ఎస్కేయూ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే తమ భవిష్యత్తు బజారు పాలేనంటూ ఎస్కేయూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 72 రోజులుగా అనంతపురం నగరంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో తామూ పాలుపంచుకుంటామని ఎస్కేయూ సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో బయల్దేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోకి వెళ్లరాదని ఆంక్షలు విధించారు. మూడు గంటల పాటు పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. కొందరు విద్యార్థులు సొమ్మసిల్లిపడిపోయారు. అనంతపురంలో జరిగే ఉద్యమంలో పాల్గొనేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఎస్కేయూ విద్యార్థులు కోరగా.. పోలీసులు ససేమిరా అన్నారు. ఏదేమైనా తాము ఉద్యమంలో పాల్గొంటామని గురువారం ఉదయమే వందలాది మంది విద్యార్థులు బస్సుల్లో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే జిల్లా కేంద్రం నుంచి డీఎస్పీ దయానందరెడ్డి, సీఐలు మహబూబ్‌బాషా, గోరంట్ల మాధవ్, గురునాథ్‌బాబు, శ్రీనివాసులు, విజయకుమార్, పలువురు ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులతో యూనివర్సిటీకి చేరుకున్నారు.
వర్సిటీ విద్యార్థులు నగరంలోకి వస్తే అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశమున్నందున అనుమతిచ్చేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య అర గంటకుపైగా వాగ్వాదం జరిగింది. అనంతరం అనేక మంది విద్యార్థులు బస్సుల్లో పంగల్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసు బలగాలు బస్సులను అడ్డుకున్నాయి. విద్యార్థులంతా బస్సులు దిగి పోలీసులను ప్రతిఘటించారు. తామేమైనా వీధి రౌడీలమా.. అంటూ ఆగ్రహించారు. నగరంలోకి వెళ్లి తీరతామని ఆక్రోశం వెళ్లగక్కారు. పోలీసు వలయాన్ని ఛేదించుకొని విద్యార్థులు పంగల్ రోడ్డు నుంచి నగరంలోకి వెళ్లాలని పరుగులు తీశారు. పోలీసులూ వారిని వెంబడించారు. ఆర్డీటీ స్టేడియం, టీవీ టవర్ వరకూ విడతల వారీగా విద్యార్థులు పరుగెత్తారు. వారిని పోలీసులు ఎక్కడిక క్కడ అడ్డుకుని ఈడ్చి పారేశారు.
నగరం నుంచి అదనపు బలగాలను పంపించిన ఉన్నతాధికారులు అక్కడికి చేరుకోగానే ఓ సీఐ ‘మీరు మనుషులా.. కాదా.. ఒక్కసారి చెప్తే వినబడదా.. కొడుకుల్లారా.. మీ ఇష్టం’ అంటూ విద్యార్థుల మీదకు వెళ్లారు. పోలీసుల నుంచి తప్పించుకున్న పలువురు విద్యార్థులు రోడ్డుపై స్పృహ తప్పిపడిపోగా.. మరికొంత మందిని పోలీసులే విచక్షణారహితంగా తోసివేశారు. ప్రొఫెసర్ డాక్టర్ సదాశివరెడ్డి పంగల్ రోడ్డులో సొమ్మసిల్లిపడిపోయారు. పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. మరింత రెచ్చిపోయిన పోలీసులు విశ్వవిద్యాలయాల జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ రాజేశ్వరరావునూ ఈడ్చిపారేశారు. విద్యార్థినులను సైతం మహిళా పోలీసులు అడ్డుకోగా వారు రోడ్డుపైనే బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రాణాలర్పించైనా సమైక్యాంధ్రను సాధించుకుంటామని ప్రతిన బూనారు. మూడు గంటల హైడ్రామా అనంతరం పలువురు సమైక్యవాదులను జీపుల్లో ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. వదిలేశారు.
ఎస్కేయూ వద్ద ఉద్రిక్తత..
Published Fri, Oct 11 2013 3:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
Advertisement
Advertisement