారం నుంచి వారు కూడా నిరవధిక సమ్మెలోకి రానున్నారు.
Advertisement
Advertisement