అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్.. వేలాది మంది భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఎదురు చూస్తున్నారు. వైట్ హౌస్ మెట్ల వద్ద నలుపు రంగు కోట్లు ధరించిన కొందరు కుర్రాళ్లు "చయ్య చయ్య", "దిల్ సే", "జాష్న్-ఎ-బహారా" బాలీవుడ్ పాటలతో అక్కడున్నవారందరినీ ఉర్రూతలూగించారు. ఇంతకీ ఎవరీ కుర్రాళ్లు అంటే..
స్వరాలే వాద్యాలుగా..
‘పెన్ మసాలా’.. ప్రపంచంలో మొట్టమొదటి దక్షిణాసియా ఎ క్యాపెల్లా (A Capella) గ్రూప్. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన 19 మంది విద్యార్థులతో ఇది ఏర్పాటైంది. ఎ క్యాపెల్లా అంటే వాద్య సహకారం లేకుండా పాటలు పాడే బ్యాండ్. స్వయంగా తమ స్వరంతోనే వాద్య శబ్ధాలను వీరు అనుకరిస్తారు. 1996 నుంచి ఈ బ్యాండ్ ఉనికిలో ఉంది. ఈ బృందం దేశాధినేతలు, ఇతర ప్రముఖులు పర్యటనలకు వచ్చినప్పుడు పాడటం ద్వారా పేరు తెచ్చుకుంది.
ఇటీవల వైట్ హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని మోదీ కోసం ఇచ్చిన విందు సందర్భంగా ప్రదర్శన ఇవ్వడానికి తమకు అవకాశం, గౌరవం దక్కిందని పెన్ మసాలా గ్రూప్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వైట్ హౌస్‌లో వేలాది మంది భారతీయుల సమక్షంలో ప్రదర్శన ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.
ఈ బ్యాండ్ ఇంతకుముందు అప్పటి ప్రెసిడెంట్ ఒబామా కోసం వైట్ హౌస్‌లో, ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చింది. పిచ్ పర్ఫెక్ట్ 2 అనే హాలీవుడ్ చిత్రానికి సౌండ్‌ట్రాక్ అందించింది. దీనికి 2015లో ఉత్తమ సౌండ్‌ట్రాక్‌గా అమెరికన్ మ్యూజిక్ అవార్డు లభించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment