న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు–దిగుమతుల విలువల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు ఏప్రిల్‌లో ఆందోళన కలిగించింది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం, సమీక్షా నెల్లో ఎగుమతుల విలువ కేవలం ఒక శాతం పెరిగి (2023 ఇదే నెలతో పోల్చి) 35 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దిగుమతుల విలువ ఇదే కాలంలో 10.25 శాతం ఎగసి 54.09 బిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 19.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గడచిన నాలుగు నెలల్లో ఈ స్థాయి వాణిజ్యలోటు ఇదే తొలిసారి.
కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
⇒ ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, పెట్రోలియం ప్రొడక్టులు, ఫార్మా ఎగుమతులు బాగున్నాయి.
⇒ విలువైన మెటల్స్ దిగుమతులు రెట్టింపై 3.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
⇒ క్రూడ్ ఆయిల్ దిగుమతులు 20.22% పెరిగి 16.5 బిలియన్ డాలర్లుకు ఎగసింది.
⇒ 30 కీలక రంగాల్లో 13 వస్తు ఎగుమతుల్లో పెరుగుదలను నమోదుచేశాయి. వీటిలో కాఫీ, పొగాకు, సుగంధ ద్రవ్యాలు, ప్లాస్టిక్, హస్తకళలు ఉన్నాయి.
2023–24లో రికార్డు
మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల ఎగుమతుల మొత్తం విలువ 778.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది ఒక రికార్డు. ఇందులో వస్తు ఎగుమతులు 437.1 బిలియన్ డాలర్లు. సేవల ఎగుమతుల విలువ 341.1 బిలియన్ డాలర్లు.
సేవలు ఇలా...
తొలి అంచనాల ప్రకారం ఏప్రిల్‌లో సేవల ఎగుమతులు 29.57 బిలియన్ డాలర్లు. 2023 ఇదే నెల్లో ఈ విలువ 25.78 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 16.97 బిలియన్ డాలర్లు. 2023 ఇదే నెల్లో ఈ విలువ 13.96 బిలియన్ డాలర్లు.
ఎగుమతుల వృద్ధి కొనసాగుతుంది..
అనిశ్చిత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కొత్త ఆర్థిక సంవత్సరం కొంత సానుకూలంగానే ప్రారంభమైంది. ఎగుమతుల వృద్ధి కొనసాగుతుందని భావిస్తున్నాం.
– సునిల్ భరత్వాల్, వాణిజ్య కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment