ముంబై: జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) తాజా అంచనా 7 శాతం కంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి రేటు మరింత తగ్గే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తన తాజా అంచనాల్లో పేర్కొంది. చివరి త్రైమాసికంలో (జనవరి–మార్చి) వృద్ధి రేటు దాదాపు 4 శాతంగా ఉంటుందని కూడా పేర్కొంది. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 13.2 శాతంగా నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో 6.3 శాతంగా ఉంది.
మూడవ తైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ఈ రేటు అంచనాలకన్నా తగ్గి 4.4 శాతంగా నమోదయ్యింది. అయితే మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతం నమోదవుతుందని రెండవ ముందస్తు అంచనాల్లో ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. ఈ స్థాయి వృద్ధి రేటు నమోదుకావాలంటే నాల్గవ త్రైమాసికంలో కనీసం 4.1 శాతం వృద్ధి రేటు నమోదుకావాల్సి ఉంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా 2022–23లో వృద్ధి రేటు 6.8 శాతంగానే అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా రేటింగ్స్ విశ్లేషకులు పరాస్ జస్‌రాయ్ చేసిన విశ్లేషణల్లో కొన్ని ముఖ్యాంశాలు..
► వృద్ధి పురోగతికి పలు అవరోధాలు ఉన్నాయి. డిమాండ్ ఊపందుకోవడం లేదు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఎగుమతుల్లో పురోగతి లేదు. రుణ వృద్ధి కఠిన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది.
► ఇక ఉత్తరాదిలో వేసవి ఫిబ్రవరిలోనే తీవ్రంగా ఉంది. ఇది గోధుమ ఉత్పత్తిపై ఆందోళనలను సృష్టిస్తోంది. మార్చి– మే మధ్య వేసవి తీవ్రత మరింత ఉండే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించడం కూడా ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశం.
► నాల్గవ త్రైమాసికంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు కనీసం 4.3 శాతం నమోదవుతుందన్న అంచనాలను వేసవి తీవ్రత విఘాతం కలిగించవచ్చు.
► ఇక ద్రవ్యోల్బణం తీవ్రత గ్రామీణ వినియోగ డిమాండ్‌పై ప్రభావితం చూపే వీలుంది. మహమ్మారి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పడిపోయిన డిమాండ్ ఇంకా నత్తనడకనే సాగుతోంది.
► మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మిగుల్లో ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ లిక్విడిటీ తగ్గుతుండడం మరో ఆందోళకరమైన అంశం. జనవరిలో బలమైన క్రెడిట్ డిమాండ్ కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ నాలుగు నెలల కనిష్టం 0.43 శాతానికి తగ్గింది. 2022 డిసెంబర్‌లో ఇది 0.53 శాతంగా ఉంది.
ఏడు శాతం కంటే తక్కువే.. మరింత తగ్గే అవకాశం
Published Tue, Mar 14 2023 4:18 AM | Last Updated on Tue, Mar 14 2023 8:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment