న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మేనెల్లో 15.46 శాతం పెరిగి 37.29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఇదే నెల్లో దిగుమతులు విలువ 56.14 శాతం ఎగసి 60.62 బిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 23.33 బిలియన్ డాలర్లగా నమోదయ్యింది. 2021 ఇదే నెల్లో ఈ విలువ కేవలం 6.53 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
ఎగుమతులు ఇలా...
► ఎగుమతులకు సంబంధించి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ గూడ్స్, రసాయనాల వంటి రంగాల పనితీరు ప్రోత్సాహకరంగా ఉంది.
►ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 7.84 శాతం పెరిగి 9.3 బిలియన్ డాలర్లకు ఎగశాయి. పెట్రోలియం ప్రొడక్ట్‌లు విషయంలో ఈ రేటు 52.71 శాతం పెరిగి 8.11 బిలియన్ డాలర్లకు చేరింది.
► రత్నాలు, ఆభరణాల ఎగుమతులు గత ఏడాది మేలో 2.96 బిలియన్ డాలర్లు ఉంటే, తాజా సమీక్షా నెల్లో 3.1 బిలియన్ డాలర్లకు చేరాయి.
► రసాయనాల ఎగుమతులు 12 శాతం పెరిగి విలువలో 2.5 బిలియన్ డాలర్లకు చేరింది.
► ఫార్మా ఎగుమతులు 5.78 శాతం ఎగసి 1.98 బిలియన్ డాలర్లకు ఎగశాయి.
► రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు 23% పురోగ తితో 1.36 బిలియన్ డాలర్లకు చేరాయి.
దిగుమతుల తీరిది...
► పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతులు మే నెల్లో 91.6 శాతం పెరిగి 18.14 బిలియన్ డాలర్లకు చేరాయి.
► బొగ్గు, కోక్, బ్రికెట్ల దిగుమతులు మే 2 బిలియన్ డాలర్ల (2021 మేలో) నుండి 5.33 బిలియన్ డాలర్లకు ఎగశాయి.
► బంగారం దిగుమతులు 677 మిలియన్ డాలర్ల నుంచి భారీగా 5.82 బిలియన్ డాలర్లకు ఎగశాయి.
తొలి రెండు నెలల్లో...
ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) ఎగుమతులు 22.26 శాతం పెరిగి 77.08 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు ఇదే కాలంలో 42.35 శాతం ఎగసి 120.81 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలతో పోల్చితే 21.82 బిలియన్ డాలర్ల నుంచి 43.73 బిలియన్ డాలర్లకు ఎగసింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల విలువ 400 బిలియన్ డాలర్లు.
భారత్ వద్ద ఉన్న మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలు (దాదాపు 600 బిలియన్ డాలర్లు) దాదాపు 12 నెలల దిగుమతులుకు సరిపోతాయన్నది అంచనా. అయితే వాణిజ్యలోటు పెరుగుదల కొంత ఇబ్బందికరమైన పరిణామం. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) భారానికీ ఇది దారితీస్తుంది. 2022–23లో క్యాడ్ 2 శాతం దాటుతుందని ఇప్పటికే అంచనాలు వెలువడుతున్నాయి.
2021–22ను అధిగమిస్తాం
ఎగుమతుల రికార్డు ఎకానమీకి పూర్తి సానుకూల అంశం. ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)సహా పలు దేశాలతో భారత్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ), పీఎల్‌ఐ స్కీమ్ వంటి అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో నమోదయిన విలువ మొత్తాన్ని (400 బిలియన్ డాలర్లకుపైగా) అధిగమిస్తాయన్న భరోసాను కల్పిస్తున్నాయి.
– ఏ శక్తివేల్, ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్
భారత్‌కు వాణిజ్యలోటు గుబులు
Published Fri, Jun 3 2022 4:06 AM | Last Updated on Fri, Jun 3 2022 9:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment