సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రక్రియ మూడేళ్లుగా మూలనపడింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లలో రూ. వందల కోట్లు కేటాయించినా ఆ మేరకు పరికరాలు కొనుగోలు చేసి రైతులకు అందించడంలో వ్యవసాయ శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. యంత్రాల ధరల నిర్ధారణకు ముందు వాటి మార్గదర్శకాలపై ప్రతిపాదనలను పంపా లని ‘ఆగ్రోస్’విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు స్పందించలేదు.
మరో రెండు నెలల తర్వాత వానాకాలం సీజన్ మొదలు కాబోతున్నా కనీసం దుక్కు యంత్రాలు, తైవాన్ స్ప్రేయర్ వంటివి కూడా రైతులకు సబ్సిడీపై ఇచ్చే పరిస్థితి లేకపోవడంపై రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021–22 బడ్జెట్‌లో యంత్రాల సబ్సిడీకి రూ. 1,500 కోట్లు, 2022–23 బడ్జెట్‌లో రూ. 500 కోట్లు, ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించినా వ్యవసాయ యంత్రాలు రైతులకు సరఫరా కావడం లేదు. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం కారణంగా రైతులు ఖరీదైన పనిముట్లను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
2018 వరకు ట్రాక్టర్లు సరఫరా: తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టిసారించింది. అంతేకాదు.. వాటిపై రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీలు ప్రకటించింది. 2018 వరకు భారీగా ట్రాక్టర్లు సహా వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై ఇచ్చింది. వ్యవసాయ యంత్రాలు తీసుకొనే ఎస్సీ, ఎస్టీలకు ట్రాక్టర్లు సహా కొన్నింటిపై 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేసింది. ఒకేసారి గ్రూపునకు లేదా వ్యక్తిగతంగా కూడా వాటిని అందించింది.
దాదాపు 8 వేల వరకు ట్రాక్టర్లను వ్యవసాయశాఖ రైతులకు సబ్సిడీపై అందజేసింది. సబ్సిడీ నేపథ్యంలో గ్రామాల్లో వ్యవసాయ యాంత్రీకరణ విప్లవం ఏర్పడింది. తెలంగాణ ఏర్పడక ముందు, ఆ తర్వాత రైతులకు యంత్రాల పంపిణీ చూస్తే దాదాపు రెండింతలైంది. దీంతో వ్యవసాయం ఆధునికత సంతరించుకుంది. ఒకవైపు సాగు నీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు పెరగడం, మరోవైపు యాంత్రీకరణ జరగడంతో పంటల ఉత్పత్తి, ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది.
నిలిచిన ప్రక్రియ...
2018 తర్వాత యంత్రాల సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం ట్రాక్టర్ల బదులు వరి నాటు యంత్రాలతోపాటు కొన్ని చిన్నచిన్న పరికరాలను రైతులకు ఇవ్వాలని భావించిన వ్యవసాయ శాఖ ఆ ప్రక్రియ అమల్లో మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది.
ఒక్కో వరి నాటు యంత్రం ధర కంపెనీలను బట్టి రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉండగా దాదాపు 5 వేల యంత్రాలను సరఫరా చేయాల్సి రావొచ్చని ఆ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. కానీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంలో మాత్రం విఫలమైంది. రెండేళ్లకోసారి యంత్రాల ధరలను నిర్ణయించి ఖరారు చేయాల్సి ఉండగా వాటి నిర్ధారణ ప్రతిపాదనలు కూడా పంపలేదు.
కస్టమ్ హైరింగ్ సెంటర్లూ లేవు
ఓలా, ఉబర్ మాదిరి వ్యవసాయానికి సంబంధించి భారీ కోత, నాటు మెషీన్లు బుక్ చే సుకుంటే అద్దెకు పంపించేలా కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని గతంలో వ్య వసాయశాఖ చెప్పింది. అయితే ఇంతవరకు ఆ సెంటర్లు ఎలా ఉండాలి? ఎవరి ఆధ్వర్యంలో నడిపించాలనే దానిపై స్పష్టత లేదు.
Comments
Please login to add a commentAdd a comment