Paddy farmer
-
Red Rice: ఎర్ర బియ్యం అమ్మాయి
ఆన్లైన్ క్లాసులు పూర్తయ్యాక ఆ అమ్మాయి చేనులో అడుగుపెట్టేది. ముప్పావు ఎకరా చేను. తండ్రి కూరగాయలు పండించేవాడు. ‘కొత్తగా ఎర్రబియ్యం పండిద్దామా’ అన్నాడు. ‘సరే నాన్నా’ అందా ఎనిమిదో క్లాసు చదివే కూతురు. ‘రక్తశాలి’ రకం ఎర్రబియ్యంలో ఆరోగ్య విలువలు ఎక్కువ. వాటిని పండించేవాళ్లు కూడా అరుదు. కాని ఆ కూతురు తండ్రితో కలిసి 300 కేజీల దిగుబడి సాధించింది. ఈ మార్చికి ఆ అమ్మాయి తొమ్మిదికి వస్తుంది. ‘పరీక్షలు రాసి ఈసారి బాసుమతి పండిస్తా’ అని చెబుతోంది. హోమ్‌వర్క్ చేయడమే పెద్ద పనిగా భావించే పిల్లలకు బదులు ఏకంగా పంటనే పండిస్తున్న టీన్ రైతు బానుప్రియ. ఈ కేరళ కథ చదవండి. ‘ఎప్పుడైతే పొలంలోకి అడుగుపెట్టిందో నా కూతురు సీతాకోక చిలుకలా ఎగిరింది’ అన్నాడు దయత్‌మజి తన కుమార్తె భానుప్రియను చూస్తూ. వాళ్లది కేరళ అలెప్పి సమీపంలో ఉన్న కల్లాపురం గ్రామం. వారికి అక్కడ ముప్పావు ఎకరా పొలం ఉంది. దయత్‌మజి కొబ్బరి పీచు వ్యాపారం చేస్తూనే పొలంలో కూరగాయలు పండిస్తున్నాడు. ఇద్దరు కూతుళ్లు. అదే ఊళ్లోని గవర్నమెంట్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న భానుప్రియ పెద్ద కూతురు. ‘2021 వేసవిలో లాక్డౌన్ విధించాక నా ఇద్దరు పిల్లలు బోర్ ఫీలయ్యారు. ఆన్లైన్ క్లాసులు కాసేపే కావడంతో మిగిలిన టైమ్ కంప్యూటర్, ఫోన్ ముందు గడపసాగారు. భాను బాగా బోర్ ఫీలయ్యింది. అలాగే వదిలితే పిల్లల మానసిక ఆరోగ్యం పాడవుతుందని భావించాను. మనం బియ్యం పండిద్దాం.. అదీ ఎర్ర బియ్యం అని భానుకు చెప్పాను. అదేదో కొత్తగా ఉందని తనూ ఉత్సాహం తెచ్చుకుంది’ అంటాడు దయత్‌మజి. తండ్రి ఎర్రబియ్యం పండిద్దాం అని చెప్పాక భాను పెద్ద సైంటిస్ట్ అవతారమే ఎత్తింది. నెట్లో ఆ పంట గురించి చదివి వివరాలు తెలుసుకుంది. వ్యవసాయ శాఖ వారికి కూడా ఫోన్లు కొట్టి రకరకాల ప్రశ్నలు వేసింది. రైతు అవతారం ఎత్తుతున్నట్టు తన ఫ్రెండ్స్‌కు చెప్పింది. తండ్రి దయత్మజితో భానుప్రియ ‘నాన్న ఎర్రబియ్యం పండిద్దామన్నాడు. అప్పటి వరకూ మేము బెండ, దోస, పెసల వంటివి పండించే వాళ్లం. నేను పెద్దగా పొలానికి వెళ్లేదాన్ని కాదు. ఇప్పుడు ఎర్రబియ్యం అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. పైగా మా ఊళ్లో ఆ బియ్యం పండిస్తున్నది మేమే మొదట. దానిని రక్తశాలి రకం అంటారు. ఇది అంతరించి పోతున్న వరి వంగడం. సేంద్రియ పద్ధతిలో పండిస్తే ఈ బియ్యంలో ఉండేంత పోషకాలు మరే బియ్యంలో ఉండవు. జింక్, మినరల్స్, ఐరన్, కాల్షియం... ఇవన్నీ ఉంటాయి. కాని మిగిలిన వరి వంగడాలతో పోలిస్తే లాభం పెద్దగా ఉండదని చాలా మంది వేయరు. కాని మేం వేద్దామనుకున్నాం’ అంటుంది భానుప్రియ. ట్రాక్టర్ తెప్పించి పొలం దున్నడం మినహా మిగిలిన పనులన్నీ తండ్రీ కూతుళ్లే చూశారు. ‘నారు పోయడం, తడి ఎంత అవసరమో చూసుకోవడం, సేంద్రియ ఎరువులు చల్లడం... ఇవన్నీ భానుయే చూసుకుంది’ అన్నాడు దయత్‌మజి.‘మేము మేలో పంట వేశాము. అయితే ఆ వెంటనే వచ్చిన వానలతో అందరి చేలతో పాటు మా చేనూ మునిగిపోయింది. వేసిన నారు వృధా అయిపోయింది. అయినా సరే మళ్లీ ఇదే పంట వేద్దామనుకున్నాం. వేశాం. నాలుగు నెలల పంట ఇది. సెప్టెంబర్ నాటికి మా పొలం కోతకు సిద్ధమైంది’ అంది భానుప్రియ. ఈ తండ్రీకూతుళ్లు పండిస్తున్న ఎర్రబియ్యం వార్త చుట్టుపక్కలకు వ్యాపించింది. కోత సమయంలో కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్ స్వయంగా హాజరయ్యాడు. పంట చేతికి వచ్చాక తూకం వేస్తే 300 కిలోల బియ్యం వచ్చాయి. ఇది మంచి దిగుబడి కింద లెక్క. ‘కొన్ని బియ్యం బంధువులకు, ఫ్రెండ్స్‌కు ఇచ్చాం. మిగిలినవి వాట్సప్ గ్రూప్‌లలో ప్రచారం జరిగి క్షణాల్లో అమ్ముడుపోయాయి. ఇప్పుడు మా ఇంట్లో ఎర్ర బియ్యమే వండుతున్నాం’ అంది భానుప్రియ. ఆమె చేసిన కృషికి వ్యవసాయ శాఖ, ఆ ఊరి పంచాయతీ కలిసి ‘బాల రైతు’ బిరుదు ఇచ్చి గౌరవించాయి. భానుప్రియకు ఇంకా ఎనిమిదవ తరగతి పూర్తి కాలేదు. ఇప్పుడు తన పొలంలో మళ్లీ కూరగాయలు వేస్తున్నారు. పరీక్షలు రాసే సమయానికి నారుకాలం వస్తుంది. ‘ఈసారి నేను బాస్మతి పండించాలని అనుకుంటున్నా’ అంది భాను. -
అప్పుల కుప్పపై చి‘వరి’ శ్వాస
ఏటూరునాగారం: ధాన్యం కొనుగోళ్లలో కొనసాగుతున్న తీవ్ర జాప్యం ఓ అన్నదాతను బలిగొంది. కోసిన కొంత పంట అమ్ముడు కాక.. మిగిలిన పంట కోసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక.. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పుల భారం భరించలేక ధాన్యం రాశివద్దే పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివాపురంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బెతెల్లి కుమార్ (43) రైతు తనకున్న రెండెకరాల సొంత భూమితోపాటు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మొత్తం 8 ఎకరాల్లో వరి సాగు చేశాడు. అందులో 6 ఎకరాల వరి పంట కోయించాడు. శివాపురంలో ధాన్యం కేంద్రం ప్రారంభమైనా అధికారులు కొనుగోళ్లు మొదలు పెట్టలేదు. తేమశాతం తగ్గేందుకు 6 ఎకరాల ధాన్యాన్ని ఇంటి పెరడులో ఆరబోశాడు. ఉదయం ఆరబోయడం, రాత్రి కుప్పపోయడం చేస్తున్నాడు. అధికారులు కొనుగోళ్లు ప్రారంభిస్తే తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో మరో రెండు ఎకరాల వరి కోతకు వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. గత ఏడాది అప్పు రూ.3లక్షల భారం నెత్తిమీద ఉంది. దీనికితోడు ఇటీవల కురిసిన వర్షాలకు వరినేలబారిగా దిగుబడి తగ్గింది. ఇటు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేక.. మిగతా వరిని కోసేందుకు డబ్బులు లేకపోవడం.. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కొన్నిరోజులు దిగులుగా ఉన్నాడు. మంగళవారం రాత్రి పెరడులో ఉన్న ధాన్యం రాశివద్దే పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఏటూరునాగారం, అక్కడినుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశాడు. మృతునికి భార్య రాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
మార్కెట్‌యార్డులో యువరైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి, నల్గొండ : అధికారుల నిర్లక్ష్య వైఖరికి మనస్తాపం చెందిన ఓ యువరైతు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మార్కెట్ యార్డులో గురువారం జరిగింది. హకుల్ అనే రైతు పదిహేను రోజుల క్రితం వరిధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చాడు. కానీ, తేమ ఉందని చెప్పిన అధికారులు అతని ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. దళారీలు తెచ్చిన ధాన్యాన్ని మాత్రం ఏ అభ్యంతరం లేకుండా కొనుగోలు చేయడం గమనించిన హకుల్ వారితో గొడవకు దిగాడు. నీ దిక్కున్న చోట చెప్పుకో అని అధికారులు సమాధానమివ్వడంతో మనస్తాపం చెందిన ఆ రైతన్న మార్కెట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడున్న వారు స్పందించి అతన్ని ఆస్పత్రికి తరలించారు. బాధితుని ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : నల్గొండలో యువరైతు ఆత్మహత్యాయత్నం -
నల్గొండలో యువరైతు ఆత్మహత్యాయత్నం
-
వరి రైతుకు వరం!
పరిగి: వరి రైతుకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పటి వరకు కేవలం మొక్కజొన్న పంటకు మాత్రమే వ్యవసాయ పంట బీమా వర్తింపజేస్తూ వచ్చిన సర్కారు.. తాజాగా వరికి కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. 2014-15 వ్యవసాయ సంవత్సరం నుంచి వరికి బీమా సౌకర్యం కల్పించేందుకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రబీ సీజన్ నుంచే జాతీయ వ్యవసాయ బీమా పథకంలో భాగంగా అమలు చేయనున్నారు. గతంలో జిల్లాలో మొక్కజొన్న పంటకు మాత్రమే బీమా ప్రీమియం చెల్లించేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. తాజాగా వరి రైతుకూ లబ్ధి చేకూర్చేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో అత్యధికంగా వరి సాగు చేస్తున్న రైతులకు ఇదెంతో ఉపశమనం కలిగించనుంది. బీమా పథకం గ్రామం యూనిట్‌గా తీసుకుని అమలు చేయనున్నారు. గణాంకశాఖ అధికారులు గ్రామం యూనిట్‌గా క్రాప్‌కటింగ్ విధానం ద్వారా పంట నష్టం దిగుబడి శాతాన్ని అంచనా వేసి బీమా వర్తించే గ్రామాలను గుర్తిస్తారు. ప్రీమియం చెల్లించిన రైతులకు బీమాను వర్తింపజేస్తారు. గడ్డు పరిస్థితుల్లో ఎంతో ఉపయోగం... జిల్లాలో ప్రధానంగా పరిగి, తాండూరు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్లో 30 వేల ఎకరాల వరకు సాగవుతోందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈసారి భూగర్భ జలాలు అడుగంటడం, పెరిగిన విద్యుత్ కోతలు, చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా వరి రైతుకు నష్టం కల్గించే ప్రమాదం ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం వరికి బీమా చెల్లించే అవకాశం కలిగించటం రైతుకు ఊరటనివ్వనుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొం టున్నారు. ప్రస్తుత సంకట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి రైతులంతా ప్రీమియం చెలించి బీమా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
విత్తనాలు సిద్ధం
30 వేల క్వింటాళ్ల సబ్సిడీ వరి విత్తనాలు మంజూరు బీపీటీ 27 వేలు, 1061 రకం 3 వేల క్వింటాళ్లు కేజీకి రూ.5 సబ్సిడీతో పంపిణీ సాగు ఆలస్యమైనందున బీపీటీకే ప్రాధాన్యం గుడివాడ : జిల్లాలో ఖరీఫ్ రైతుకు ఎట్టకేలకు సబ్సిడీ వరి విత్తనాలు అందనున్నాయి. ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం వరి విత్తనాలపై సబ్సిడీ ఎత్తివేయటంతో తమపై పెద్ద ఎత్తున భారం పడనుందని రైతాంగం ఆందోళన చెందారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు కూడా సబ్సిడీని కొనసాగించాలని రైతుల తరఫున తమ వాణి వినిపించారు. దీంతో స్పందించిన సర్కారు జిల్లా రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలు అందించేందుకు రంగం సిద్ధం చేసింది. 30 వేల క్వింటాళ్లు పంపిణీకి సిద్ధం... జిల్లాలోని రైతాంగానికి సబ్సిడీపై వరి విత్తనాలు అందించాలని వ్యవసాయశాఖ తరఫున ఆదేశాలు వచ్చాయి. మంగళవారం ఉదయం నుంచి మండలాల్లో సబ్సిడీ వరి విత్తనాలు అందిస్తారని వ్యవసాయ శాఖ జిల్లా జేడీ ఈ నర్సింహులు ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ సీడ్స్ ద్వారా ఈ విత్తనాలు అందిస్తామని ఆయన చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 30 వేల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేస్తున్నామని వివరించారు. వీటిలో బీపీటీ రకం 27 వేల క్వింటాళ్లు, 1061 రకం విత్తనాలు మూడువేల క్వింటాళ్లు అందిస్తున్నామన్నారు. కేజీకి రూ.5 చొప్పున సబ్సిడీ ఇవ్వనుండటంతో జిల్లా వ్యాప్తంగా రైతులకు రూ.1.50 కోట్ల మేరకు లబ్ధి చేకూరనుందని వివరించారు. ఇప్పటికే సాగు ఆలస్యం అవుతున్నందున తక్కువ రోజుల్లో పంట చేతికొచ్చే బీపీటీ రకం విత్తనాలపైనే రైతులు ఆసక్తి చూపుతారని జిల్లా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాటినే ఎక్కువ మొత్తంలో సరఫరా చేస్తున్నామని చెప్పారు. విత్తనాల సబ్సిడీ ఇలా... బీపీటీ విత్తనం అసలు ధర కేజీకి రూ.27.50 కాగా రూ.5 సబ్సిడీ పోగా రూ.22.50 చెల్లించాల్సి ఉందని జిల్లా అధికారులు తెలిపారు. 25 కేజీల బస్తాకు రూ.562.50 చెల్లించాలని చెప్పారు. 1061 రకం కేజీ రూ.25.20 కాగా రూ.5 సబ్సిడీ పోను, రూ.20.20 చెల్లించాలన్నారు. 30 కేజీల బస్తాకు రూ.606 చెల్లించాల్సి ఉందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. -
కన్నీటి సేద్యం తప్పదా?
సాగునీటి కోసం ఖరీఫ్ రైతు ఎదురుచూపు వెనక్కి వెళ్లిన వర్షాలు మాయమైన అల్పపీడనం మళ్లీ పాత రోజులు విజయవాడ సిటీ : ఖరీఫ్ సాగు చేసి ఆర్థిక బాధలనుంచి కాస్త ఒడ్డున పడాలనుకుంటున్న రైతులకు నిరాశ తప్పేట్టులేదు.గడువు ముగిసినా ఇంతవరకు సాగర్‌జలాలను విడుదల చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. మళ్లీ పాత రోజులు పునరావృతమవుతాయేమోనని భయపడిపోతున్నారు. గత కొద్ది రోజులుగా రుతుపవనాలు దోబూచులాడుతున్నాయి. అల్పపీడనం ఏర్పడినట్లే ఏర్పడి అల్లంతలో మటుమాయమైంది. రైతాంగం వారం రోజులుగా వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. రోహిణీ కార్తె వెళ్లి, మృగ శిర కార్తె వచ్చి ఒక పాదం గుడుస్తున్నా, వర్షాలు కురవక పోగా తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. ఏరోజు కారోజు మబ్బులు కమ్మి వర్షం పడకుండానే రోజులు గడిచిపోతున్నాయి. దాంతో ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడతాయో లేదోననే ఆందోళనలో అన్నదాతలున్నారు. వర్షాలు కురిస్తేనే సాగర్‌నుంచి సాగునీరు వదిలే వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. వర్షాలు పడకపోతే సాగర్ నుంచి నీరు వదిలే అవకాశం లేదని, ఒకవేళ వర్షాలు కురిసినా రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణానదిలోకి నీరు విడుదల అనుమానమేనంటున్నారు. నేటివరకు సాగుకు నీటి విడుదల విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. గత సంవత్సరం జూన్ 3వ తేదీనే సాగుకు నీరు విడుదల చేశారు. ఈ క్రమంలో నెలాఖరు నాటికి కూడా సాగునీరు వదిలేది అనుమానమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. జూన్ మొదటి వారం, లేదా కనీసం 15తేదీలోగా నీరు విడుదలైతే ఖరీఫ్‌కు ఇబ్బంది లేకుండా ఉంటుందని రైతాంగం భావిస్తున్నారు. గత సంవత్సరం ఖరీఫ్, రబీలో 207.07 క్యూసెక్కుల నీరు కృష్ణా డెల్టాకు విడుదల చేశారు. సముద్రంలోకి 399.24 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. గత ఏడాది జూలైలో కృష్ణా తూర్పు కాలువకు 3.70, ఆగస్టులో 22.02, సెప్టెంబర్‌లో 24.02, అక్టోబర్‌లో 13.63, నవంబర్‌లో 12,77, డిసెంబర్లో 4.62 టీఎంసీలు విడుదల చేశారు. కృష్ణా పశ్చిమ కాలువకు జూన్‌లో 0.13, జూలై 1.81, ఆగస్టు 14.14, సెప్టెంబర్ 12.50, అక్టోబర్ 6.91, నవంబర్ 9.25, డిసెంబర్లో 6.53 టీఎంసీల నీరు విడుదల చేశారు. ఖరీఫ్ నీటివిడుదలను డిసెంబర్ 22తో నిలిపి వేశారు. ఇక రబీలో కేఈ మెయిన్ కాలువకు జనవరిలో 13,84, ఫిభ్రవరిలో 11.00, మార్చిలో 16.86, ఏప్రిల్‌లో 10.14 టీఎంసీల నీరు వదిలారు. కేడబ్ల్యూ మెయిన్ కాలువకు జనవరిలో 7.46, ఫిభ్రవరిలో 5.57, మార్చిలో 7.90, ఏప్రిల్‌లో 2.30 టీఎంసీల నీరు వదిలారు. గత ఏడాది ఖరీఫ్‌లో 129.59, రబీలో 77.47 టీ ఎంసీల నీటిని వినియోగించుకున్నారు. ఈ ఏడాది కూడా అదే విధంగా సాగునీరు అవసరం ఉంటుందని అధికారులు చెపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణా ప్రాంతంలో వర్షాలు పడితేనే దిగువనున్న కృష్ణానదిలోకి నీరు వస్తుందని లేకుంటే సాగునీరు విడుదలపై ఆశవదులుకోవాల్సిందేనని రైతులు ందోళన చెందుతున్నారు. -
రుణాను‘బంధనం’
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : రుతుపవనాలు రాకముందే వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్‌కు రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పంట సాగుకు సిద్ధమవుతున్నప్పటికీ.. పెట్టుబడులకు రుణాల కోసం బ్యాంకుల వైపు ఎదురుచూస్తున్నారు. అయితే రుణ లక్ష్యాన్ని అధికారులు నిర్ధేశించినప్పటికీ.. వాటి మంజూరు విషయంలో గందరగోళ పరిస్థితులు తలెత్తనున్నాయి. ప్రధానంగా రుణాల రెన్యువల్స్‌పై నీలినీడ లు కమ్ముకుంటున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న హామీ రైతులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టింది. ఇప్పటికీ కొత్త ప్రభుత్వం కొలువుతీరకపోవడం.. రుణమాఫీ ఫైలుపై సంతకం చేయకపోవడం...ఖరీఫ్ సీజన్ తరుముకొస్తుండటం...పాత రుణాలు చెల్లించకపోవడంతో కొత్త రుణాల మంజూరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధికారులు మాత్రం ఖరీఫ్-2014కు పంట రుణ లక్ష్యాన్ని రూ.700 కోట్లుగా నిర్ధేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మేర రుణాలను మంజూరు చేస్తారన్న విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 లక్షల మందికి రుణాలు ఖరీఫ్ ప్రణాళిక సిద్ధమైంది. జిల్లాలో 2,27,400 హెక్టార్లలో పంటలు చేపట్టాలని వ్యవసాయాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సీజన్లో మొత్తం 2 లక్షల 304 మంది రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో కొత్త వారి కంటే రెన్యువల్స్‌కే అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్ధేశించారు. ఈ సీజన్లో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు మాత్రమే రుణాలను అందించనున్నారు. రెన్యువల్స్ విషయానికి వస్తే 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత సీజన్లో రూ.600 కోట్లు ఖరీఫ్ లక్ష్యం కాగా 1,32,375 మంది రైతులకు రూ.640 కోట్లు మంజూరు చేశారు. గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తుపాన్లు, అల్పపీడనం కారణంగా వరదలు వచ్చి పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. రెన్యువల్స్ డౌటే...! ఎన్నికలకు ముందు అధికారంలోకి రాగానే రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తామని టీడీపీ ప్రకటించడంతో నష్టాల్లో ఉన్న రైతులు రుణాలను చెల్లించేందుకు ఆసక్తి చూపించడం లేదు. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో వారికి రుణాలు రెన్యువల్స్ చేసే అవకాశం లేదని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. అయినప్పటికీ రుణమాఫీ జరుగుతుందన్న ఆశతో రైతులు ఉన్నారు. రుణమాఫీ జరిగితే జిల్లాలో 2,10,881 మంది రైతులకు మేలు జరగనుంది. అలాగే 1,42,093 మందికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాల రెన్యువల్స్ జరగనున్నాయి. ఒకవేళ రుణమాఫీ ఫైలుపై సంతకం చేయడం ఆలస్యమైతే ఖరీఫ్ సీజన్ ముగియడంతో పాటు రుణ లక్ష్యం నీరుగారనుంది. అదే రుణాలను రద్దు చేయకపోతే రెన్యువల్స్‌కు అవకాశముండదని బ్యాంకర్లు చెబుతున్నారు. రుణమాఫీ జరుగుతుందో లేదో ఇంకా స్పష్టత లేదని, అప్పటి వరకు కొత్త రుణాల మంజూరు విషయంలో గందరగోళం తప్పదని పేర్కొంటున్నారు.