న్యూఢిల్లీ: ప్రపంచ, దేశీయ తాజా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులకు భారత్ వస్తు ఎగుమతి, దిగుమతి గణాంకాలు అద్దం పడుతున్నాయి. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే.. ఎగుమతులు వరుసగా మూడవ నెల ఫిబ్రవరిలోనూ వృద్ధిలేకపోగా క్షీణతనే నమోదుచేశాయి. 2022 ఇదే నెలతో పోల్చితే ఎగుమతుల విలువ 8.8 శాతం పడిపోయి, 33.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతుల్లోనూ 8.21 శాతం క్షీణత నమోదుకావడం గమనార్హం. 2022 ఇదే నెలతో పోల్చితే ఈ విలువ 55.9 బిలియన్ డాలర్ల నుంచి 51.31 బిలియన్ డాలర్లకు పడిపోయింది. వెరసి అధికారిక గణాంకాల ప్రకారం ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 17.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య...
2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య 11 నెలల్లో వస్తు ఎగుమతులు 7.5% పెరిగి, 406 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇదే కాలంలో దిగుమతులు 18.82% పెరిగి 653 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వెరసి వాణిజ్యలోటు 247 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల విలువ 422 బిలియన్ డాలర్లు తాకాయి. 2022-23లో ఈ విలువను అధిగమిస్తున్నామన్న హర్షాతిరేకాలు భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ)సహా సంబంధిత వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
► 11 నెలల్లో పెట్రోలియం ప్రొడక్టులు, రసాయనాలు, ఫార్మా, ఎలక్ట్రానిక్ గూడ్స్, బియ్యం, రెడీ మేడ్ దుస్తుల ఎగుమతులు పెరగ్గా, ఇంజనీరింగ్ గూడ్స్, రత్నాభరణాలు, కాటన్ యార్న్, ఫ్యాబ్రిక్స్, ప్లాసిక్, లినోలియం ఎగుమతులు క్షీణించాయి.
► పసిడి దిగుమతులు ఇదే కాలంలో భారీగా పడిపోయి, 45.12 బిలియన్ డాలర్ల నుంచి 31.72 బిలియన్ డాలర్లకు చేరాయి.
► ఇక క్రూడ్ ఆయిల్ దిగుమతుల బిల్లు 11 నెలల్లో 140.67 బిలియన్ డాలర్ల నుంచి 193.47 బిలియన్ డాలర్లకు ఎగసింది.
ఎగుమతులు.. మూడో నెలా మైనస్
Published Thu, Mar 16 2023 1:07 AM | Last Updated on Thu, Mar 16 2023 11:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment