విదేశాల్లో నేరుగా లిస్టింగ్‌.. | Government to allow NRIs to acquire 100persant stake in Air India | Sakshi
Sakshi News home page

విదేశాల్లో నేరుగా లిస్టింగ్‌..

Published Thu, Mar 5 2020 5:16 AM | Last Updated on Thu, Mar 5 2020 5:16 AM

Government to allow NRIs to acquire 100persant stake in Air India - Sakshi

న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు విదేశీ ఎక్సే్చంజీల్లో నేరుగా లిస్టయ్యే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇందుకు అనుగుణంగా కంపెనీల చట్టం, 2013కి సవరణలు చేయనుంది. మరోవైపు, ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ప్రవాస భారతీయులు (ఎన్నారై) 100 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అనుమతులివ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్‌ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.

ప్రస్తుతం కొన్ని భారతీయ సంస్థల షేర్లు విదేశీ ఎక్సే్చంజీల్లో ట్రేడవుతున్నప్పటికీ.. అమెరికన్‌ డిపాజిటరీ రిసీట్స్‌ (ఏడీఆర్‌), గ్లోబల్‌ డిపాజిటరీ రిసీట్స్‌ (జీడీఆర్‌) రూపంలో లిస్టయి ఉంటున్నాయి. నేరుగా విదేశాల్లో లిస్టింగ్‌ అవకాశం లభించిన పక్షంలో ఆయా సంస్థలు విస్తృత స్థాయిలో నిధులు సమీకరించుకునేందుకు మరిన్ని మార్గాలు లభించడంతో పాటు.. దేశంలోకి మరింతగా పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉండగలదని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ తెలిపారు.

దేశీ లిస్టెడ్, అన్‌లిస్టెడ్‌ కంపెనీలు కూడా విదేశాల్లో లిస్టయ్యేందుకు వెసులుబాటునిచ్చేలా కంపెనీల చట్టంలో తగు మార్పులు చేయనున్నట్లు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ తెలిపారు. ఇది పూర్తిగా అమల్లోకి వచ్చేందుకు కొన్ని నెలలు పడుతుందని.. త్వరలో నియమ, నిబంధనలను నోటిఫై చేస్తామన్నారు. అటు కంపెనీల చట్టంలో 72 సవరణలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. జైలు శిక్షల్లాంటి క్రిమినల్‌ చర్యల నిబంధనలను తొలగిస్తామని, పెనాల్టీల పరిమాణాన్ని కూడా తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

ఎయిరిండియాలో 49%గానే విదేశీ ఎయిర్‌లైన్స్‌ వాటాలు..
భారీ రుణాలు, నష్టాల భారంతో అమ్మకానికి వచ్చిన ఎయిరిండియాలో ఎన్నారైల పెట్టుబడుల పరిమితిని 100%కి పెంచుతూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో విదేశీ ఎయిర్‌లైన్స్‌ సహా ఇతరత్రా విదేశీ సంస్థలు.. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎయిరిండియాలో 49%కి మించి వాటాలు కొనుగోలు చేయడానికి ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. తద్వారా ఎయిరిండియా నియంత్రణాధికారాలు భారతీయుల చేతుల్లోనే ఉండేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్‌లో ఇతరత్రా ప్యాసింజర్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎన్నారైలు ఆటోమేటిక్‌ పద్ధతిలో 100% వాటాలు కొనుగోలు చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ఎయిరిండియాలో మాత్రం 49%కి మాత్రమే అనుమతులు  న్నాయి.  ఎయిరిండియా విషయంలో ఇదొక మైలురాయిలాంటి నిర్ణయంగా జవదేకర్‌ చెప్పారు. కంపెనీ ప్రైవేట్‌ చేతుల్లోకి వెళ్లినా.. ప్రయాణికులకు యథాప్రకారం మెరుగైన సేవలు అందిస్తుందని, పెట్టుబడి అవకాశాలు పెంచుకోగలదని ఆయన తెలిపారు.


ఏప్రిల్‌ నుంచి బ్యాంకుల విలీనం అమల్లోకి..

ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసే ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. భారీ స్థాయికి చేరడం ద్వారా మెగా బ్యాంకులు.. ఇటు దేశీయంగాను, అటు అంతర్జాతీయంగాను మరింతగా పోటీపడగలవని, వ్యయాలు తగ్గించుకోగలవని ఆమె పేర్కొన్నారు. విలీనంతో ప్రభుత్వ రంగంలో ఏడు భారీ బ్యాంకులు, అయిదు చిన్న స్థాయి బ్యాంకులు మిగలనున్నాయి. కన్సాలిడేషన్‌ ప్రణాళిక ప్రకారం ఆంధ్రా బ్యాంకు.. కార్పొరేషన్‌ బ్యాంకును యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేయనున్నారు. అలాగే, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ .. యునైటెడ్‌ బ్యాంక్‌ను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో, సిండికేట్‌ బ్యాంకును కెనరా బ్యాంకులో, అలహాబాద్‌ బ్యాంకును ఇండియన్‌ బ్యాంకులో కలపనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement