న్యూఢిల్లీ: హాట్ రోల్డ్ స్టీల్ ఉత్పత్తులను వియత్నాం నుండి దిగుమతి చేసుకోవడంపై యాంటీ డంపింగ్ విచారణను భారత్ ప్రారంభించింది. హాట్ రోల్డ్ ఫ్లాట్ అల్లాయ్ లేదా నాన్–అల్లాయ్ స్టీల్ డంపింగ్ ఆరోపణలపై వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన దర్యాప్తు విభాగం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) ఈ విచారణ జరుపుతోంది.
డీజీటీఆర్ నోటిఫికేషన్ ప్రకారం వియత్నాం నుండి దిగుమతులపై యాంటీ డంపింగ్ విచారణను ప్రారంభించాలని కోరుతూ దేశీయ ఉత్పత్తిదారులైన జేఎస్‌డబ్లు్య స్టీల్ లిమిటెడ్, ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ తరపున ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఒక దరఖాస్తును దాఖలు చేసింది. దేశీయంగా తయారీ కంటే తక్కువ ధరలకు ఉత్పత్తిని దిగుమతి చేసుకుంటున్నారని.. ఇది దేశీయ పరిశ్రమకు వస్తుపరమైన హాని కలిగిస్తోందని దరఖాస్తుదారులు ఆరోపించారు.
అలాగే దేశీయ పరిశ్రమకు మరింత నష్టం వాటిల్లుతుందని, యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని అభ్యర్థించారు. దేశీయ కంపెనీలకు ఈ డంపింగ్ కారణంగా నష్టం కలిగిందని నిర్ధారణ అయితే దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని డీజీటీఆర్ సిఫార్సు చేస్తుంది. సుంకాలు విధించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. చౌక దిగుమతులు పెరగడం వల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతిన్నాయో లేదో తెలుసుకోవడానికి వివిధ దేశాలు యాంటీ డంపింగ్ విచారణ నిర్వహిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment