ఉక్కు దిగుమతుల జోరు...
► మే నెలలో 58 శాతం వృద్ధి నమోదు
► ఇలాగైతే దేశీ కంపెనీలకు గడ్డు కాలమే!
► యాంటీ డంపింగ్ చర్య ఫలితంపై ఆశలు
న్యూఢిల్లీ: దేశంలో ఉక్కు దిగుమతులు బాగా పెరిగాయి. మే నెలలో ఉక్కు దిగుమతులు 58 శాతం వృద్ధితో 0.91 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. అదే నెలలో ఉక్కు వినియోగం కూడా 6.8 శాతం పెరిగి 7.23 మిలియన్ టన్నులకు చేరింది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ఉక్కు దిగుమతుల వృద్ధి 20 శాతంగా ఉంది. మొత్తమ్మీద దేశంలో గతేడాది 75 మిలియన్ టన్నుల ఉక్కు వినియోగం జరిగిందని, 2015-16లో అది 80 మిలియన్ టన్నులకు చేరుతుందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ అంచనా వేసింది.
ఉక్కు మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని జాయింట్ ప్లాంట్ కమిటీ (జేపీసీ) గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదే సమయంలో ఉక్కు దిగుమతులు 54% వృద్ధితో 1.67 మిలియన్ టన్నుల కు చేరాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం ఉక్కు దిగుమతులు 71 శాతం వృద్ధితో 9.32 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.
దిగుమతులకు కళ్లెం వేయకుంటే కష్టమే
ఉక్కు దిగుమతులను నియంత్రించకపోతే దేశీ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటాయని నిపుణులు చెబుతున్నారు. చైనా, కొరియా వంటి దేశాల నుంచి తక్కువ ధరలకే ఉక్కు దిగుమతి అవుతుండటంతో దేశీ ఉక్కు కంపెనీలపై ధరల ఒత్తిడి పెరుగుతోంది. దీంతో దేశీ ఉక్కు తయారీ కంపెనీలు కష్టకాలంలో కొట్టుమిట్టాడుతున్నాయి. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ (డీజీఏడీ) కూడా అధిక ఉక్కు దిగుమతుల వల్ల దేశీ ఉక్కు పరిశ్రమలు కుదేలయ్యే పరిస్థితులు వస్తాయని పేర్కొంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉక్కు దిగుమతుల పై యాంటీ డంపింగ్ సుంకం విధించింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఉక్కు దిగుమతులు దిగివచ్చే సూచనలు కనిపించడం లేదని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది. మొత్తంమీద పరిశ్రమల యాంటీ డంపింగ్ సుంకం ఫలితంపై ఆశలు పెట్టుకుంది.