Anti-dumping
-
వియత్నాం స్టీల్‌పై యాంటీ డంపింగ్!
న్యూఢిల్లీ: హాట్ రోల్డ్ స్టీల్ ఉత్పత్తులను వియత్నాం నుండి దిగుమతి చేసుకోవడంపై యాంటీ డంపింగ్ విచారణను భారత్ ప్రారంభించింది. హాట్ రోల్డ్ ఫ్లాట్ అల్లాయ్ లేదా నాన్–అల్లాయ్ స్టీల్ డంపింగ్ ఆరోపణలపై వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన దర్యాప్తు విభాగం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) ఈ విచారణ జరుపుతోంది. డీజీటీఆర్ నోటిఫికేషన్ ప్రకారం వియత్నాం నుండి దిగుమతులపై యాంటీ డంపింగ్ విచారణను ప్రారంభించాలని కోరుతూ దేశీయ ఉత్పత్తిదారులైన జేఎస్‌డబ్లు్య స్టీల్ లిమిటెడ్, ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ తరపున ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఒక దరఖాస్తును దాఖలు చేసింది. దేశీయంగా తయారీ కంటే తక్కువ ధరలకు ఉత్పత్తిని దిగుమతి చేసుకుంటున్నారని.. ఇది దేశీయ పరిశ్రమకు వస్తుపరమైన హాని కలిగిస్తోందని దరఖాస్తుదారులు ఆరోపించారు. అలాగే దేశీయ పరిశ్రమకు మరింత నష్టం వాటిల్లుతుందని, యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని అభ్యర్థించారు. దేశీయ కంపెనీలకు ఈ డంపింగ్ కారణంగా నష్టం కలిగిందని నిర్ధారణ అయితే దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని డీజీటీఆర్ సిఫార్సు చేస్తుంది. సుంకాలు విధించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. చౌక దిగుమతులు పెరగడం వల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతిన్నాయో లేదో తెలుసుకోవడానికి వివిధ దేశాలు యాంటీ డంపింగ్ విచారణ నిర్వహిస్తాయి. -
స్టీల్ పైప్స్, ట్యూబ్స్ పై యాంటీ డంపింగ్ సుంకం
న్యూఢిల్లీ: చైనా నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న స్టీల్ పైప్స్, సీమ్‌లెస్ ట్యూబ్స్‌పై కేంద్ర ప్రభుత్వం యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. చౌక దిగుమతుల బారినుంచి దేశీ స్టీల్ పరిశ్రమను ఆదుకోవాల్సి ఉందని, అందులో భాగంగా ఆయిల్, గ్యాస్ అన్వేషణలో ఉపయోగించే స్టీల్ పైప్స్, ట్యూబ్స్‌పై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని డెరైక్టరేట్ జనరల్ ఫర్ యాంటీ డంపింగ్ అండ్ అలీడ్ డ్యూటీస్ (డీజీఏడీ) ఇటీవల రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఒక ప్రతిపాదన చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం కొన్ని స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించిందని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) తెలిపింది. ఇది 961.33-1,610.67 డాలర్ల శ్రేణిలో ఉంటుందని పేర్కొంది. -
ఉక్కు దిగుమతుల జోరు...
