హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ నుంచి ఏటా రూ.2,000 కోట్ల విలువైన విత్తనాలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటిలో టమాటా, మిరప, పుచ్చకాయ, మొక్కజొన్న తాలూకు విదేశీ వెరైటీలు కూడా ఉన్నాయి. పలు విదేశీ కంపెనీలు ఇక్కడి రైతులతో భాగస్వామ్యం కుదుర్చుకుని విత్తనాలను ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం రూ.200 కోట్ల విలువైన విదేశీ వెరైటీల విత్తనాల ఎగుమతి జరుగుతోంది. ఇక్కడి విత్తనాలకు విదేశాల్లో మార్కెటింగ్, సర్టిఫికేషన్, సబ్సిడీలతో ప్రభుత్వం ప్రోత్సహిస్తే అయిదేళ్లలో మొత్తం ఎగుమతులు నాలుగు రెట్లకు చేరడం ఖాయమని సీడ్స్‌మెన్ అసోసియేషన్ అంటోంది. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు మరింత ప్రయోజనమని చెబుతోంది. నాబార్డు సహకారంతో లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని అసోసియేషన్ ధీమాగా ఉంది.
విత్తన భాండాగారాలు..
తెలుగు రాష్ట్రాలు విత్తన భాండాగారాలుగా విరాజిల్లుతున్నాయి. వాతావరణం, నేలలు అనుకూలంగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విత్తనాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 60 శాతంగా ఉంది. మొక్కజొన్న, జొన్న విత్తనాల్లో 90 శాతం, సజ్జలు 85 శాతం, వరి 60 శాతం, పత్తి విత్తనాల్లో 50 శాతం తెలుగు రాష్ట్రాలు సమకూరుస్తున్నాయి. ఇక రూ.200 కోట్ల విలుౖÐð న కూరగాయల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల్లో 90 శాతం ఇక్కడ కొలువుదీరాయని సీడ్స్‌మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కార్న్‌టెక్ సీడ్స్ సీఈవో యాగంటి వెంకటేశ్వర్లు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో 10 లక్షలకుపైగా రైతులు విత్తన సాగులో నిమగ్నమయ్యారని చెప్పారు.
రబీకి పెరగనున్న విక్రయాలు..
కోవిడ్–19 కారణంగా ఉపాధి కోల్పోయిన, ఉద్యోగాలు వదులుకున్న యువత తిరిగి గ్రామాల బాట పట్టారు. వీరిప్పుడు వ్యవసాయంపై దృష్టిసారించారని కంపెనీలు అంటున్నాయి. మరోవైపు వర్షాలు దేశవ్యాప్తంగా అంచనాలను మించి కురిశాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో పరిశ్రమ 5 శాతం వృద్ధి సాధించింది. రబీకి విత్తన అమ్మకాలు 20–25 శాతం అధికం కావచ్చని పరిశ్రమ భావిస్తున్నట్లు రాశి సీడ్స్ సీవోవో ఏ.ఎస్.ఎన్.రెడ్డి తెలిపారు. ఎంౖMð్వరీలనుబట్టి చూస్తే సాగు విస్తీర్ణమూ పెరగనుందని అన్నారు. రెండున్నర దశాబ్దాల్లో కూరగాయల ఉత్పత్తి మూడు రెట్లు అధికమైందని ఈస్ట్–వెస్ట్ సీడ్ ఎండీ దిలీప్ రాజన్ వెల్లడించారు. కాగా, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కోవిడ్–19 ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో లేదని.. ఇందుకు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందించడమే కారణమని సీడ్స్‌మెన్ అసోసియేషన్ తెలిపింది.
పరిశోధనకు రూ.2 వేల కోట్లు..
దేశవ్యాప్తంగా విత్తన పరిశ్రమ ఏటా 5–10 శాతం వృద్ధితో రూ.30,000 కోట్లకు చేరుకుంది. ఇందులో కూరగాయల విత్తనాల విలువ రూ.3,000 కోట్ల మేర ఉంది. మొత్తం ఎగుమతులు రూ.2,000 కోట్ల మేర జరుగుతున్నాయి. 2,000 కంపెనీలు పరిశ్రమలో నిమగ్నమయ్యాయి. ఇందులో 500 దాకా కంపెనీలు జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పరిశోధన, అభివృద్ధి విభాగంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జీనోమ్ ఎడిటింగ్ సాంకేతిక విధానంపై ఫోకస్ చేయనున్నందున వచ్చే రెండేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు పరిశోధన, అభివృద్ధి విభాగంలో రానున్నాయి. 16 లక్షల మంది రైతులతో కంపెనీలు చేతులు కలిపాయి. శాస్త్రవేత్తలు, తయారీ, మార్కెటింగ్ సిబ్బంది ఒక లక్ష వరకు ఉంటారు.
విదేశాలకు మన వంగడాలు
Published Tue, Oct 6 2020 4:35 AM | Last Updated on Tue, Oct 6 2020 4:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment