వంద బిలియన్ డాలర్లు.. మన రూపాయల్లో సుమారు 8 లక్షల కోట్లు! గతేడాది విదేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపిన మొత్తమిది! ఇలాంటి చెల్లింపుల్లో ప్రవాస భారతీయులు ప్రపంచంలోనే టాప్! అయితే ఏంటి? చాలా ఉంది! ఈ మొత్తం అనేక మందికి అన్నం పెడుతోంది! పేదరికం తగ్గేందుకు, ప్రజల ఆరోగ్యం మెరుగయ్యేందుకు, నవజాత శిశువులు పుష్టిగా ఉండేందుకూ కారణమవుతోంది..ఎలా?
ప్రపంచ బ్యాంకు తాజా లెక్కల ప్రకారం 2022–23లో ప్రపంచం మొత్తమ్మీద అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాలకు పంపిన మొత్తం 80,000 కోట్ల డాలర్లు. ఈ విషయంలో అన్ని దేశాల కంటే తొలి స్థానంలో ఉన్న భారత్‌కు విదేశాల్లోని భారతీయులు వంద బిలియన్ డాలర్లు పంపితే, అరవై బిలియన్ డాలర్లతో మెక్సికో రెండో స్థానంలో ఉంది.
విదేశాల్లో ఉన్న మన బంధువులు లేదా మిత్రులు ఇంటికి పంపే డబ్బుల్ని ఇక్కడ రకరకాలుగా పెట్టుబడి పెడుతుంటారు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ చక్రాలు కదులుతూ ఉంటాయి. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయమూ లభిస్తుంటుంది. పైగా మధ్యవర్తి లేకుండా నేరుగా డాలర్లు భారత్‌కు వస్తుంటాయి. ఈ డాలర్లను ప్రభుత్వం ముడిచమురు, తదితర కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు.
ఎగువన ఉన్న వారికీ...
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారినే కాకుండా ఎగువన ఉన్న వారికీ ఈ చెల్లింపులు ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవస్థల్లో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దారిద్య్రరేఖకు కొంచెం ఎగువన ఉన్న వారు కూడా కిందకు పడిపోతారు. ఈ పరిస్థితుల్లో విదేశాల్లోని బంధుమిత్రులు పంపే అదనపు మొత్తాలు బాధితులు పుంజుకునేందుకు ఉపయోగపడతాయన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు.
2018 ఆగస్టు నాటి భారీ వరదల సమయంలో భారత్‌కు చెల్లింపులు దాదాపు 14 శాతం వరకూ పెరిగాయి. అంతెందుకు 2008లో ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినా, విదేశీ పెట్టుబడులు తగ్గిపోయినా ఈ రకమైన చెల్లింపులు పెరగడం గమనార్హం. అంటే ప్రభుత్వాలకు నమ్మకంగా వచ్చిపడే విదేశీ మారక ద్రవ్యం ఇది.
వ్యయం తడిసిమోపెడు!
అంతాబాగానే ఉంది కానీ.. ఇటీవలి కాలంలో చెల్లింపుల కోసం అయ్యే వ్యయం తడిసిమోపెడు అవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ అధ్యక్షతన ప్రస్తుతం జరుగుతున్న జీ20 సమావేశాల్లోనూ ఈ అంశంపై విస్తృత చర్చ జరగడం గమనార్హం. డాలర్ మారకం విలువల్లోని తేడాలు, పంపేందుకు, అందుకునేందుకు చెల్లించాల్సిన కమీషన్లు ఎక్కువగా ఉండటం వల్ల చెల్లింపుల వల్ల కలిగే ప్రయోజనాలు పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నాం. ప్రస్తుతం ఈ కమీషన్లు, మారక విలువల్లోని తేడాలనీ కలిపి ప్రతి చెల్లింపునకూ 6.24 శాతం మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తోంది.
చదవండి: మన డేటా ఎంత భద్రం? కేంద్రం ముసాయిదా బిల్లులో ఏముంది ?
అయితే మూడేళ్ల క్రితం ఇది ఏడు శాతంగా ఉంది. సమీప భవిష్యత్తులో దీనిని మూడు శాతానికి తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డబ్బులు మార్పిడి చేసే కంపెనీలు మరిన్ని అందుబాటులో ఉండేలా చేసి వాటి మధ్య పోటీ పెంచాలన్నది ఈ దిశలో జరుగుతున్న ప్రయత్నాల్లో ఒకటి. ఆయా దేశాలు ఈ చెల్లింపులపై విధిస్తున్న పన్నులను తగ్గించేందుకు, వీలైతే పూర్తిగా మాఫీ చేసేలా కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యయం తగ్గించుకునేందుకు వలస కార్మికులు లేదా ఉద్యోగులు మధ్యవర్తులను ఆశ్రయించడం వల్ల కొన్నిసార్లు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుని ఈ వ్యయాన్ని వీలైనంతగా తగ్గిస్తే వినియోగదారులకు లాభం చేకూరడమే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది.
విదేశాలకూ పెరుగుతున్న చెల్లింపులు
దశాబ్దాలుగా విదేశాల నుంచి భారత్‌కు ‘‘చెల్లింపులు’’ పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో విదేశాలకు వెళుతున్న మొత్తం కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం గత ఏడాది ఈ మొత్తం 2,710 కోట్ల డాలర్లకు చేరుకుంది. లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద భారతీయులు తమ వ్యక్తిగత అవసరాల కోసం (పర్యాటకం, విద్య, అనుమతులు అవసరం లేని పెట్టుబడులు) ఏటా దాదాపు రూ.2 కోట్లు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. 2004లో ఇది రూ.24 లక్షలు మాత్రమే. 2015లో ఈ పరిమితిని పెంచారు. దీంతో 2004లో విదేశాలకు వెళ్లే మొత్తం 460 బిలియన్ డాలర్లు కాగా 2022 నాటికి 2,710 కోట్ల డాలర్లకు చేరింది.
80 శాతం పేద, మధ్యాదాయ దేశాలే..
గత ఏడాది చెల్లింపుల్లో దాదాపు 80 శాతం పేద, మధ్యాదాయ దేశాలే అందుకున్నాయి. కొన్ని దేశాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే ఎక్కువగా ఈ చెల్లింపులు ఉండటం గమనార్హం. కాగా ఈ డబ్బులు పేదరిక నిర్మూలనకు ఎలా ఉపయోగపడతాయన్న అంశంపై మూడేళ్ల క్రితం మారియా ఫాషోలిన్సే అనే శాస్త్రవేత్త ఒక అధ్యయనం నిర్వహించారు. కార్మికులను ఇతర దేశాలకు పంపే 25 ఆసియా దేశాలను ఎంచుకుని ఈ అధ్యయనం చేశారు.
వలసలు, చెల్లింపులపై ప్రపంచబ్యాంకు వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ఆయా దేశాల్లోని పేదల సంఖ్య, వారిలో ఉండే అంతరం (కటిక పేదలు.. ఓ మోస్తరు పేదలు) వంటి వివరాలు సేకరించారు. వీటిద్వారా ఆయా దేశాల్లో పేదరికం ఎంతమేరకు ఉందన్నది నిర్ధారించుకున్నారు. రోజుకు రెండు డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న వారిని ప్రపంచబ్యాంకు పేదల కింద లెక్కవేస్తుంది. ఈ వివరాలను పొందుపరిచి గణితశాస్త్ర సూత్రాల ప్రకారం లెక్క వేస్తే విదేశాల నుంచి వీరికి అందే చెల్లింపుల ప్రభావం ఎక్కువగానే ఉన్నట్లు స్పష్టమైంది.
ఒకొక్కరికి అందే డబ్బులు పది శాతం పెరిగినా ఆ దేశంలో పేదరికంలో ఉన్న వారి శాతం (వంద మందిలో పేదల సంఖ్య) 0.4 శాతం తగ్గుతుందని తేలింది. చెల్లింపుల డబ్బులతో పేదలు మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాకుండా.. పిల్లలను చదివించుకునేందుకూ వీలేర్పడుతోంది. ఆపత్కాలాన్ని కూడా తట్టుకుని వీరు బతకగలుగుతున్నారు.
- (కంచర్ల యాదగిరిరెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment