మొలకలోనే మునక..
మొలకలోనే మునక..
Published Sun, Jul 16 2017 10:30 PM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM
మొలకెత్తని సబ్సిడీ విత్తనాలు
తిప్పి పంపిన వ్యవసాయాధికారులు
బయట మార్కెట్‌ను ఆశ్రయించిన అన్నదాతలు
రూ.8.25కోట్ల సబ్సిడీ హుళక్కే
పట్టించుకోని ప్రభుత్వం
’వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం.. అన్నదాతకు దన్నుగా నిలుస్తున్నాం’ అంటూ గొప్పలు పోతున్న ప్రభుత్వం జిల్లాలోని రైతులకు సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయడంలోనూ విఫలమైంది. ఫలితంగా మొలక దశలోనే రైతులు మునిగిపోయే దుస్థితి దాపురించింది. సబ్సిడీపై ఏపీ సీడ్స్ సరఫరా చేసిన విత్తనాలు ప్రయోగ దశలోనే మొలకెత్తకపోవడంతో వ్యవసాయాధికారులు తిప్పి పంపారు. దీంతో రైతులు జిల్లావ్యాప్తంగా రూ.8.25కోట్ల సబ్సిడీని కోల్పోవడంతోపాటు బయట మార్కెట్‌లో అధిక ధరకు విత్తనాలు కొనక తప్పలేదు.
పాలకొల్లు టౌన్:
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో సుమారు 5.50లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. డెల్టాలో 3.70 లక్షల ఎకరాల్లో రైతులు సాగుబాట పట్టారు. వీరికి సబ్సిడీపై సర్కారు విత్తనాలు సరఫరా చేయాల్సి ఉంది. దీనికోసం వ్యవసాయ ఉన్నతాధికారులు ఏపీ సీడ్స్, ఇతర కంపెనీల ద్వారా విత్తనాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. ఏపీ సీడ్స్ ద్వారా జూన్ రెండో వారంలోనే జిల్లాకు విత్తనాలు సరఫరా అయ్యాయి. ఎకరానికి 30కిలోల చొప్పున విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. కిలోకు రూ.5ను సబ్సిడీగా ప్రకటించారు. ఈ లెక్కన 30 కిలోల బస్తాకు రూ.150 సబ్సిడీగా లభిస్తుంది. దీనిప్రకారం.. జిల్లాలోని 5.50లక్షల ఎకరాలకు విత్తనాలు సరఫరా చేస్తే రూ.8.25కోట్లు సబ్సిడీ రైతులకు అందుతుంది.
విత్తనాలు మొలకెత్తలేదు
అయితే ఏపీ సీడ్స్ నుంచి జిల్లాకు వచ్చిన విత్తనాలను వ్యవసాయాధికారులు ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అవి మొలకెత్తకపోవడంతో చాలాచోట్ల తిప్పి పంపారు. ఒకటి, రెండు చోట్ల సరఫరా ఓ టన్ను సరఫరా చేసినా.. అవి మొలకెత్తలేదు. ఫలితంగా విత్తనాలు అందక పోవడంతో రైతులు బయట మార్కెట్‌ను ఆశ్రయించారు. అధిక ధరలకు విత్తనాలు కొన్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా సుమారు రూ.8.25కోట్ల సబ్సిడీని రైతులు కోల్పోయినట్టయింది.
ఇవిగో ఆధారాలు
డెల్టాలోని పాలకొల్లు వ్యవసాయ అధికారులు ఖరీఫ్‌లో అనువుగా ఉండే ఎంటీయూ 1061, ఎంటీయూ 1064, ఎంటీయూ 1075 రకాలను ఐదు టన్నులను ఏపీ సీడ్స్ నుంచి తెప్పించారు. ముందు జాగ్రత్తగా వాటిని మొలక కట్టారు. అవి సరిగా మొలకెత్తకపోవడంతో తిప్పి పంపారు.
యలమంచిలి మండలంలోనూ శిరగాలపల్లి సొసైటీ ద్వారా ఏపీ సీడ్స్ నుంచి ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 విత్తనాలు ఐదు టన్నులు రప్పించారు. అయితే అక్కడ కూడా విత్తనాలు మొలక రాకపోవడంతో వ్యవసాయాధికారులు సూచనల మేరకు సొసైటీ తిరిగి పంపించింది.
భీమవరం వ్యవసాయాధికారులు మాత్రం సబ్సిడీపై వరి విత్తనాలను తెప్పించలేదు.
నరసాపురం వ్యవసాయాధికారులకు ఆరు టన్నుల విత్తనాలు సరఫరా అయ్యాయి. వీటిలో ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 ఉన్నాయి. ఒక టన్ను విత్తనాలను మాత్రం ఇక్కడి అధికారులు రైతులకు సరఫరా చేశారు. అవి మొలకెత్తకపోవడంతో మిగిలిన ఐదు టన్నులను వెనకకు పంపినట్టు సమాచారం.
తాడేపల్లిగూడెం డివిజన్‌లో మెట్ట ప్రాంతాల రైతులు బోర్లపై ముందుగా నారుమడులు వేస్తారు. అయితే ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాల పంపిణీకి జూన్ మొదటివారంలో అనుమతి ఇవ్వడంతో ఆ ప్రాంతాల రైతులకు అవి అందలేదు. దీంతో మిగిలిన రైతుల కోసం అక్కడి అధికారులు సబ్సిడీ విత్తనాలను తెప్పించలేదు.
ఈ లెక్కల ప్రకారం జిల్లాలో 4లక్షల మంది సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు అందలేదు.
అధిక ధరలకు కొన్నాం
ప్రభుత్వం సబ్సిడీపై వరి విత్తనాలు అందజేస్తామని ప్రకటించిందే తప్ప రైతులకు అందలేదు. వచ్చిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో వ్యవసాయాధికారులు తిప్పి పాపంరు. దీంతో బహిరంగ మార్కెట్లో 30కిలోల విత్తనాల ప్యాకెట్ రూ.880కు కొనుగోలు చేసి నారుమడులు పోశాం. తక్షణం అధికారులు చర్యలు తీసుకోవాలి.
రేఖపల్లి సూర్యనారాయణ, రైతు, ఆగర్తిపాలెం
సబ్సిడీ విత్తనాలు మొలకెత్తిలేదు
రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై వరి విత్తనాలు సరఫరా చేసింది.ముందుగా ఆ విత్తనాలను మొలక కట్టాం. మొలకెత్తలేదు. దీంతో వ్యవసాయాధికారుల సూచనల మేరకు తిరిగి ఏపీ సీడ్స్‌కి పంపించేశాం.
చిలుకూరి బాపిరాజు, సొసైటీ అధ్యక్షుడు, శిరగాలపల్లి
రైతులకు సరఫరా చేయలేదు
ఏపీ సీడ్స్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాలకు సబ్సిడీ విత్తనాలు పంపించాం. అయితే వ్యవసాయాధికారులు ముందుగా మొలక కట్టారు. విత్తనాలు మొలక రాకపోవడంతో రైతులకు సరఫరా చేయలేదు.
వై.సాయిలక్ష్మీ ఈశ్వరి, జేడీ, వ్యవసాయ శాఖ
Advertisement
Advertisement