National Agricultural Insurance Scheme
-
గ్రామం యూనిట్‌గా వరికి బీమా
♦ మండలం యూనిట్‌గా జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు ♦ మామిడికి వాతావరణ ఆధారిత బీమా ♦ ఉత్తర్వులు జారీచేసిన సర్కారు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత రబీలో సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాన్ని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో అమలు చేస్తారు. వరి పంటను గ్రామం యూనిట్‌గా తీసుకుంటారు. జొన్న, మొక్కజొన్న, ఉల్లి, పొద్దుతిరుగుడు, వేరుశనగ, మిరప, మినుములు, శనగ పంటలను మండలం యూనిట్‌గా తీసుకుంటారు. డిసెంబర్ 31 నాటికి రైతులు ప్రీమియం చెల్లించడానికి గడువు తేదీగా నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే సాధారణ జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మండలం యూనిట్‌గా అమలుచేస్తారు. ఈ పథకంలో రుణం పొందిన రైతులు ప్రీమియం చెల్లించడానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకు, రుణం పొందని రైతులకు వచ్చే నెల 31 నాటికి గడువుగా నిర్ణయించారు. వరి, జొన్నపై నాలుగు జిల్లాల్లో బీమా అమలవుతుంది. పెసర, మొక్కజొన్నకు ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే అమలుచేస్తారు. మినుములకు ఖమ్మం జిల్లాల్లో మాత్రమే బీమా వర్తింప చేస్తారు. శనగకు మహబూబ్‌నగర్, మిరపకు ఖమ్మం, ఉల్లికి రంగారెడ్డి జిల్లాల్లో బీమా సౌకర్యం కల్పిస్తారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో వేరుశనగకు బీమా వర్తిస్తుంది. పొద్దుతిరుగుడుకు ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బీమా వర్తింపచేస్తారు. మామిడికి వాతావరణ ఆధారితంగా.. అలాగే వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని నిజామాబాద్ తప్ప మిగిలిన జిల్లాల్లో మామిడి పంటకు అమలుచేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రకటించారు. ఈ పథకానికి వచ్చే నెల 15 వరకు ప్రీమియం చెల్లించడానికి గడువుగా ప్రకటించారు. అకాల వర్షాలు, అధిక వర్షాలకు మామిడికి నష్టం జరిగితే ఈ పథకం కింద బీమా అందుతుంది. అలాగే రోజువారీ ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, గాలి వేగాలను బట్టి పంట నష్టం బీమా అందుతుంది. 5 నుంచి 15 ఏళ్ల చెట్టుకు రూ. 450, 16 నుంచి 50 ఏళ్లున్న చెట్టుకు రూ. 800 బీమా అందుతుంది. -
వరి రైతుకు వరం!
పరిగి: వరి రైతుకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పటి వరకు కేవలం మొక్కజొన్న పంటకు మాత్రమే వ్యవసాయ పంట బీమా వర్తింపజేస్తూ వచ్చిన సర్కారు.. తాజాగా వరికి కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. 2014-15 వ్యవసాయ సంవత్సరం నుంచి వరికి బీమా సౌకర్యం కల్పించేందుకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రబీ సీజన్ నుంచే జాతీయ వ్యవసాయ బీమా పథకంలో భాగంగా అమలు చేయనున్నారు. గతంలో జిల్లాలో మొక్కజొన్న పంటకు మాత్రమే బీమా ప్రీమియం చెల్లించేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. తాజాగా వరి రైతుకూ లబ్ధి చేకూర్చేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో అత్యధికంగా వరి సాగు చేస్తున్న రైతులకు ఇదెంతో ఉపశమనం కలిగించనుంది. బీమా పథకం గ్రామం యూనిట్‌గా తీసుకుని అమలు చేయనున్నారు. గణాంకశాఖ అధికారులు గ్రామం యూనిట్‌గా క్రాప్‌కటింగ్ విధానం ద్వారా పంట నష్టం దిగుబడి శాతాన్ని అంచనా వేసి బీమా వర్తించే గ్రామాలను గుర్తిస్తారు. ప్రీమియం చెల్లించిన రైతులకు బీమాను వర్తింపజేస్తారు. గడ్డు పరిస్థితుల్లో ఎంతో ఉపయోగం... జిల్లాలో ప్రధానంగా పరిగి, తాండూరు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్లో 30 వేల ఎకరాల వరకు సాగవుతోందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈసారి భూగర్భ జలాలు అడుగంటడం, పెరిగిన విద్యుత్ కోతలు, చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా వరి రైతుకు నష్టం కల్గించే ప్రమాదం ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం వరికి బీమా చెల్లించే అవకాశం కలిగించటం రైతుకు ఊరటనివ్వనుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొం టున్నారు. ప్రస్తుత సంకట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి రైతులంతా ప్రీమియం చెలించి బీమా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
పంటల బీమాపై అవగాహన కల్పించాలి
ఆదిలాబాద్ అర్బన్ : జాతీయ వ్యవసాయ బీమా పథకంపై రైతులకు అవగాహన కల్పించాలని అర్ధ గణాంక శాఖ డెప్యూటీ డెరైక్టర్(హైదరాబాద్) జి.దయానంద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ వ్యవసాయ బీమా పథకంపై వ్యవసాయ శాఖ, అర్ధ గణాంకశాఖ అధికారులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ రకాల పంటలకు బీమా పథకం వర్తింపుపై శిక్షణ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో పత్తి, సోయాబీన్, మిర్చి, పసుపు పంటలకు బీమా వర్తిస్తుందని చెప్పారు. సోయాబీన్ పంటకు బీమా వర్తిస్తుందని, దీనిపై ఈ ఏడాదిలో 589 యూనిట్లలో 2,542 పంట కోతల ప్రయోగాలు, వ్యవసాయ గణాంక శాఖ అధ్యయనం నిర్వహిస్తామని తెలిపారు. పంట కోతలను పర్యవేక్షిస్తూ దిగుబడిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ పంట కోతల ప్రయోగాలు సమగ్రంగా చేస్తే రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అధికారులు చేసే పంట కోతల ప్రయోగాల ద్వారానే రైతులకు బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. వివిధ రకాల పంటలపై నాణ్యతగా ప్రయోగాలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీవో షేక్మీరా, జేడీఏ రోజ్‌లీల, ఏడీ సత్యనారాయణ, ఎల్డీఎం శర్మ, అంజయ్య, వ్యవసాయ, గణాంక శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ముంచేశారు!
మొక్కజొన్న పంట బీమాకు ముగిసిన గడువు బీమా చెల్లింపుపై సమాచారమివ్వని యంత్రాంగం అధికారుల నిర్లక్ష్యంతో ప్రీమియం చెల్లించని రైతులు కరువు నేపథ్యంలో మొక్కజొన్నకు బీమా దక్కడం కష్టమే.. సాక్షి, రంగారెడ్డి జిల్లా: మొక్కజొన్న రైతులు నిండా మునిగారు. అసలే కరువు ప్రభావంతో పంట చేతికొచ్చే పరిస్థితిలేని తరుణంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి రైతాంగాన్ని మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. జిల్లాలో ప్రధాన పంటైన మొక్కజొన్నకు జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వర్తింపజేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం పేర్కొన్న నిర్దిష్ట తేదీలోగా ఆ పంటకు సంబంధించి రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మొక్కజొన్న పంట ఎకరాకు కనిష్టంగా ూ.150, గరిష్టంగా రూ.180 చొప్పున సాగుచేసిన విస్తీర్ణం మేరకు ప్రీమియం చెల్లించాలి. అయితే జిల్లా యంత్రాం గం ఈ పథకంపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ప్రీమియానికి సంబంధించి రైతులకు సమాచారం ఇవ్వడంలో విఫలమైంది. రెండ్రోజుల క్రితం ఈ అంశం పై ఒక ప్రకటన విడుదల చేసినప్పటి కీ.. అందులో సరైన వివరాలు ఇవ్వకుం డా తీవ్ర గందరగోళానికి గురిచేసింది. ముగిసిన గడువు.. మొక్కజొన్న పంట బీమాకు సంబంధించి ప్రీమియం చెల్లింపు గడువు గురువారం(జులై 31)తో ముగిసింది. జిల్లాలో 35,279 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగవుతోందని వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే వానలు కురవకపోవడంతో ఇప్పటివరకు 30,449 హెక్టార్లలో పంట సాగవుతున్నట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సాగుచేసిన రైతులంతా ప్రీమియం చెల్లించాలి. కానీ ఈ సమాచారం తెలియకపోవడంతో జిల్లాలోని 90శాతం రైతులు ప్రీమియం చెల్లించలేకపోయారు. తాజాగా గడువు ముగియడంతో ప్రీమియం చెల్లించే అవకాశం లేదు. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు చేలికొచ్చేది కష్టమేనని తెలుస్తోంది. దీంతో పంట బీమా చెల్లిస్తే రైతుకు కొంతైనా పరిహారం వచ్చేది. కానీ ప్రీమియం చెల్లించకపోవడంతో బీమా పథకానికి అనర్హులయ్యారు. ఫలితంగా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట చేతికందక నష్టాలపాలైతే రైతుకు భీమా దక్కే అవకాశం లేదు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపి ప్రీమియం చెల్లింపు గడువు పెంచితే తప్ప రైతుకు ప్రయోజనం చేకూరదు. -
పంటల బీమాకు స్పందన కరువు!
{పధాన పంటలకు రేపటితో ముగియనున్న గడువు ఇప్పటివరకు ప్రీమియం చెల్లించని రైతులు హైదరాబాద్: మరో రెండురోజులు మాత్రమే గడువు ఉన్నప్పటికీ రైతుల నుంచి పంటల బీమా పథకాలకు కనీస స్పందన కరువైంది. జాతీయ పంటల బీమా పథకం(ఎన్సీఐపీ), సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎంఎన్ఏఐఎస్) కింద ప్రధాన పంటల బీమాకు గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. వరి, పత్తి, టమాటా, ఎర్ర మిర్చి, కంది పంటలకు 31తో, బత్తాయి, ఆయిల్‌పామ్ పంటలకు ఆగస్టు 10తో, వేరుశనగకు ఆగస్టు 15తో బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగియనుంది. ఎన్సీఐపీ, ఎంఎన్ఏఐఎస్ల కింద జిల్లాల వారీగా వరి, కంది సహా వివిధ పంటలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పత్తి, గుంటూరులో మిర్చి, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో వేరుశనగ, చిత్తూరులో టమాటా, పశ్చిమ గోదావరిలో ఆయిల్‌పామ్, వైఎస్సార్ జిల్లాలో బత్తాయి పంటలను గుర్తించినట్టు పేర్కొంది. గ్రామం ఒక యూనిట్‌గా పంటల బీమా సౌకర్యం కల్పించింది. వర్షాలు కురవక పంట నష్టపోయిన రైతులకు బీమా మొత్తాన్ని చెల్లించాలన్నది ఈ పథకాల ఉద్దేశం. అరుుతే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రైతులు బీమా ప్రీమియం చెల్లించలేదు. పంట, సాగు విస్తీర్ణం, ఎంత మొత్తానికి బీమా అనే అంశాలపై ఈ ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇంతవరకు మాఫీ కాలేదు. రీ షెడ్యూల్ సైతం జరగలేదు. రుణాలు మాఫీ అవుతాయనే ఉద్దేశంతో రైతులు ఎప్పటినుంచో పాత బకారుులు చెల్లించడం మానుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎక్కడా పంటల బీమాకు స్పందన లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పంటల బీమా గడువును పొడిగించాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. -
హలధారీ.. బీమా హరీ
సాక్షి, ఏలూరు : మెరుగుపరిచిన జాతీయ వ్యవసాయ బీమా పథకం ఈ ఖరీఫ్‌లో రైతులకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జూలై నెలాఖరులోపు పంటవేసి ప్రీమియం చెల్లిం చిన వారికే బీమా వర్తిస్తుందనే నిబంధన ఉంది. కానీ.. ఇప్పటివరకూ రైతులకు కొత్త రుణాలు ఇవ్వలేదు. మరోవైపు వర్షాలు కురవడం లేదు. ఈ పరిస్థితుల్లో పంట ఆలస్యం కాకతప్పదు. ఈ కారణంగారైతులకు బీమా పథకం దూరం కానుంది. గడువు కుదించారు జిల్లాలో 2012 ఖరీఫ్ నుంచి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. తొలి ఏడాది 1,93,044 మంది రైతులు రూ.31.31 కోట్లను ప్రీమియం రూపంలో బ్యాంకుల ద్వారా బీమా కంపెనీకి చెల్లించారు. వారికి రూ.805.39 కోట్ల పరిహారం అందేలా బీమా చేశారు. కానీ.. నిబంధనల పేరుతో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రైతులకు దూరం చేయాలని చూసింది. బీమా ప్రీమియం దాదాపు 15 ఏళ్లుగా 2.25 శాతమే ఉండేది. అయితే 2012-13 కాలానికి దానిని 4 శాతం చేశారు. 2013-14 కాలానికి ప్రీమియంను 5 శాతానికి పెంచారు. అంటే రూ.లక్ష విలువ చేసే పంటకు బీమా చేయించాలంటే రూ.5 వేలు ప్రీమియం చెల్లించాలి. సాధారణంగా ప్రీమియం చెల్లించడానికి సెప్టెంబర్ నెలాఖరువరకూ గడువు ఉండేది. కానీ.. మన జిల్లాలో ప్రారంభంలోనే ఓ నెల తగ్గించి ఆగస్టు నెలాఖరు వరకే అవకాశం ఇచ్చారు. అప్పటికి పంటవేసి ఉండాలనే నిబంధన విధించారు. గతేడాది ఈ గడువును మరో నెల రోజులు కుదించారు. ప్రస్తుతం జూలై నెలాఖరులోగా ప్రీమి యం చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈ నిబంధనకు టీడీపీ ప్రభుత్వం నిర్వాకం తోడై పంటల బీమా పథకం అన్నదాతలకు దూరమవుతోంది. ఇవీ కారణాలు బ్యాంకులు రుణాలు ఇచ్చేప్పుడు ఎకరా వరి పంటకు రూ.579, చెరకు పంటకు రూ.730 నుంచి రూ.974 చొప్పున బీమా ప్రీమియంగా మినహాయించుకుంటాయి. బ్యాంకుల నుంచి రుణం పొందని వారు వ్యవసాయ శాఖ ద్వారా నేరుగా బీమా ప్రీమియం చెల్లించవచ్చు. అరయితే, ఈ ఏడాది టీడీపీ ఇచ్చిన రుణమాఫీ హామీతో రైతులు పాత రుణాలను బ్యాంకులకు తిరిగి చెల్లించలేదు. పాత బకాయిలు కడితే తప్ప కొత్త రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకులు తెగేసి చెబుతున్నారుు. రుణాలు మంజూరు కాకపోవడంతో పంటల బీమా ప్రీమియం చెల్లించే అవకాశం లేకుండాపోరుుంది. మరోవైపు వర్షాలు మొహం చాటేయడంతో నారుమళ్లు వేసేందుకు సాహసించడం లేదు. దీంతో వచ్చే నె లాఖరు నాటికి నాట్లు వేయడం అసాధ్యం. ఆ తర్వాత నాట్లు వేసినా.. బ్యాంకులు రుణాలిచ్చినా ప్రీమియం చెల్లింపు గడువు తీరిపోతుంది. దీనివల్ల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం రైతులకు ఉండదు. నష్టం వాటిల్లితే అంతే.. గతేడాది ఖరీఫ్‌లో ఆగస్టు 20వ తేదీ వరకూ ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించారు. కానీ ఈ విషయం బ్యాంకర్లకు, రైతులకు సకాలంలో చేరలేదు. అయినప్పటికీ జిల్లాలో 1,53,457 మంది రైతులు 2,69,479 హెక్టార్లలో పంటలకు బీమా చేయించుకున్నారు. 2012 ఖరీఫ్‌లో 1,93,044 మంది రైతులు 84,675 హెక్టార్లలో పంటకు బీమా చేయించారు. నీలం తుపాను, వరదల కారణంగా జిల్లాలో 1,41,258 హెక్టార్లలో వరి, 600 హెక్టార్లలో చెరకు దెబ్బతిన్నాయి. నష్టపోరుున రైతులకు బీమా పరిహారం కింద రూ.213 కోట్లు దక్కింది. హెలెన్ తుపాను, అధిక వర్షాల కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు దాదాపు రూ.103 కోట్ల మేర బీమా పరిహారం రానుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కళ్లాల్లో ఉన్న ధాన్యం రాశులకు నష్టం వాటిల్లినప్పుడు, వర్షాభావ పరిస్థితుల్లో విత్తనం మొలకెత్తనప్పుడు, వడగండ్ల వానలు కురిసినప్పుడు ఏర్పడే పంట నష్టానికి బీమా వర్తిస్తుంది. ఈ ఆశతోనే రైతులు బీమా ప్రీమియం చెల్లిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో బీమా ప్రీమియం చెల్లించేందుకు తక్కువ రోజులే మిగిలి ఉండటం, నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితి, రుణాలు అందకపోవడం వంటి కారణాల వల్ల జిల్లా రైతులు ఈ ఏడాది పంటల బీమా పథకానికి దూరమవుతున్నారు. -
ఏదీ ఆ ‘ధీమా’?
ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌లైన్: జాతీయ వ్యవసాయ భీమా పథకం 2000-01 నుంచి కేంద్ర, రాష్ట్రాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్నప్పటికీ దానికి కొత్త ఊపిరినిచ్చింది మాత్రం దివంగత మహానేత వైఎస్ రాజశే ఖరరెడ్డే. ఎప్పుడైతే వైఎస్ఆర్ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఈ పథకాన్ని దేశంలోనే తొలిసారి మనరాష్ట్రంలో అమలు చేశారో అప్పటి నుంచి ఈ పథకం సత్ఫలితాలు ఇవ్వసాగింది. నేటి పాలకులు ఈ బీమా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కరువుకాటకాలొచ్చినా బీమా పొందలేని స్థితికి ఈ పథకాన్ని దిగజార్చారు. గ్రామం యూనిట్‌గా చేసిన తర్వాత లక్షలాది మంది రైతులు అదనంగా బీమా పరిహారం పొందారు. బ్యాంకులు, కో-ఆపరేటివ్ సంఘాల నుంచి పంటల బీమా పథకంలో ప్రతిపాదించిన పంటలకు రుణం తీసుకున్న రైతులందరికీ బీమా వర్తిస్తుంది. పంట రుణం మంజూరు చేసేటప్పుడు బీమా ప్రీమియం మినహాయిస్తారు. పంట రుణం తీసుకోని రైతులు, కౌలు రైతులు కూడా పంటల బీమా చేసుకోసుకునే విధంగా నిర్ణయించారు. తొలుత మండలం యూనిట్‌గా బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ విధానంలో ప్రతిపాదించిన ప్రకారం కనీసం 2000 హెక్టార్లలో పంట సాగు చేయాలి. అప్పుడే దాన్ని ఒక యూనిట్‌గా పరిగణలోకి తీసుకునేవారు. అంతకన్నా తక్కువ ఉంటే పక్క మండలాన్ని కలుపుకొని బీమా యూనిట్‌గా నిర్ణయించారు. ఈ విధానంతో పంట నష్టపోయిన రైతులకు సరైన న్యాయం జరిగేది కాదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ పథకంలో విధానపరమైన మార్పులు తెచ్చారు. పంట బీమా చేసుకున్న రైతు ఆ బీమాపై నమ్మకం ఉండే విధంగా గ్రామాన్ని యూనిట్‌గా చేస్తూ పథకంలో మార్పు తీసుకువచ్చారు. ఈ పథకం అమలులో దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. మహానేత కృషి ఫలితంగా పథకం అమల్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. బీమా చేసిన పంటల విస్తీర్ణంలోనూ తొలిస్థానాన్ని ఆక్రమించింది. అత్యధిక మొత్తం బీమా పరిహారం చెల్లింపుల్లోనూ మొదటిస్థానమే. మహానేత మరణం తరువాత పథకానికి తూట్లు పడ్డాయి. 2010-11 సంవత్సరంలో ఈ పథకంలో సవరణలు చేశారు. బీమా వర్తింపునకు అనేక ని‘బంధనాలు’ విధించారు. జిల్లాలో ఒక ముఖ్యమైన పంటను గ్రామం యూనిట్‌గా అమలు చేయాలని నిర్ణయించారు. అదికూడా అనావృష్టి సంభవిసే..్త పంట వేయలేక పోతే కేవలం 25 శాతం బీమా వర్తింప చేసే విధానాన్ని ముందుకు తెచ్చారు. ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టం సంభవిస్తే వచ్చే పరిహారంలో 25 శాతం రైతు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని పథకంలో మార్పు తెచ్చారు. పంట నష్టాలను గత ఏడు సీజన్లకు సంబంధించి సరాసరి దిగుబడులను తీసుకొని లెక్కించే విధానాన్ని అమలు చేసే విధంగా మార్పులు తీసుకొచ్చారు. జాతీయ వ్యవసాయ బీమా పథకం పరిధిలోని పంటలు.. ఖరీఫ్: వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, మినుములు, కందులు, పెసలు, సోయాచిక్కుడు, వేరుశనగ (నీటి ఆధారం), వేరుశనగ వర్షాధారం, పొద్దుతిరుగుడు, ఆముదం, చెరకు (మొక్క), చెరకు (కార్శి), పత్తి (వర్షాధారం), పత్తి (నీటి ఆధారం), మిరప (వర్షాధారం), మిరప (నీటి ఆధారం), పసుపు, కొర్ర రబీ: వరి, జొన్న, మొక్కజొన్న, మినుములు, పెసలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఎర్ర మిరప, ఉల్లి, శనగలు గ్రామం యూనిట్‌గా బీమా పథకాన్ని వర్తింప చేయకుండా జిల్లాలో ప్రధాన పంటను మాత్రమే గ్రామం యూనిట్‌గా పరిగణలోకి తీసుకొని మిగిలిన పంటలను గతంలో మాదిరిగానే మండలం యూనిట్‌గా అమలు చేసేలా పథకాన్ని సవరించారు. ఈ విధానం అమల్లోనూ అనేక మార్పులు తీసుకురావటంతో పథకంపై రైతులకు నమ్మకం పోయింది. ఖరీఫ్ పంట విస్తీర్ణం దాదాపు నాలుగు లక్షల హెక్టార్లు కాగా 1.67 లక్షల హెక్టార్లలో పత్తి, 1.38 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. గ్రామం యూనిట్‌గా కేవలం వరి పంటను మాత్రమే ఎంపిక చేశారు. మండలం యూనిట్‌గా మొక్కజొన్న, కంది, పెసర, వేరుశనగ, చెరకు పంటలను ఎంపిక చేశారు. వాణిజ్య పంటలైన పత్తి, మిర్చిని గ్రామం యూనిట్లో గానీ, మండలం యూనిట్లో గానీ పరిగణించలేదు. రబీ సీజన్లో గ్రామం యూనిట్‌గా ఏ ఒక్క పంటా లేదు. మండలం యూనిట్‌గా జిల్లాలో వరి, జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర, వేరుశనగ మిరప పంటలను మాత్రమే ఎంపిక చేశారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం పంట దిగుబడి ఆధారంగా కాకుండా వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ, గాలి ఉధృతి వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని వాతావరణ బీమా పథకాన్ని రైతు ప్రయోజనం కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 2009 ఖరీఫ్ సీజన్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ప్రస్తుత పాలకులు ఈ పథకంపై అంత శ్రద్ధ చూపటం లేదు. కాగితాల్లో మాత్రం లెక్కలు చూపుతోంది. వాతావరణ ఆధారిత పంటల బీమా కింద ఖరీఫ్కాలంలో జిల్లా నుంచి పత్తి, మిరప, ఆయిల్ఫామ్ను ఎంపిక చేశారు. ఇదే పథకం కింద మామిడిని రబీ సీజన్‌కు ఎంపిక చేశారు. బీమా పథకం అమలు విధానం.. నష్ట పరిహారం అంచనాలను నిర్దేశించిన ప్రాంతాల (మండలం/గ్రామం) ఆధారంగా అంచనా వేస్తారు. బీమా చేసిన పంట హామీ దిగుబడి కన్నా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన సరాసరి దిగుబడి తగ్గితే..తగ్గుదల శాతాన్ని బట్టి ఆ మండలంలో బీమా చేసిన రైతుల పంటలకు నష్టపరిహారం లభిస్తుంది. ఈ నష్టపరిహారాలను బ్యాంకు ఖాతాలోనే వేయాలి. జిల్లా సహకారబ్యాంక్, గ్రామీణ వికాసబ్యాంక్, వాణిజ్యబ్యాంక్ల నుంచి ప్రతిపాదిత పంటకు రుణాలు తీసుకున్న రైతులకు ఈ పథకం తప్పనిసరిగా వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించడానికి 2005లో మహానేత ఈ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం రైతుల్లో మనోస్థైర్యాన్ని నింపింది. పంటనష్టాలు సంభవిస్తే రెండు నెలల్లో పంట నిర్దిష్టమైన హామీ దిగుబడి కన్నా తగ్గితే నష్టపరిహారం చెల్లించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బీమా చెల్లింపుల్లో కూడా అనేక మార్పులు వచ్చాయి. 2005 నుంచి 2009 వరకు నిర్దేశించిన విధంగా బీమా మొత్తాన్ని చెలించేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఉంది. రైతుల నుంచి ప్రీమియం నిర్దేశించిన ప్రకారం వసూలు చేస్తున్నారు కానీ చెల్లింపులో వివిద సాకులు చూపుతూ తక్కువగా చెల్లిస్తున్నారు. బీమా చెల్లింపుల్లో బాగా జాప్యం అవుతోంది. 2008-09లో జిల్లాలో పంటనష్టాలు అంతగా లేవు. అధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన వారికి బీమాను వర్తింపచేశారు. ఆ ఏడాది రూ.72.76 లక్షలు బీమా కింద పంట నష్టపోయిన రైతులకు అందించారు. 2009-10లో జిల్లాలో రూ.10.79 కోట్లు రైతులకు చెల్లించారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి మరణానంతరం 2011-12 లో అనావృష్టి నెలకొంది. అయినా జిల్లాలో పంటల బీమా నష్టాన్ని అతి తక్కువగా చేసి చూపించారు. కేవలం 10,749 మంది రైతులను మాత్రమే బీమా పథకానికి ఎంపిక చేశారు. ఈ రైతులకు కూడా నిబంధనల ప్రకారం బీమా మొత్తాలు చెల్లించకుండా అందులో నాల్గో వంతును మాత్రమే చెల్లించారు. రూ.41.60 కోట్లు బీమా మొత్తం కాగా వీటిలో కేవలం రూ.12.55 కోట్లు మాత్రమే చెల్లించారు. 2012 తరువాత బీమా లెక్కలను ఇంకా తేల్చలేదు. పంట ఎండినా రైతు నష్టపోకుండా మహానేత గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని రూపొందించిన పంటల బీమా పథకం నీరుగారిపోతుంది.