న్యూఢిల్లీ: కొన్ని రకాల స్టీల్ దిగుమతులపై 25 శాతం సుంకం విధింపునకు కేంద్ర ఉక్కు శాఖ ప్రతిపాదించింది. కేంద్ర ఉక్కు మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మధ్య ఢిల్లీలో జరిగిన భేటీలో ఈ ప్రతిపాదన వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి సెయిల్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏఎంఎన్‌ఎస్ ఇండియా కంపెనీల ప్రతినిధులు సైతం హాజరయ్యారు.
దీనిపై మంత్రి గోయల్ ఎక్స్ వేదికపై ట్వీట్ చేశారు. ‘‘స్టీల్, మెటలర్జికల్ కోక్ పరిశ్రమల భాగస్వాములు, నా సహచరుడు, భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామితో కలసి సమావేశం నిర్వహించాం. దేశాభివృద్ధిలో ఈ రెండు శాఖలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉత్పత్తి, నాణ్యత పెంపుతోపాటు అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంచే మార్గాలపై చర్చించాం’’అని గోయల్ తన ట్వీట్‌లో వెల్లడించారు.
మంత్రి కుమారస్వామి సైతం ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై స్పందించారు. రెండు శాఖల మధ్య సహకారం, దేశీ స్టీల్, భారీ పరిశ్రమలకు సంబంధించి వ్యాపార నిర్వహణను సులభతరం చేసే మార్గాలపై చర్చించినట్టు చెప్పారు. ఇదే భేటీలో స్టీల్ దిగుమతులపై 25 శాతం రక్షణాత్మక సుంకం విధించాలని భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ కోరింది. కొన్ని దేశాల నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతులు తమకు సమస్యగా మారినట్టు దేశీ కంపెనీలు ఎప్పటి నుంచో కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నాయి. దిగుమతి సుంకాల పెంపుతో దేశీ పరిశ్రమను కాపాడాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో ఉక్కు శాఖ ప్రతిపాదన కార్యరూపం దాలుస్తుందేమో చూడాల్సి ఉంది.
పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు..
దేశంలోకి వస్తున్న స్టీల్ దిగుమతుల్లో 62 శాతం మేర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కలిగిన దేశాల నుంచే ఉంటున్నాయని, వీటికి ఎలాంటి సుంకం వర్తించడం లేదని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ గత నెలలో చెప్పడం గమనార్హం. కనుక దిగుమతి సుంకాలను పెంచినప్పటికీ ఈ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఎంలాంటి ప్రభావం ఉండదన్నారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యపై తమకు అవగాహన ఉన్నట్టు చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) 5.51 మిలియన్ టన్నుల స్టీల్ దిగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 3.66 మిలియన్ టన్నుల కంటే 60 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చైనా నుంచి స్టీల్ దిగుమతులు 1.85 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో చైనా నుంచి 1.0 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు దిగుమతయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment