హలధారీ.. బీమా హరీ
సాక్షి, ఏలూరు : మెరుగుపరిచిన జాతీయ వ్యవసాయ బీమా పథకం ఈ ఖరీఫ్‌లో రైతులకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జూలై నెలాఖరులోపు పంటవేసి ప్రీమియం చెల్లిం చిన వారికే బీమా వర్తిస్తుందనే నిబంధన ఉంది. కానీ.. ఇప్పటివరకూ రైతులకు కొత్త రుణాలు ఇవ్వలేదు. మరోవైపు వర్షాలు కురవడం లేదు. ఈ పరిస్థితుల్లో పంట ఆలస్యం కాకతప్పదు. ఈ కారణంగారైతులకు బీమా పథకం దూరం కానుంది. గడువు కుదించారు జిల్లాలో 2012 ఖరీఫ్ నుంచి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. తొలి ఏడాది 1,93,044 మంది రైతులు రూ.31.31 కోట్లను ప్రీమియం రూపంలో బ్యాంకుల ద్వారా బీమా కంపెనీకి చెల్లించారు. వారికి రూ.805.39 కోట్ల పరిహారం అందేలా బీమా చేశారు. కానీ.. నిబంధనల పేరుతో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రైతులకు దూరం చేయాలని చూసింది.
బీమా ప్రీమియం దాదాపు 15 ఏళ్లుగా 2.25 శాతమే ఉండేది. అయితే 2012-13 కాలానికి దానిని 4 శాతం చేశారు. 2013-14 కాలానికి ప్రీమియంను 5 శాతానికి పెంచారు. అంటే రూ.లక్ష విలువ చేసే పంటకు బీమా చేయించాలంటే రూ.5 వేలు ప్రీమియం చెల్లించాలి. సాధారణంగా ప్రీమియం చెల్లించడానికి సెప్టెంబర్ నెలాఖరువరకూ గడువు ఉండేది. కానీ.. మన జిల్లాలో ప్రారంభంలోనే ఓ నెల తగ్గించి ఆగస్టు నెలాఖరు వరకే అవకాశం ఇచ్చారు. అప్పటికి పంటవేసి ఉండాలనే నిబంధన విధించారు. గతేడాది ఈ గడువును మరో నెల రోజులు కుదించారు. ప్రస్తుతం జూలై నెలాఖరులోగా ప్రీమి యం చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈ నిబంధనకు టీడీపీ ప్రభుత్వం నిర్వాకం తోడై పంటల బీమా పథకం అన్నదాతలకు దూరమవుతోంది.
ఇవీ కారణాలు
బ్యాంకులు రుణాలు ఇచ్చేప్పుడు ఎకరా వరి పంటకు రూ.579, చెరకు పంటకు రూ.730 నుంచి రూ.974 చొప్పున బీమా ప్రీమియంగా మినహాయించుకుంటాయి. బ్యాంకుల నుంచి రుణం పొందని వారు వ్యవసాయ శాఖ ద్వారా నేరుగా బీమా ప్రీమియం చెల్లించవచ్చు. అరయితే, ఈ ఏడాది టీడీపీ ఇచ్చిన రుణమాఫీ హామీతో రైతులు పాత రుణాలను బ్యాంకులకు తిరిగి చెల్లించలేదు. పాత బకాయిలు కడితే తప్ప కొత్త రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకులు తెగేసి చెబుతున్నారుు. రుణాలు మంజూరు కాకపోవడంతో పంటల బీమా ప్రీమియం చెల్లించే అవకాశం లేకుండాపోరుుంది. మరోవైపు వర్షాలు మొహం చాటేయడంతో నారుమళ్లు వేసేందుకు సాహసించడం లేదు. దీంతో వచ్చే నె లాఖరు నాటికి నాట్లు వేయడం అసాధ్యం. ఆ తర్వాత నాట్లు వేసినా.. బ్యాంకులు రుణాలిచ్చినా ప్రీమియం చెల్లింపు గడువు తీరిపోతుంది. దీనివల్ల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం రైతులకు ఉండదు.
నష్టం వాటిల్లితే అంతే..
గతేడాది ఖరీఫ్‌లో ఆగస్టు 20వ తేదీ వరకూ ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించారు. కానీ ఈ విషయం బ్యాంకర్లకు, రైతులకు సకాలంలో చేరలేదు. అయినప్పటికీ జిల్లాలో 1,53,457 మంది రైతులు 2,69,479 హెక్టార్లలో పంటలకు బీమా చేయించుకున్నారు. 2012 ఖరీఫ్‌లో 1,93,044 మంది రైతులు 84,675 హెక్టార్లలో పంటకు బీమా చేయించారు. నీలం తుపాను, వరదల కారణంగా జిల్లాలో 1,41,258 హెక్టార్లలో వరి, 600 హెక్టార్లలో చెరకు దెబ్బతిన్నాయి. నష్టపోరుున రైతులకు బీమా పరిహారం కింద రూ.213 కోట్లు దక్కింది. హెలెన్ తుపాను, అధిక వర్షాల కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు దాదాపు రూ.103 కోట్ల మేర బీమా పరిహారం రానుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కళ్లాల్లో ఉన్న ధాన్యం రాశులకు నష్టం వాటిల్లినప్పుడు, వర్షాభావ పరిస్థితుల్లో విత్తనం మొలకెత్తనప్పుడు, వడగండ్ల వానలు కురిసినప్పుడు ఏర్పడే పంట నష్టానికి బీమా వర్తిస్తుంది. ఈ ఆశతోనే రైతులు బీమా ప్రీమియం చెల్లిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో బీమా ప్రీమియం చెల్లించేందుకు తక్కువ రోజులే మిగిలి ఉండటం, నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితి, రుణాలు అందకపోవడం వంటి కారణాల వల్ల జిల్లా రైతులు ఈ ఏడాది పంటల బీమా పథకానికి దూరమవుతున్నారు.