రుణాను‘బంధనం’
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : రుతుపవనాలు రాకముందే వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్‌కు రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పంట సాగుకు సిద్ధమవుతున్నప్పటికీ.. పెట్టుబడులకు రుణాల కోసం బ్యాంకుల వైపు ఎదురుచూస్తున్నారు. అయితే రుణ లక్ష్యాన్ని అధికారులు నిర్ధేశించినప్పటికీ.. వాటి మంజూరు విషయంలో గందరగోళ పరిస్థితులు తలెత్తనున్నాయి. ప్రధానంగా రుణాల రెన్యువల్స్‌పై నీలినీడ లు కమ్ముకుంటున్నాయి.
తెలుగుదేశం ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న హామీ రైతులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టింది. ఇప్పటికీ కొత్త ప్రభుత్వం కొలువుతీరకపోవడం.. రుణమాఫీ ఫైలుపై సంతకం చేయకపోవడం...ఖరీఫ్ సీజన్ తరుముకొస్తుండటం...పాత రుణాలు చెల్లించకపోవడంతో కొత్త రుణాల మంజూరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధికారులు మాత్రం ఖరీఫ్-2014కు పంట రుణ లక్ష్యాన్ని రూ.700 కోట్లుగా నిర్ధేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మేర రుణాలను మంజూరు చేస్తారన్న విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2 లక్షల మందికి రుణాలు
ఖరీఫ్ ప్రణాళిక సిద్ధమైంది. జిల్లాలో 2,27,400 హెక్టార్లలో పంటలు చేపట్టాలని వ్యవసాయాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సీజన్‌లో మొత్తం 2 లక్షల 304 మంది రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో కొత్త వారి కంటే రెన్యువల్స్‌కే అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్ధేశించారు.
ఈ సీజన్‌లో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు మాత్రమే రుణాలను అందించనున్నారు. రెన్యువల్స్ విషయానికి వస్తే 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత సీజన్‌లో రూ.600 కోట్లు ఖరీఫ్ లక్ష్యం కాగా 1,32,375 మంది రైతులకు రూ.640 కోట్లు మంజూరు చేశారు. గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తుపాన్లు, అల్పపీడనం కారణంగా వరదలు వచ్చి పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు.
రెన్యువల్స్ డౌటే...!
ఎన్నికలకు ముందు అధికారంలోకి రాగానే రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తామని టీడీపీ ప్రకటించడంతో నష్టాల్లో ఉన్న రైతులు రుణాలను చెల్లించేందుకు ఆసక్తి చూపించడం లేదు. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో వారికి రుణాలు రెన్యువల్స్ చేసే అవకాశం లేదని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. అయినప్పటికీ రుణమాఫీ జరుగుతుందన్న ఆశతో రైతులు ఉన్నారు. రుణమాఫీ జరిగితే జిల్లాలో 2,10,881 మంది రైతులకు మేలు జరగనుంది.
అలాగే 1,42,093 మందికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాల రెన్యువల్స్ జరగనున్నాయి. ఒకవేళ రుణమాఫీ ఫైలుపై సంతకం చేయడం ఆలస్యమైతే ఖరీఫ్ సీజన్ ముగియడంతో పాటు రుణ లక్ష్యం నీరుగారనుంది. అదే రుణాలను రద్దు చేయకపోతే రెన్యువల్స్‌కు అవకాశముండదని బ్యాంకర్లు చెబుతున్నారు. రుణమాఫీ జరుగుతుందో లేదో ఇంకా స్పష్టత లేదని, అప్పటి వరకు కొత్త రుణాల మంజూరు విషయంలో గందరగోళం తప్పదని పేర్కొంటున్నారు.