- 30 వేల క్వింటాళ్ల సబ్సిడీ వరి విత్తనాలు మంజూరు
- బీపీటీ 27 వేలు, 1061 రకం 3 వేల క్వింటాళ్లు
- కేజీకి రూ.5 సబ్సిడీతో పంపిణీ
- సాగు ఆలస్యమైనందున బీపీటీకే ప్రాధాన్యం
గుడివాడ : జిల్లాలో ఖరీఫ్ రైతుకు ఎట్టకేలకు సబ్సిడీ వరి విత్తనాలు అందనున్నాయి. ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం వరి విత్తనాలపై సబ్సిడీ ఎత్తివేయటంతో తమపై పెద్ద ఎత్తున భారం పడనుందని రైతాంగం ఆందోళన చెందారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు కూడా సబ్సిడీని కొనసాగించాలని రైతుల తరఫున తమ వాణి వినిపించారు. దీంతో స్పందించిన సర్కారు జిల్లా రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలు అందించేందుకు రంగం సిద్ధం చేసింది.
30 వేల క్వింటాళ్లు పంపిణీకి సిద్ధం...
జిల్లాలోని రైతాంగానికి సబ్సిడీపై వరి విత్తనాలు అందించాలని వ్యవసాయశాఖ తరఫున ఆదేశాలు వచ్చాయి. మంగళవారం ఉదయం నుంచి మండలాల్లో సబ్సిడీ వరి విత్తనాలు అందిస్తారని వ్యవసాయ శాఖ జిల్లా జేడీ ఈ నర్సింహులు ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ సీడ్స్ ద్వారా ఈ విత్తనాలు అందిస్తామని ఆయన చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 30 వేల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేస్తున్నామని వివరించారు.
వీటిలో బీపీటీ రకం 27 వేల క్వింటాళ్లు, 1061 రకం విత్తనాలు మూడువేల క్వింటాళ్లు అందిస్తున్నామన్నారు. కేజీకి రూ.5 చొప్పున సబ్సిడీ ఇవ్వనుండటంతో జిల్లా వ్యాప్తంగా రైతులకు రూ.1.50 కోట్ల మేరకు లబ్ధి చేకూరనుందని వివరించారు. ఇప్పటికే సాగు ఆలస్యం అవుతున్నందున తక్కువ రోజుల్లో పంట చేతికొచ్చే బీపీటీ రకం విత్తనాలపైనే రైతులు ఆసక్తి చూపుతారని జిల్లా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాటినే ఎక్కువ మొత్తంలో సరఫరా చేస్తున్నామని చెప్పారు.
విత్తనాల సబ్సిడీ ఇలా...
బీపీటీ విత్తనం అసలు ధర కేజీకి రూ.27.50 కాగా రూ.5 సబ్సిడీ పోగా రూ.22.50 చెల్లించాల్సి ఉందని జిల్లా అధికారులు తెలిపారు. 25 కేజీల బస్తాకు రూ.562.50 చెల్లించాలని చెప్పారు. 1061 రకం కేజీ రూ.25.20 కాగా రూ.5 సబ్సిడీ పోను, రూ.20.20 చెల్లించాలన్నారు. 30 కేజీల బస్తాకు రూ.606 చెల్లించాల్సి ఉందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.