భానుప్రియ
ఆన్‌లైన్ క్లాసులు పూర్తయ్యాక ఆ అమ్మాయి చేనులో అడుగుపెట్టేది. ముప్పావు ఎకరా చేను. తండ్రి కూరగాయలు పండించేవాడు. ‘కొత్తగా ఎర్రబియ్యం పండిద్దామా’ అన్నాడు. ‘సరే నాన్నా’ అందా ఎనిమిదో క్లాసు చదివే కూతురు. ‘రక్తశాలి’ రకం ఎర్రబియ్యంలో ఆరోగ్య విలువలు ఎక్కువ.
వాటిని పండించేవాళ్లు కూడా అరుదు. కాని ఆ కూతురు తండ్రితో కలిసి 300 కేజీల దిగుబడి సాధించింది. ఈ మార్చికి ఆ అమ్మాయి తొమ్మిదికి వస్తుంది. ‘పరీక్షలు రాసి ఈసారి బాసుమతి పండిస్తా’ అని చెబుతోంది. హోమ్‌వర్క్ చేయడమే పెద్ద పనిగా భావించే పిల్లలకు బదులు ఏకంగా పంటనే పండిస్తున్న టీన్ రైతు బానుప్రియ. ఈ కేరళ కథ చదవండి.
‘ఎప్పుడైతే పొలంలోకి అడుగుపెట్టిందో నా కూతురు సీతాకోక చిలుకలా ఎగిరింది’ అన్నాడు దయత్‌మజి తన కుమార్తె భానుప్రియను చూస్తూ. వాళ్లది కేరళ అలెప్పి సమీపంలో ఉన్న కల్లాపురం గ్రామం. వారికి అక్కడ ముప్పావు ఎకరా పొలం ఉంది. దయత్‌మజి కొబ్బరి పీచు వ్యాపారం చేస్తూనే పొలంలో కూరగాయలు పండిస్తున్నాడు. ఇద్దరు కూతుళ్లు. అదే ఊళ్లోని గవర్నమెంట్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న భానుప్రియ పెద్ద కూతురు.
‘2021 వేసవిలో లాక్‌డౌన్ విధించాక నా ఇద్దరు పిల్లలు బోర్ ఫీలయ్యారు. ఆన్‌లైన్ క్లాసులు కాసేపే కావడంతో మిగిలిన టైమ్ కంప్యూటర్, ఫోన్ ముందు గడపసాగారు. భాను బాగా బోర్ ఫీలయ్యింది. అలాగే వదిలితే పిల్లల మానసిక ఆరోగ్యం పాడవుతుందని భావించాను. మనం బియ్యం పండిద్దాం.. అదీ ఎర్ర బియ్యం అని భానుకు చెప్పాను. అదేదో కొత్తగా ఉందని తనూ ఉత్సాహం తెచ్చుకుంది’ అంటాడు దయత్‌మజి.
తండ్రి ఎర్రబియ్యం పండిద్దాం అని చెప్పాక భాను పెద్ద సైంటిస్ట్ అవతారమే ఎత్తింది. నెట్‌లో ఆ పంట గురించి చదివి వివరాలు తెలుసుకుంది. వ్యవసాయ శాఖ వారికి కూడా ఫోన్లు కొట్టి రకరకాల ప్రశ్నలు వేసింది. రైతు అవతారం ఎత్తుతున్నట్టు తన ఫ్రెండ్స్‌కు చెప్పింది.
తండ్రి దయత్‌మజితో భానుప్రియ
‘నాన్న ఎర్రబియ్యం పండిద్దామన్నాడు. అప్పటి వరకూ మేము బెండ, దోస, పెసల వంటివి పండించే వాళ్లం. నేను పెద్దగా పొలానికి వెళ్లేదాన్ని కాదు. ఇప్పుడు ఎర్రబియ్యం అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. పైగా మా ఊళ్లో ఆ బియ్యం పండిస్తున్నది మేమే మొదట. దానిని రక్తశాలి రకం అంటారు. ఇది అంతరించి పోతున్న వరి వంగడం. సేంద్రియ పద్ధతిలో పండిస్తే ఈ బియ్యంలో ఉండేంత పోషకాలు మరే బియ్యంలో ఉండవు. జింక్, మినరల్స్, ఐరన్, కాల్షియం... ఇవన్నీ ఉంటాయి. కాని మిగిలిన వరి వంగడాలతో పోలిస్తే లాభం పెద్దగా ఉండదని చాలా మంది వేయరు. కాని మేం వేద్దామనుకున్నాం’ అంటుంది భానుప్రియ.
ట్రాక్టర్ తెప్పించి పొలం దున్నడం మినహా మిగిలిన పనులన్నీ తండ్రీ కూతుళ్లే చూశారు. ‘నారు పోయడం, తడి ఎంత అవసరమో చూసుకోవడం, సేంద్రియ ఎరువులు చల్లడం... ఇవన్నీ భానుయే చూసుకుంది’ అన్నాడు దయత్‌మజి.‘మేము మేలో పంట వేశాము. అయితే ఆ వెంటనే వచ్చిన వానలతో అందరి చేలతో పాటు మా చేనూ మునిగిపోయింది. వేసిన నారు వృధా అయిపోయింది. అయినా సరే మళ్లీ ఇదే పంట వేద్దామనుకున్నాం. వేశాం. నాలుగు నెలల పంట ఇది. సెప్టెంబర్ నాటికి మా పొలం కోతకు సిద్ధమైంది’ అంది భానుప్రియ.
ఈ తండ్రీకూతుళ్లు పండిస్తున్న ఎర్రబియ్యం వార్త చుట్టుపక్కలకు వ్యాపించింది. కోత సమయంలో కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్ స్వయంగా హాజరయ్యాడు. పంట చేతికి వచ్చాక తూకం వేస్తే 300 కిలోల బియ్యం వచ్చాయి. ఇది మంచి దిగుబడి కింద లెక్క. ‘కొన్ని బియ్యం బంధువులకు, ఫ్రెండ్స్‌కు ఇచ్చాం. మిగిలినవి వాట్సప్ గ్రూప్‌లలో ప్రచారం జరిగి క్షణాల్లో అమ్ముడుపోయాయి. ఇప్పుడు మా ఇంట్లో ఎర్ర బియ్యమే వండుతున్నాం’ అంది భానుప్రియ.
ఆమె చేసిన కృషికి వ్యవసాయ శాఖ, ఆ ఊరి పంచాయతీ కలిసి ‘బాల రైతు’ బిరుదు ఇచ్చి గౌరవించాయి. భానుప్రియకు ఇంకా ఎనిమిదవ తరగతి పూర్తి కాలేదు. ఇప్పుడు తన పొలంలో మళ్లీ కూరగాయలు వేస్తున్నారు. పరీక్షలు రాసే సమయానికి నారుకాలం వస్తుంది. ‘ఈసారి నేను బాస్మతి పండించాలని అనుకుంటున్నా’ అంది భాను.
Comments
Please login to add a commentAdd a comment