వరి రైతుకు వరం!
పరిగి: వరి రైతుకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పటి వరకు కేవలం మొక్కజొన్న పంటకు మాత్రమే వ్యవసాయ పంట బీమా వర్తింపజేస్తూ వచ్చిన సర్కారు.. తాజాగా వరికి కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. 2014-15 వ్యవసాయ సంవత్సరం నుంచి వరికి బీమా సౌకర్యం కల్పించేందుకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రబీ సీజన్ నుంచే జాతీయ వ్యవసాయ బీమా పథకంలో భాగంగా అమలు చేయనున్నారు.
గతంలో జిల్లాలో మొక్కజొన్న పంటకు మాత్రమే బీమా ప్రీమియం చెల్లించేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. తాజాగా వరి రైతుకూ లబ్ధి చేకూర్చేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో అత్యధికంగా వరి సాగు చేస్తున్న రైతులకు ఇదెంతో ఉపశమనం కలిగించనుంది. బీమా పథకం గ్రామం యూనిట్‌గా తీసుకుని అమలు చేయనున్నారు. గణాంకశాఖ అధికారులు గ్రామం యూనిట్‌గా క్రాప్‌కటింగ్ విధానం ద్వారా పంట నష్టం దిగుబడి శాతాన్ని అంచనా వేసి బీమా వర్తించే గ్రామాలను గుర్తిస్తారు. ప్రీమియం చెల్లించిన రైతులకు బీమాను వర్తింపజేస్తారు.
గడ్డు పరిస్థితుల్లో ఎంతో ఉపయోగం...
జిల్లాలో ప్రధానంగా పరిగి, తాండూరు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్లో 30 వేల ఎకరాల వరకు సాగవుతోందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈసారి భూగర్భ జలాలు అడుగంటడం, పెరిగిన విద్యుత్ కోతలు, చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా వరి రైతుకు నష్టం కల్గించే ప్రమాదం ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం వరికి బీమా చెల్లించే అవకాశం కలిగించటం రైతుకు ఊరటనివ్వనుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొం టున్నారు. ప్రస్తుత సంకట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి రైతులంతా ప్రీమియం చెలించి బీమా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.