ఏమిటీ దారుణం
Published Fri, Feb 14 2014 4:05 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
‘ప్రజాస్వామ్య విలువలకు లోక్‌సభలో పాతరేశారు. ప్రజలు పనులు మానుకుని.. నెలల తరబడి ఉపాధి కోల్పోయినా.. పస్తులుండి మరీ సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. జనం ఏమైపోయినా పర్వాలేదు.. రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకుంది. అందుకే లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టింది. ఇది అన్యాయమని ఆక్రోశించిన ప్రజా ప్రతినిధులను సభనుంచి గెంటించింది. ఈనెల 21వరకూ లోక్‌సభ సమావేశాలు జరుగుతుంటే.. 20వ తేదీ వరకూ మన ఎంపీలు రాకూడదంటూ సస్పెండ్ చేసింది. ఏమిటీ దారుణం’ అంటూ జిల్లా ప్రజలు ఆవేదన వెళ్లగక్కారు. గురువారం లోక్‌సభలో చోటుచేసుకున్న పరిణామాలపై కలత చెందారు. ఆరు నూరైనా విభజన బిల్లును ఉపసంహరించుకోవాలని ముక్తకంఠంతో నినదించారు.
సాక్షి, ఏలూరు:తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో గురువారం చోటుచేసుకున్న పరిణామాలు జిల్లా ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఉదయం నుంచి లోక్‌సభలో ఏం జరగబోతోందనే విషయమై జిల్లా ప్రజలు నరాలు తెగే ఉత్కంఠతో ఎదరుచూశారు. అక్కడ సీమాంధ్ర ఎంపీలకు ఎదురైన చేదు అనుభవాలను టీవీల్లో చూసి చలించిపోయారు. ఏమిటీ దారుణమంటూ ఆగ్రహావేశాలతో ఊగిపోయూరు. వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతి రేక నినాదాలు చేశారు. ఇన్నాళ్ల భీకర పోరాటాన్నే పట్టించుకోని గుడ్డి ప్రభుత్వం ప్రజల ఆగ్రహ జ్వాలల్లో తగలబ డక తప్పదంటూ శాపనార్థాలు పెట్టారు. సోనియూగాంధీ, మన్మోహన్ సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
న్యాయం అడగటమే నేరమా
జిల్లాలో ఎవరిని కదిపినా ఒకటే ఆవేదన.. భవిష్యత్‌ను తలచుకుని ఆక్రందన వ్యక్తమయ్యాయి. ‘1963లో ప్రారంభమైన శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం 1984లో పూర్తయ్యింది. ఒక్క ప్రాజెక్టు నిర్మాణానికే 21ఏళ్లు పడితే హైదరాబాద్ వంటి రాజధాని నిర్మించడానికి, అంతర్జాతీయ విమానాశ్రయూలు, ఎంఎంటీఎస్ వంటి రైల్వే వ్యవస్థ, హైటెక్ సిటీ, సెంట్రల్ యూనివర్శిటీలు, పరిశ్రమలు, ఫ్లై ఓవర్‌లు నిర్మించడానికి ఎన్నేళ్లు పడుతుంది. అప్పటివరకూ
నిరుద్యోగులుగా మారి అడుక్కుతినాలా.. సాగు నీరు, తాగునీటి కోసం ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రతో పోరాటాలు చేస్తున్నాం. బాబ్లీ, ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మాణాలను ఆపలేకపోయాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పోలవరం ప్రాజెక్టు పూర్తవడం అసాధ్యం. జిల్లాలో కరువు కాటకాలు వస్తాయి. పరిశ్రమలు ఏర్పాటుకు మన దగ్గర వనరులు లేవు. ఉపాధి అసలే దొరకదు.
తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపించేస్తే ఇక్కడ వారికి సరిపడా పోస్టులు లేవు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాలి. రాష్ట్రం ముక్కలైతే నీటి యుద్ధాలు, కరెంటు కష్టాలు వస్తాయి. మన దగ్గర జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు లేవు. గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేద్దామంటే ఖర్చు తడిసిమోపెడవుతుంది. రాష్ర్ట రెవెన్యూ ఆదాయంలో హైదరాబాద్ నుంచే 40 శాతం వస్తోంది. తెలంగాణ నుంచి 22 శాతం, సీమాంధ్ర నుంచి 18 శాతం మాత్రమే వస్తోంది. హైదరాబాద్‌ను వదులుకుంటే ఆదాయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతాం. అందుకే విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే కోరుతున్నాం’ ప్రతి ఒక్కరూ ఇవేమాటలు చెప్పారు. న్యాయం చేయమని కోరడమే ప్రజలు చేసిన నేరంలా కాంగ్రెస్ పార్టీ భావిస్తోం దంటూ వాపోయూరు.
సామాన్యుల ఉద్యమానికి ఫలితమిదా
సామాన్యులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సం ఘాలు, న్యాయవాదులు, రైతులు, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులు, వ్యాపార వాణిజ్య సంఘాల వారు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజాన వేసుకుని నడిపిం చారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి పౌరుడు తన జేబులోని డబ్బునే ఖర్చు చేశాడు. ఎవరికి వారు చందాలు వేసుకుంటున్నారు. ఉద్యమాన్ని భుజాన వేసుకుని నడిపిస్తున్నారు. రాష్ట్రం ముక్కలవుతుందనే బాధతో జిల్లాలో ఇప్పటికే నలుగురు ప్రాణత్యాగం చేశారు. గుండెపగిలి దాదాపు 100మందికి పైగా నేలకొరిగారు. ఈ పోరాటానికి.. ఇందరి త్యాగాలకు ఫలితమిదేనా అంటూ జిల్లా ప్రజలు పట్టరాని ఆగ్రహంతో ప్రభుత్వాన్ని అడుగుతున్నారు.
ఈ పాపం ఆ రెండు పార్టీలదే
ఇంతటి అల్లకల్లోలానికి కాంగ్రెస్ పార్టీయే కారణమైందని, దీనికి తెలుగుదేశం పార్టీ ఆజ్యం పోసిందని జిల్లా ప్రజలంతా అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ఒకసారి ప్రయత్నించి కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఇదే పరిస్థితి తీసుకువచ్చి పంతం నెగ్గించుకోవాలని చూస్తోందని వాపోయూరు. ఓట్ల కోసం ఆంధ్రుల జీవితాలతో ఆటలాడుకుంటోందని చెప్పారు. తెలుగు ప్రజలు విడిపోవాలంటూ.. వారిమధ్య ఈ ప్రభుత్వం చిచ్చు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనుకున్న కాంగ్రెస్ దానిపై సమైక్యవాదుల అభిప్రాయాలేమిటో తెలుసుకోలేదు. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు ఏమాత్రం విలువ ఇవ్వలేదు.
పధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చింది’ అంటూ జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ‘ఆ రెండు పార్టీలకు భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్యాయం జరగాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మొదటినుంచీ కోరుతోంది. జిల్లాలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పదవులకు సైతం రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందు నడిచారు. ఎందరు ఎన్ని త్యాగాలు చేసినా.. ఎన్ని ఉద్యమాలు చేసినా కాంగ్రెస్ పాలకులు తాము అనుకున్నది చేసి తీరుతామనే మొండి పట్టుదలతో లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం’ దారుణం అంటూ ముక్తకంఠంతో నినదించారు.
Advertisement
Advertisement