తెలంగాణలో రెండు ఐటీ సెజ్‌లకు ఆమోదం
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో రెండు ఐటీ సెజ్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణలో ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలం(సెజ్)ల ఏర్పాటు కోసం వేల్యూ ల్యాబ్స్ ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ, జీఏఆర్ కార్పొరేషన్ సంస్థల ప్రతిపాదనలకు సెజ్ వ్యవహారాలను చూసే బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ పచ్చజెండా ఊపింది. దీంతో పాటు 13 మంది సెజ్ డెవలపర్లకు వారి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మరింత సమయం ఇచ్చింది.
రిలయన్స్ ముకేశ్ అంబానీకి చెందిన నవీ ముంబై సెజ్‌తో సహా మొత్తం 13 ప్రత్యేక ఆర్థిక మండలాలు(సెజ్)లకు కేంద్రం ఈ వెసులుబాటును ఇచ్చింది. ఇటీవల జరిగిన వాణిజ్య కార్యదర్శి రీటా తియోతియా అధ్యక్షతన గల ఆమోదాల బోర్డ్(బోర్డ్ ఆఫ్ అప్రూవల్-బీఓఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 19 మంది సభ్యులు గల బీఓఏ సెజ్ సంబంధిత విషయాలను చూస్తుంది.
ఉల్వే(నవీ ముంబై)లో ఏర్పాటు చేయనున్న ఐటీ/ఐటీఈఎస్ సెజ్‌కు మరింత గడువు కావాలని నవీ ముంబై సెజ్ కోరింది. గత ఏడాది అక్టోబర్ 24 వరకూ ఉన్న ఈ సెజ్ గడువును ఈ ఏడాది అక్టోబర్ 24 వరకూ బీఓఏ పొడిగించింది. గుర్గావ్‌లో జి.పి. రియల్టర్స్ ఏర్పాటు చేయనున్న ఐటీ/ఐటీఈఎస్ సెజ్‌కు కూడా ఏడాది పొడిగింపు లభించింది.