కన్నీటి సేద్యం తప్పదా?
- సాగునీటి కోసం ఖరీఫ్ రైతు ఎదురుచూపు
- వెనక్కి వెళ్లిన వర్షాలు
- మాయమైన అల్పపీడనం
- మళ్లీ పాత రోజులు
విజయవాడ సిటీ : ఖరీఫ్ సాగు చేసి ఆర్థిక బాధలనుంచి కాస్త ఒడ్డున పడాలనుకుంటున్న రైతులకు నిరాశ తప్పేట్టులేదు.గడువు ముగిసినా ఇంతవరకు సాగర్‌జలాలను విడుదల చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. మళ్లీ పాత రోజులు పునరావృతమవుతాయేమోనని భయపడిపోతున్నారు. గత కొద్ది రోజులుగా రుతుపవనాలు దోబూచులాడుతున్నాయి. అల్పపీడనం ఏర్పడినట్లే ఏర్పడి అల్లంతలో మటుమాయమైంది.
రైతాంగం వారం రోజులుగా వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. రోహిణీ కార్తె వెళ్లి, మృగ శిర కార్తె వచ్చి ఒక పాదం గుడుస్తున్నా, వర్షాలు కురవక పోగా తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. ఏరోజు కారోజు మబ్బులు కమ్మి వర్షం పడకుండానే రోజులు గడిచిపోతున్నాయి. దాంతో ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడతాయో లేదోననే ఆందోళనలో అన్నదాతలున్నారు.
వర్షాలు కురిస్తేనే సాగర్‌నుంచి సాగునీరు వదిలే వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. వర్షాలు పడకపోతే సాగర్ నుంచి నీరు వదిలే అవకాశం లేదని, ఒకవేళ వర్షాలు కురిసినా రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణానదిలోకి నీరు విడుదల అనుమానమేనంటున్నారు. నేటివరకు సాగుకు నీటి విడుదల విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. గత సంవత్సరం జూన్ 3వ తేదీనే సాగుకు నీరు విడుదల చేశారు.
ఈ క్రమంలో నెలాఖరు నాటికి కూడా సాగునీరు వదిలేది అనుమానమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. జూన్ మొదటి వారం, లేదా కనీసం 15తేదీలోగా నీరు విడుదలైతే ఖరీఫ్‌కు ఇబ్బంది లేకుండా ఉంటుందని రైతాంగం భావిస్తున్నారు. గత సంవత్సరం ఖరీఫ్, రబీలో 207.07 క్యూసెక్కుల నీరు కృష్ణా డెల్టాకు విడుదల చేశారు.
సముద్రంలోకి 399.24 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. గత ఏడాది జూలైలో కృష్ణా తూర్పు కాలువకు 3.70, ఆగస్టులో 22.02, సెప్టెంబర్‌లో 24.02, అక్టోబర్‌లో 13.63, నవంబర్‌లో 12,77, డిసెంబర్‌లో 4.62 టీఎంసీలు విడుదల చేశారు. కృష్ణా పశ్చిమ కాలువకు జూన్‌లో 0.13, జూలై 1.81, ఆగస్టు 14.14, సెప్టెంబర్ 12.50, అక్టోబర్ 6.91, నవంబర్ 9.25, డిసెంబర్‌లో 6.53 టీఎంసీల నీరు విడుదల చేశారు. ఖరీఫ్ నీటివిడుదలను డిసెంబర్ 22తో నిలిపి వేశారు.
ఇక రబీలో కేఈ మెయిన్ కాలువకు జనవరిలో 13,84, ఫిభ్రవరిలో 11.00, మార్చిలో 16.86, ఏప్రిల్‌లో 10.14 టీఎంసీల నీరు వదిలారు. కేడబ్ల్యూ మెయిన్ కాలువకు జనవరిలో 7.46, ఫిభ్రవరిలో 5.57, మార్చిలో 7.90, ఏప్రిల్‌లో 2.30 టీఎంసీల నీరు వదిలారు. గత ఏడాది ఖరీఫ్‌లో 129.59, రబీలో 77.47 టీ ఎంసీల నీటిని వినియోగించుకున్నారు.
ఈ ఏడాది కూడా అదే విధంగా సాగునీరు అవసరం ఉంటుందని అధికారులు చెపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణా ప్రాంతంలో వర్షాలు పడితేనే దిగువనున్న కృష్ణానదిలోకి నీరు వస్తుందని లేకుంటే సాగునీరు విడుదలపై ఆశవదులుకోవాల్సిందేనని రైతులు ందోళన చెందుతున్నారు.