Steel imports
-
విదేశీ స్టీల్‌పై ‘ఉక్కు’పాదం.. దిగుమతులపై 25 శాతం సుంకం
న్యూఢిల్లీ: కొన్ని రకాల స్టీల్ దిగుమతులపై 25 శాతం సుంకం విధింపునకు కేంద్ర ఉక్కు శాఖ ప్రతిపాదించింది. కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డీ కుమారస్వామి, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మధ్య ఢిల్లీలో జరిగిన భేటీలో ఈ ప్రతిపాదన వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి సెయిల్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏఎంఎన్ఎస్ ఇండియా కంపెనీల ప్రతినిధులు సైతం హాజరయ్యారు.దీనిపై మంత్రి గోయల్ ఎక్స్ వేదికపై ట్వీట్ చేశారు. ‘‘స్టీల్, మెటలర్జికల్ కోక్ పరిశ్రమల భాగస్వాములు, నా సహచరుడు, భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామితో కలసి సమావేశం నిర్వహించాం. దేశాభివృద్ధిలో ఈ రెండు శాఖలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉత్పత్తి, నాణ్యత పెంపుతోపాటు అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంచే మార్గాలపై చర్చించాం’’అని గోయల్ తన ట్వీట్లో వెల్లడించారు.మంత్రి కుమారస్వామి సైతం ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై స్పందించారు. రెండు శాఖల మధ్య సహకారం, దేశీ స్టీల్, భారీ పరిశ్రమలకు సంబంధించి వ్యాపార నిర్వహణను సులభతరం చేసే మార్గాలపై చర్చించినట్టు చెప్పారు. ఇదే భేటీలో స్టీల్ దిగుమతులపై 25 శాతం రక్షణాత్మక సుంకం విధించాలని భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ కోరింది. కొన్ని దేశాల నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతులు తమకు సమస్యగా మారినట్టు దేశీ కంపెనీలు ఎప్పటి నుంచో కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నాయి. దిగుమతి సుంకాల పెంపుతో దేశీ పరిశ్రమను కాపాడాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో ఉక్కు శాఖ ప్రతిపాదన కార్యరూపం దాలుస్తుందేమో చూడాల్సి ఉంది. పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు.. దేశంలోకి వస్తున్న స్టీల్ దిగుమతుల్లో 62 శాతం మేర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కలిగిన దేశాల నుంచే ఉంటున్నాయని, వీటికి ఎలాంటి సుంకం వర్తించడం లేదని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ గత నెలలో చెప్పడం గమనార్హం. కనుక దిగుమతి సుంకాలను పెంచినప్పటికీ ఈ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఎంలాంటి ప్రభావం ఉండదన్నారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యపై తమకు అవగాహన ఉన్నట్టు చెప్పారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) 5.51 మిలియన్ టన్నుల స్టీల్ దిగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 3.66 మిలియన్ టన్నుల కంటే 60 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చైనా నుంచి స్టీల్ దిగుమతులు 1.85 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో చైనా నుంచి 1.0 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు దిగుమతయ్యాయి. -
రూపీ కోసం వాటిపై సుంకాలు పెంపు
న్యూఢిల్లీ : రోజు రోజుకు అంతకంతకు క్షీణిస్తున్న రూపాయిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యల్లో భాగంగా స్టీల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచాలని కేంద్ర స్టీల్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. కొన్ని స్టీల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని 15 శాతం పెంచాలని స్టీల్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఈ రేట్లు 5 శాతం నుంచి 12.5 శాతం మధ్యలో ఉన్నాయి. దీంతో రూపాయికి కాస్త మద్దతు ఇవ్వొచ్చని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనతో అవసరం లేని దిగుమతులను తగ్గించి, డాలర్లు తరలి వెళ్లడాన్ని ఆపివేయొచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయంపై వాణిజ్య మంత్రిత్వ శాఖతో నేడు చర్చోపచర్చలు జరుపనున్నారు. దేశీయ స్టీల్ ఉత్పత్తిని ప్రోత్సహించి, మేకిన్ ఇండియాకు ఊతమిచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగపడనున్నాయని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై వెంటనే స్పందించేందుకు స్టీల్, ట్రేడ్ మంత్రిత్వ శాఖలు అంగీకరించలేదు. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో, నికర స్టీల్ దిగుమతులు రెండేళ్లలో తొలిసారి 2.1 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇవి 15 శాతం పెంపు. మార్చితో ముగిసిన 2017-18 ఆర్థిక సంవత్సరంలో స్టీల్ దిగుమతులు 8.4 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. వీటిలో 45 శాతం జపాన్, దక్షిణ కొరియా నుంచి వచ్చినవే. ఆయా దేశాలతో భారత్‌కు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలున్నాయి. నార్త్ ఆసియన్ దేశాల నుంచి స్టీల్‌ను దిగుమతి చేసుకుంటే, ఎలాంటి సుంకాలు వర్తించవు. కానీ ఇతర స్టీల్ సరఫరా దేశాలు చైనా, దక్షిణాఫ్రికా, మలేషియా, రష్యా, ఇండోనేషియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే మాత్రం సుంకాలను భరించాల్సి ఉంటుంది. స్టీల్‌తో పాటు ప్రభుత్వం బంగారం, హై-ఎండ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆంక్షలు విధించేందుకు చూస్తోంది. భారత్, ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం కొనుగోలుదారు. ఆగస్టులో దీని దిగుమతులు 90 శాతం పెరిగి, 3.64 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
ఉక్కు దిగుమతుల జోరు
మే నెలలో ఉక్కు దిగుమతులు 58 శాతం వృద్ధితో 0.91 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. అదే నెలలో ఉక్కు వినియోగం కూడా 6.8 శాతం పెరిగి 7.23 మిలియన్ టన్నులకు చేరింది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ఉక్కు దిగుమతుల వృద్ధి 20 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదే సమయంలో ఉక్కు దిగుమతులు 54 శాతం వృద్ధితో 1.67 మిలియన్ టన్నులకు చేరాయి. -
ఉక్కు దిగుమతుల జోరు...
► మే నెలలో 58 శాతం వృద్ధి నమోదు ► ఇలాగైతే దేశీ కంపెనీలకు గడ్డు కాలమే! ► యాంటీ డంపింగ్ చర్య ఫలితంపై ఆశలు న్యూఢిల్లీ: దేశంలో ఉక్కు దిగుమతులు బాగా పెరిగాయి. మే నెలలో ఉక్కు దిగుమతులు 58 శాతం వృద్ధితో 0.91 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. అదే నెలలో ఉక్కు వినియోగం కూడా 6.8 శాతం పెరిగి 7.23 మిలియన్ టన్నులకు చేరింది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ఉక్కు దిగుమతుల వృద్ధి 20 శాతంగా ఉంది. మొత్తమ్మీద దేశంలో గతేడాది 75 మిలియన్ టన్నుల ఉక్కు వినియోగం జరిగిందని, 2015-16లో అది 80 మిలియన్ టన్నులకు చేరుతుందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ అంచనా వేసింది. ఉక్కు మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని జాయింట్ ప్లాంట్ కమిటీ (జేపీసీ) గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదే సమయంలో ఉక్కు దిగుమతులు 54% వృద్ధితో 1.67 మిలియన్ టన్నుల కు చేరాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం ఉక్కు దిగుమతులు 71 శాతం వృద్ధితో 9.32 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. దిగుమతులకు కళ్లెం వేయకుంటే కష్టమే ఉక్కు దిగుమతులను నియంత్రించకపోతే దేశీ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటాయని నిపుణులు చెబుతున్నారు. చైనా, కొరియా వంటి దేశాల నుంచి తక్కువ ధరలకే ఉక్కు దిగుమతి అవుతుండటంతో దేశీ ఉక్కు కంపెనీలపై ధరల ఒత్తిడి పెరుగుతోంది. దీంతో దేశీ ఉక్కు తయారీ కంపెనీలు కష్టకాలంలో కొట్టుమిట్టాడుతున్నాయి. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ (డీజీఏడీ) కూడా అధిక ఉక్కు దిగుమతుల వల్ల దేశీ ఉక్కు పరిశ్రమలు కుదేలయ్యే పరిస్థితులు వస్తాయని పేర్కొంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉక్కు దిగుమతుల పై యాంటీ డంపింగ్ సుంకం విధించింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఉక్కు దిగుమతులు దిగివచ్చే సూచనలు కనిపించడం లేదని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది. మొత్తంమీద పరిశ్రమల యాంటీ డంపింగ్ సుంకం ఫలితంపై ఆశలు పెట్టుకుంది.