ప్రభుత్వానికి వ్యవసాయశాఖ ప్రతిపాదన
వరి, సోయాబీన్, కంది, మినుము వంటి పంటలకు రాయితీ!
వచ్చే వానాకాలం సీజన్లో సబ్సిడీ ఇచ్చేందుకు ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్ నుంచి రైతులకు సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేయాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వరి, మొక్కజొన్న, కంది, పెసర, సోయాబీన్, మినుములు, జీలుగ, జనపనార, పిల్లి పెసర తదితర విత్తనాలను సబ్సిడీపై అందజేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జీలుగ, జనపనార, పిల్లి పెసర మినహా ఇతర విత్తనాలకు మూడేళ్ల క్రితమే సబ్సిడీ ఎత్తేయగా ఇప్పుడు సబ్సిడీని పునరుద్ధరించాలని నిర్ణయించారు. కేవలం వానాకాలం సీజన్‌లో అందించే విత్త నాల సబ్సిడీ కోసమే దాదాపు రూ. 170 కోట్లు ఖర్చు కానుందని అంచనా. కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ. 25 కోట్ల మేరకు విత్తన సబ్సిడీ కింద నిధులు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం సమ కూర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.
35–65 శాతం వరకు సబ్సిడీ...
గతంలో మాదిరిగానే విత్తనాలకు 35 నుంచి 65 శాతం వరకు సబ్సిడీని అందించనున్నారు. సోయాబీన్‌కు 37 శాతం, జీలుగ, పిల్లి పెసర, జనపనార విత్తనాలకు 65 శాతం సబ్సిడీ... కంది, పెసర, మినుము, వేరుశనగ విత్తనాలకు 35 శాతం వరకు సబ్సిడీ అందించాలని భావిస్తున్నారు.
వరి పదేళ్లలోపు పాత విత్తనాల ధర ఎంతున్నా రూ. వెయ్యి సబ్సిడీ ఇవ్వాలని... పదేళ్లకుపైగా ఉన్న వరి విత్తనాలకు రూ. 500 సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మొత్తం విత్తన సరఫరాలో వ్యవసాయశాఖ అధికంగా వరి విత్తనాలనే రైతులకు సరఫరా చేయనుంది.
రైతు కోరుకొనే విత్తనాలే కీలకం...
ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే కొన్ని రకాల విత్తనాలను రైతులు పెద్దగా కోరుకొనే పరిస్థితి ఉండదు. గత అనుభవాల ప్రకారం రాష్ట్రంలో మొక్కజొన్న సాగు అధికం. ఆ విత్తనాన్ని ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తోంది. కానీ మొక్కజొన్నలో అనేక హైబ్రీడ్ రకాల విత్తనాలున్నాయి. వాటిలో కొన్ని రకాలకు మరింత డిమాండ్ ఉంది. కానీ ప్రభుత్వం సరఫరా చేసే మొక్కజొన్న విత్తనాలను పెద్దగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడని రైతులు.. ప్రైవేటు డీలర్ల వద్ద తమకు అవసరమైన డిమాండ్ ఉన్న విత్తనాలనే కొనుగోలు చేస్తున్నారు.
కానీ ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏదో యథాలాపంగా టెండర్లు పిలిచి టెండర్లు ఖరారు చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. రైతులు కోరుకొనే రకాల విత్తనాలు ఇవ్వకపోవడం వల్ల గతంలో అనేక సబ్సిడీ విత్తనాలు వ్యవసాయశాఖ వద్ద మిగిలిపోయాయి. దీనివల్ల ఆ శాఖకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది.
1.21 కోట్ల పత్తి విత్తనాలు అవసరం: మంత్రి తుమ్మల
వచ్చే వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో 60.53 లక్షల ఎకరా లలో పత్తి సాగు కానుందని... అందుకు 1.21 కోట్ల విత్తన ప్యాకెట్లు అవసరమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా రు. అధికారులు, విత్తన కంపెనీలతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు.
అన్ని ప్రైవేటు విత్తన కంపెనీలు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశించారు. వరి 16.50 లక్షల క్వింటాళ్లు, మొక్కజొన్న 48,000 క్వింటాళ్ల విత్తనాలు అవసరమన్నారు. ప్రస్తుత లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment