మేలో 7 నెలల గరిష్ట స్థాయి
23.78 బిలియన్ డాలర్లుగా నమోదు
ఎగుమతులు 9 శాతం వృద్ధితో 38.13 బిలియన్ డాలర్లకు అప్
దిగుమతులు 7.7 శాతం పెరిగి 61.91 బిలియన్ డాలర్లకు చేరిక
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మేలో 9 శాతం (2023 ఇదే నెలతో పోల్చి) పెరిగాయి. విలువలో 38.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులుసైతం సమీక్షా నెల్లో 7.7 శాతం పెరిగి 61.91 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారీగా 7 నెలల గరిష్ట స్థాయిలో 23.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇంత భారీ వాణిజ్యలోటు ఎకానమీకి ఒక్కింత ఆందోళన కలిగించే అంశం. తాజా గణాంకాలను పరిశీలిస్తే..
→ అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి పరిస్థితి నెలకొన్నప్పటికీ, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, జౌళి, ప్లాస్టిక్స్ వంటి రంగాలు మంచి పనితీరును ప్రదర్శించాయి.
→ మొత్తం దిగుమతుల్లో చమురు విభాగంలో 28 % పెరుగుదలను నమోదుచేసుకుని విలువలో 20 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
→ పసిడి దిగుమతులు మాత్రం స్వల్పంగా తగ్గి 3.69 బిలియన్ డాలర్ల నుంచి 3.33 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఏప్రిల్– మే నెలల్లో వృద్ధి 5.1 శాతం
ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలు–ఏప్రిల్, మేలలో ఎగుమతులు 5.1 శాతం పెరిగి 73.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 8.89 శాతం పెరిగి 116 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి వాణిజ్యలోటు 42.88 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ నెలల్లో ఒక్క చమురు దిగుమతుల విలువ 24.4 శాతం పెరిగి 36.4 బిలియన్ డాలర్లకు చేరింది.
సేవలూ బాగున్నాయ్...
సేవల రంగం ఎగుమతులు మేలో 30.16 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తొలి అంచనా. 2023 మేలో ఈ విలువ 26.99 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ ఇదే కాలంలో 15.88 బిలియన్ డాలర్ల నుంచి 17.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డౌన్
మరోవైపు రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి ఒక ప్రకటన చేస్తూ, మేనెల్లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 5 శాతం తగ్గి రూ.20,713.37 కోట్లుగా నమోదయినట్లు పేర్కొంది. 2023 ఇదే నెల్లో ఈ విలువ రూ.21,795.65 కోట్లు (2,647 మిలియన్ డాలర్లు).
Comments
Please login to add a commentAdd a comment