center approval
-
విదేశాల్లో నేరుగా లిస్టింగ్..
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు విదేశీ ఎక్సే్చంజీల్లో నేరుగా లిస్టయ్యే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇందుకు అనుగుణంగా కంపెనీల చట్టం, 2013కి సవరణలు చేయనుంది. మరోవైపు, ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ప్రవాస భారతీయులు (ఎన్నారై) 100 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అనుమతులివ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం కొన్ని భారతీయ సంస్థల షేర్లు విదేశీ ఎక్సే్చంజీల్లో ట్రేడవుతున్నప్పటికీ.. అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో లిస్టయి ఉంటున్నాయి. నేరుగా విదేశాల్లో లిస్టింగ్ అవకాశం లభించిన పక్షంలో ఆయా సంస్థలు విస్తృత స్థాయిలో నిధులు సమీకరించుకునేందుకు మరిన్ని మార్గాలు లభించడంతో పాటు.. దేశంలోకి మరింతగా పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉండగలదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. దేశీ లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు కూడా విదేశాల్లో లిస్టయ్యేందుకు వెసులుబాటునిచ్చేలా కంపెనీల చట్టంలో తగు మార్పులు చేయనున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. ఇది పూర్తిగా అమల్లోకి వచ్చేందుకు కొన్ని నెలలు పడుతుందని.. త్వరలో నియమ, నిబంధనలను నోటిఫై చేస్తామన్నారు. అటు కంపెనీల చట్టంలో 72 సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జైలు శిక్షల్లాంటి క్రిమినల్ చర్యల నిబంధనలను తొలగిస్తామని, పెనాల్టీల పరిమాణాన్ని కూడా తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎయిరిండియాలో 49%గానే విదేశీ ఎయిర్‌లైన్స్ వాటాలు.. భారీ రుణాలు, నష్టాల భారంతో అమ్మకానికి వచ్చిన ఎయిరిండియాలో ఎన్నారైల పెట్టుబడుల పరిమితిని 100%కి పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో విదేశీ ఎయిర్‌లైన్స్ సహా ఇతరత్రా విదేశీ సంస్థలు.. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎయిరిండియాలో 49%కి మించి వాటాలు కొనుగోలు చేయడానికి ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. తద్వారా ఎయిరిండియా నియంత్రణాధికారాలు భారతీయుల చేతుల్లోనే ఉండేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్‌లో ఇతరత్రా ప్యాసింజర్ ఎయిర్‌లైన్స్‌లో ఎన్నారైలు ఆటోమేటిక్ పద్ధతిలో 100% వాటాలు కొనుగోలు చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ఎయిరిండియాలో మాత్రం 49%కి మాత్రమే అనుమతులు న్నాయి. ఎయిరిండియా విషయంలో ఇదొక మైలురాయిలాంటి నిర్ణయంగా జవదేకర్ చెప్పారు. కంపెనీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లినా.. ప్రయాణికులకు యథాప్రకారం మెరుగైన సేవలు అందిస్తుందని, పెట్టుబడి అవకాశాలు పెంచుకోగలదని ఆయన తెలిపారు. ఏప్రిల్ నుంచి బ్యాంకుల విలీనం అమల్లోకి.. ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. భారీ స్థాయికి చేరడం ద్వారా మెగా బ్యాంకులు.. ఇటు దేశీయంగాను, అటు అంతర్జాతీయంగాను మరింతగా పోటీపడగలవని, వ్యయాలు తగ్గించుకోగలవని ఆమె పేర్కొన్నారు. విలీనంతో ప్రభుత్వ రంగంలో ఏడు భారీ బ్యాంకులు, అయిదు చిన్న స్థాయి బ్యాంకులు మిగలనున్నాయి. కన్సాలిడేషన్ ప్రణాళిక ప్రకారం ఆంధ్రా బ్యాంకు.. కార్పొరేషన్ బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయనున్నారు. అలాగే, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ .. యునైటెడ్ బ్యాంక్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంకులో, సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో, అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులో కలపనున్నారు. -
ఆర్ఈసీలో వాటా విక్రయానికి ఓకే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో మరిన్ని సంస్థల విలీనాలకు తెరతీస్తూ ఆర్ఈసీలో వాటాల విక్రయ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకా రం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)కు మొత్తం 52.63% వాటాలను విక్రయించనుంది. గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఈ డీల్ ద్వారా ఖజానాకు సుమారు రూ.15,000 కోట్లు దఖలు పడనున్నాయి. వాస్తవానికి ఆర్‌ఈసీకే పీఎఫ్‌సీలో వాటాలను విక్రయించాలని ముందుగా భావించినప్పటికీ... విద్యుత్ శాఖ జోక్యంతో ప్రతిపాదన మారింది. సెప్టెంబర్ ఆఖరు నాటికి కేంద్రానికి ఆర్ఈసీలో 57.99 శాతం, పీఎఫ్‌సీలో 65.64 శాతం వాటాలు ఉన్నాయి. అయితే, ఈటీఎఫ్ ద్వారా కొన్ని వాటాలను విక్రయించడంతో ఆర్ఈసీలో కేంద్రం హోల్డింగ్ 52.63 శాతానికి తగ్గింది. మరోవైపు, 2022 నాటికి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను రెట్టింపు స్థాయిలో 60 బిలియన్ డాలర్లకు పెంచుకునే లక్ష్యంలో భాగంగా కొత్త వ్యవసాయ ఎగుమతి విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. టీ, కాఫీ, బియ్యం వంటి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను పెంచుకోవడానికి, అంతర్జాతీయ అగ్రి–ట్రేడ్‌లో మరింత వాటా దక్కించుకునేందుకు ఇది దోహదపడగలదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. మౌలిక సదుపాయాల ఆధునీకరణ, ఉత్పత్తులకు ప్రమాణాలు నెలకొల్పడం, నిబంధనలను క్రమబద్ధీకరించడం, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి సారించడం వంటి అంశాలకు ఈ విధానం కింద ప్రాధాన్యం లభించనున్నట్లు ఆయన వివరించారు. -
జస్టిస్ జోసెఫ్ పదోన్నతికి గ్రీన్‌సిగ్నల్!
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలన్న కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఎట్టకేలకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. జస్టిస్ జోసెఫ్‌తో పాటు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వినీత్ శరణ్‌ల పదోన్నతికి ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది. ఈ నియామకాలకు సంబంధించిన దస్త్రాలకు ఆమోదం లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 25కు పెరగనుంది. అయినా మరో 6 పోస్టులు ఖాళీగా ఉంటాయి. జస్టిస్ జోసెఫ్‌కు సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించాలని సుప్రీం సీజేఐ నేతృత్వంలోని కొలీజియం జనవరి 10న కేంద్రానికి సిఫార్సుచేసింది. కేరళ నుంచి సుప్రీంలో ఇది వరకే తగిన ప్రాతినిధ్య ఉందని పేర్కొంటూ ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కేంద్రం వెనక్కి పంపింది. ఆయన పేరును సుప్రీం జడ్జి పదవికి పరిశీలించాలని మే 10న కొలీజియం మరోసారి కేంద్రానికి సూచించగా, తాజాగా ఆమోదం లభించింది. మరోవైపు, జస్టిస్ జోసెఫ్‌కు ఉత్తరాఖండ్ హైకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించింది. -
తెలంగాణలో రెండు ఐటీ సెజ్‌లకు ఆమోదం
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో రెండు ఐటీ సెజ్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణలో ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలం(సెజ్)ల ఏర్పాటు కోసం వేల్యూ ల్యాబ్స్ ఇన్ఫ్రా ఎల్ఎల్పీ, జీఏఆర్ కార్పొరేషన్ సంస్థల ప్రతిపాదనలకు సెజ్ వ్యవహారాలను చూసే బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ పచ్చజెండా ఊపింది. దీంతో పాటు 13 మంది సెజ్ డెవలపర్లకు వారి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మరింత సమయం ఇచ్చింది. రిలయన్స్ ముకేశ్ అంబానీకి చెందిన నవీ ముంబై సెజ్‌తో సహా మొత్తం 13 ప్రత్యేక ఆర్థిక మండలాలు(సెజ్)లకు కేంద్రం ఈ వెసులుబాటును ఇచ్చింది. ఇటీవల జరిగిన వాణిజ్య కార్యదర్శి రీటా తియోతియా అధ్యక్షతన గల ఆమోదాల బోర్డ్(బోర్డ్ ఆఫ్ అప్రూవల్-బీఓఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 19 మంది సభ్యులు గల బీఓఏ సెజ్ సంబంధిత విషయాలను చూస్తుంది. ఉల్వే(నవీ ముంబై)లో ఏర్పాటు చేయనున్న ఐటీ/ఐటీఈఎస్ సెజ్‌కు మరింత గడువు కావాలని నవీ ముంబై సెజ్ కోరింది. గత ఏడాది అక్టోబర్ 24 వరకూ ఉన్న ఈ సెజ్ గడువును ఈ ఏడాది అక్టోబర్ 24 వరకూ బీఓఏ పొడిగించింది. గుర్గావ్లో జి.పి. రియల్టర్స్ ఏర్పాటు చేయనున్న ఐటీ/ఐటీఈఎస్ సెజ్‌కు కూడా ఏడాది పొడిగింపు లభించింది.