వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో (2023–24) 5.9 శాతానికి పరిమితం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజాగా అంచనావేసింది. ఈ మేరకు క్రితం 6.1 శాతం అంచనాలకు 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. అయితే 5.9 శాతం వృద్ధి సాధించినప్పటికీ, ఇది ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి రేటు కావడం గమనార్హం. సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్ట పనితీరును కనబరుస్తుందని అభిప్రాయపడింది.
కాగా, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతంగా ఐఎంఎఫ్ ప్రపంచ వార్షిక ఎకనమిక్ అవుట్‌లుక్ అంచనావేస్తోంది. 2024–25లో భారత్ వృద్ధి రేటు అంచనాలను సైతం క్రితం (జనవరిలో) 6.8 శాతం అంచనాల నుంచి అవుట్‌లుక్ 6.3 శాతానికి తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంచనాలకన్నా భారత్ వృద్ధికి సంబంధించి ఐఎంఎఫ్ అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. 2022–23లో 7 శాతం, 2023–24లో 6.4 శాతం వృద్ధిని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. 2022–23 భారత్ జీడీపీ అధికారిక గణాంకాలు వెలువడాల్సి ఉంది. నివేదికలో మరికొన్ని అంశాలు చూస్తే...
► 2023లో చైనా వృద్ధి రేటు 5.2 శాతంగా ఉంటుంది. 2024లో ఈ రేటు 4.5 శాతానికి తగ్గుతుంది. అయితే 2022లో నమోదయిన 3 శాతం వృద్ధిరేటు కన్నా తాజా అంచనాలు అధికంగా ఉండడం గమనార్హం.
► మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ఎదురవుతున్న సవాళ్ల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్నట్లే కనబడుతోంది. చైనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. సరఫరాల సమస్యలు తొలుగుతున్నాయి. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా సెంట్రల్ బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానమే వృద్ధికి ప్రతికూలతలు సృష్టించవచ్చు.
► ప్రపంచ ఆర్థిక వృద్ధి 2023లో 2.8 శాతంగా నమోదుకావచ్చు. 2024లో ఈ రేటు 3 శాతానికి పెరుగుతుందని అంచనావేస్తున్నాం.
► 2022లో 8.7 శాతంగా ఉన్న గ్లోబల్ ఇన్‌ఫ్లెషన్ (అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం) 2023లో 7 శాతానికి, 2024లో 4.9 శాతానికి తగ్గవచ్చు.
► యూరోజోన్, బ్రిటన్‌లు మందగమనం అంచన నిలబడ్డాయి. యూరోజోన్‌లో 2023లో కేవలం 0.8 శాతం వృద్ది నమోదయ్యే అవకాశం ఉంది. బ్రిటన్‌లో అసలు వృద్ధిలేకపోగా 0.3 శాతం క్షీణత నమోదుకావచ్చు. అయితే 2024లో ఈ రేట్లు వరుసగా 1.4 శాతం, 1 శాతం వృద్ధి బాటకు మళ్లవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment