- మొక్కజొన్న పంట బీమాకు ముగిసిన గడువు
- బీమా చెల్లింపుపై సమాచారమివ్వని యంత్రాంగం
- అధికారుల నిర్లక్ష్యంతో ప్రీమియం చెల్లించని రైతులు
- కరువు నేపథ్యంలో మొక్కజొన్నకు బీమా దక్కడం కష్టమే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మొక్కజొన్న రైతులు నిండా మునిగారు. అసలే కరువు ప్రభావంతో పంట చేతికొచ్చే పరిస్థితిలేని తరుణంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి రైతాంగాన్ని మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. జిల్లాలో ప్రధాన పంటైన మొక్కజొన్నకు జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వర్తింపజేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం పేర్కొన్న నిర్దిష్ట తేదీలోగా ఆ పంటకు సంబంధించి రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మొక్కజొన్న పంట ఎకరాకు కనిష్టంగా ూ.150, గరిష్టంగా రూ.180 చొప్పున సాగుచేసిన విస్తీర్ణం మేరకు ప్రీమియం చెల్లించాలి. అయితే జిల్లా యంత్రాం గం ఈ పథకంపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ప్రీమియానికి సంబంధించి రైతులకు సమాచారం ఇవ్వడంలో విఫలమైంది. రెండ్రోజుల క్రితం ఈ అంశం పై ఒక ప్రకటన విడుదల చేసినప్పటి కీ.. అందులో సరైన వివరాలు ఇవ్వకుం డా తీవ్ర గందరగోళానికి గురిచేసింది.
ముగిసిన గడువు..
మొక్కజొన్న పంట బీమాకు సంబంధించి ప్రీమియం చెల్లింపు గడువు గురువారం(జులై 31)తో ముగిసింది. జిల్లాలో 35,279 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగవుతోందని వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే వానలు కురవకపోవడంతో ఇప్పటివరకు 30,449 హెక్టార్లలో పంట సాగవుతున్నట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సాగుచేసిన రైతులంతా ప్రీమియం చెల్లించాలి. కానీ ఈ సమాచారం తెలియకపోవడంతో జిల్లాలోని 90శాతం రైతులు ప్రీమియం చెల్లించలేకపోయారు.
తాజాగా గడువు ముగియడంతో ప్రీమియం చెల్లించే అవకాశం లేదు. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు చేలికొచ్చేది కష్టమేనని తెలుస్తోంది. దీంతో పంట బీమా చెల్లిస్తే రైతుకు కొంతైనా పరిహారం వచ్చేది. కానీ ప్రీమియం చెల్లించకపోవడంతో బీమా పథకానికి అనర్హులయ్యారు. ఫలితంగా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట చేతికందక నష్టాలపాలైతే రైతుకు భీమా దక్కే అవకాశం లేదు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపి ప్రీమియం చెల్లింపు గడువు పెంచితే తప్ప రైతుకు ప్రయోజనం చేకూరదు.