► మే నెలలో 58 శాతం వృద్ధి నమోదు ► ఇలాగైతే దేశీ కంపెనీలకు గడ్డు కాలమే! ► యాంటీ డంపింగ్ చర్య ఫలితంపై ఆశలు న్యూఢిల్లీ: దేశంలో ఉక్కు దిగుమతులు బాగా పెరిగాయి. మే నెలలో ఉక్కు దిగుమతులు 58 శాతం వృద్ధితో 0.91 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. అదే నెలలో ఉక్కు వినియోగం కూడా 6.8 శాతం పెరిగి 7.23 మిలియన్ టన్నులకు చేరింది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ఉక్కు దిగుమతుల వృద్ధి 20 శాతంగా ఉంది. మొత్తమ్మీద దేశంలో గతేడాది 75 మిలియన్ టన్నుల ఉక్కు వినియోగం జరిగిందని, 2015-16లో అది 80 మిలియన్ టన్నులకు చేరుతుందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ అంచనా వేసింది. ఉక్కు మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని జాయింట్ ప్లాంట్ కమిటీ (జేపీసీ) గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదే సమయంలో ఉక్కు దిగుమతులు 54% వృద్ధితో 1.67 మిలియన్ టన్నుల కు చేరాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం ఉక్కు దిగుమతులు 71 శాతం వృద్ధితో 9.32 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. దిగుమతులకు కళ్లెం వేయకుంటే కష్టమే ఉక్కు దిగుమతులను నియంత్రించకపోతే దేశీ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటాయని నిపుణులు చెబుతున్నారు. చైనా, కొరియా వంటి దేశాల నుంచి తక్కువ ధరలకే ఉక్కు దిగుమతి అవుతుండటంతో దేశీ ఉక్కు కంపెనీలపై ధరల ఒత్తిడి పెరుగుతోంది. దీంతో దేశీ ఉక్కు తయారీ కంపెనీలు కష్టకాలంలో కొట్టుమిట్టాడుతున్నాయి. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ (డీజీఏడీ) కూడా అధిక ఉక్కు దిగుమతుల వల్ల దేశీ ఉక్కు పరిశ్రమలు కుదేలయ్యే పరిస్థితులు వస్తాయని పేర్కొంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉక్కు దిగుమతుల పై యాంటీ డంపింగ్ సుంకం విధించింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఉక్కు దిగుమతులు దిగివచ్చే సూచనలు కనిపించడం లేదని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది. మొత్తంమీద పరిశ్రమల యాంటీ డంపింగ్ సుంకం ఫలితంపై ఆశలు పెట్టుకుంది. -
స్టీల్ దిగుమతులపై యాంటీ-డంపింగ్ సుంకం
చైనా, మలేసియా, కొరియాలపై కేంద్రం అస్త్ట్రం దేశీయ పరిశ్రమను కాపాడే లక్ష్యం న్యూఢిల్లీ : చైనా, మలేసియా, కొరియా నుంచి కొన్ని స్టీల్ ప్రొడక్టుల దిగుమతులపై కేంద్రం యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. దేశీయ పరిశ్రమను కాపాడే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ చర్య తీసుకుంది. టన్నుకు 316 డాలర్ల వరకూ యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తున్నట్లు పేర్కొంది. దేశీయ మార్కెట్‌కన్నా తక్కువ ధరకు కొన్ని స్టీల్ ప్రొడక్టుల దిగుమతులు, వాటిలోనూ కొంత నాణ్యత కొరవడటం వంటి కారణాలు ఈ సుంకాల విధింపునకు కారణమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు క్లుప్తంగా... చైనా నుంచి దిగుమతులపై టన్నుకు 309 డాలర్లు, మలేషియా నుంచి దిగుమతులపై టన్నుకు 316 డాలర్లు సుంకాలు విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. కొరియా విషయంలో ఈ విలువ 180 డాలర్లుగా ఉంది. ఆటో వంటి రంగాల్లో వినియోగించే స్టెయిన్లెస్ స్టీల్ హాట్ రోల్డ్ ఫ్లాట్ ఉత్పత్తులపై ఐదేళ్లు యాంటీ-డంపింగ్ సుంకం అమలవుతుంది. ఈ స్టీల్ ప్రొడక్టులను ఆటోతోపాటు తయారీ రంగం, రియాక్టర్ వెసల్స్, మెటీరియల్ హ్యాం డ్లింగ్ ఎక్విప్మెంట్, రైల్వే లు, పైపులు, ట్యూబ్స్, ఆర్కిటెక్చర్, భవన- నిర్మా ణం, ఇండస్ట్రియల్ ఫ్యాబ్రికేషన్, విద్యుత్ రంగాల్లో వినియోగిస్తారు. హర్షణీయం.. ఐఎస్‌ఎస్‌డీఏ: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇండియన్ స్టెయిన్లెస్ స్టీల్ డెవలప్మెంట్ అసోసియేషన్ (ఐఎస్‌ఎస్‌డీఏ) హర్షం వ్యక్తం చేసింది. చౌక స్టీల్ దిగుమతుల వల్ల దేశీయ స్టెయిన్లెస్ స్టీల్ పరిశ్రమ బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, ఈ దశలో కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని అన్నారు.