IT sez
-
విశాఖ ఐటీ సెజ్‌లో తొలి ఇండియన్ ప్రాసెసర్‌తో కంప్యూటర్ తయారీ
సాక్షి, విశాఖపట్నం : పాఠ్యాంశాల్లో సందేహాల నివృత్తికి నెట్ సౌకర్యం ఉన్న కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ఎంతో ముఖ్యం. కానీ, వీటిల్లో అశ్లీలతకు ఆస్కారం ఎక్కువ. దీనికి పరిష్కారంగా.. భవిష్యత్‌లో ఎదురయ్యే డిజిటల్ సవాళ్లని ఎదుర్కొనేందుకు విశాఖపట్నం ఐటీ సెజ్ వేదికగా.. మొట్టమొదటి ఇండియన్ లాంగ్వేజ్ కంప్యూటర్ ఆవిష్కృతమైంది. తొలి భారతీయ ప్రాసెసర్‌తో డిజిటల్ స్కూల్ బ్యాగ్ (డీఎస్బీ) పేరుతో రూపొందించిన సిద్ధి డీసీబీ పీఆర్4ఏ కంప్యూటర్లోని కంటెంట్‌ని 18 భారతీయ భాషల్లోకి అనువదించే సౌలభ్యం ఉంటుంది. త్వరలోనే ఇది మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతమున్న కంప్యూటర్లకు భిన్నంగా కేవలం చదువు కోసం మాత్రమే వినియోగించుకునేలా సరికొత్త డివైజ్‌ని విశాఖకు చెందిన స్టార్టప్ సంస్థ డ్రీమ్‌చిప్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించింది. ఇది కేవలం భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్న మొట్టమొదటి డిజిటల్ స్కూల్ బ్యాగ్ కంప్యూటర్‌గా చరిత్ర సృష్టించనుంది. అక్షరమాల నుంచి అన్ని రకాల అంశాలనూ ఇందులో చదువుకునేలా తీర్చిదిద్దారు. నూతన విద్యావిధానాలకు అనుగుణంగా.. పిల్లల బరువులో 10 శాతం మాత్రమే స్కూల్ బ్యాగ్ ఉండాలన్న నిబంధనల మేరకు కేవలం 1.5 కిలోల బరువుతోనే ఈ డిజిటల్ స్కూల్ బ్యాగ్ కంప్యూటర్ని తయారుచేశారు. ఏళ్ల తరబడి ప్రయోగాల తర్వాత.. అనేక ప్రయోగాల తర్వాత డ్రీమ్‌చిప్ డెవలపర్ కంపెనీ ప్రతినిధులు గోపీకుమార్ బులుసు, మురళీమనోహర్, వెంకటేశ్వరరావు చివరికి విజయం సాధించారు. ఎలాంటి అశ్లీలత కంటెంట్‌కు తావులేకుండా కేవలం చదువుకు సంబంధించిన పాఠాలు మాత్రమే ఇందులో ఉండేలా ఈ కంప్యూటర్ని అభివృద్ధి చేశారు. ఇది ఆఫ్‌లైన్ మోడ్‌లో పనిచేస్తుంది. బ్లూటూత్, వైఫై సౌకర్యం కూడా ఉంది. దేశంలోనే తొలి సొంత ప్రాసెసర్ వినియోగించిన కంప్యూటర్ ఇది. సొంత ఆపరేటింగ్ సిస్టమ్, కోడ్ లాంగ్వేజ్, ఫీచర్ల పరంగా.. ఇది ప్రస్తుతం ఉన్న ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మొత్తం ఐదువేల పేజీల్ని ఇందులో నిక్షిప్తం చేసుకునేలా అభివృద్ధి చేశారు. పైగా దీని ధర కూడా తక్కువే. కేవలం రూ.4 వేలకు ఈ కంప్యూటర్ని విక్రయించాలని డ్రీమ్‌చిప్ నిర్ణయించింది. ఏటా 50 లక్షల యూనిట్లు తయారీ భారతీయ భాషల్లో కంప్యూటర్ను తయారుచేసి.. విద్యార్థులకు కేవలం విద్యను మాత్రమే అందించాలన్న సంకల్పంతో రూపొందించాం. మేకిన్ ఇండియా స్ఫూర్తితో దీన్ని పూర్తిగా వైజాగ్‌లోనే తయారుచేశాం. ఇందులో 100 మల్టీ సబ్జెక్ట్స్ పాఠాలతో భారత బాలశిక్ష కూడా లోడ్ చేశాం. ఈ కంప్యూటర్లను పెద్దఎత్తున తయారుచేసేందుకు ప్రభుత్వం లేదా ఏదైనా విద్యా సంబంధిత ట్రస్ట్‌తో కలిసి ఏటా 50 లక్షల యూనిట్లు తయారుచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నూతన విద్యా విధానాలను స్ఫూర్తిగా తీసుకున్నాం. – గోపీకుమార్ బులుసు, డ్రీమ్ చిప్ చీఫ్ టెక్నాలజిస్ట్ డ్రీమ్‌చిప్ కంప్యూటర్ ప్రత్యేకతలివే.. ఇది తెలుగు భాషతో ప్రారంభమయ్యే కంప్యూటర్. ఇతర రాష్ట్రాల విద్యార్థులు తమ భాషలోనే మొదలు పెట్టేలా సెట్టింగ్స్‌ని మార్చుకోవచ్చు. ఒక పాఠాన్ని తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లోనూ చదువుకునే వెసులుబాటు ఇందులో ఉంది. కేవలం కంప్యూటర్‌లా మాత్రమే కాకుండా.. దీన్ని డిజిటల్ స్కూల్ బ్యాగ్‌గా కూడా వినియోగించుకోవచ్చు. దీనికి ఒకవైపు స్క్రీన్, మరోవైపు టెక్ట్ సబుక్ లేదా నోట్‌బుక్ షెల్ఫ్, రైటింగ్ ప్యాడ్ ఉంటుంది. స్క్రీన్ కింద భాగంలో పెన్నులు, పెన్సిళ్లు పెట్టుకునే అర కూడా ఉంది. స్క్రీన్ పైభాగంలో రాత్రిపూట చదువుకునేందుకు వీలుగా ఎల్ఈడీ టేబుల్ ల్యాంప్నూ అమర్చారు. -
మరోసారి అడ్డంగా దొరికిన ‘ఈనాడు’
Yellow media has once again fake news spread On AP CM: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ఉన్న అక్కసును టీడీపీ అనుకూల మీడియా మరోసారి చాటుకుంది. టీడీపీ హయాంలో తప్పుగా కానరాని నిర్ణయాలు ఇప్పుడు చట్ట ప్రకారం నడుచుకుంటున్నా ఏదో ఘోరం జరిగిపోయినట్లుగా గుండెలు బాదుకోవడం ఓ వర్గం మీడియాకు ఆనవాయితీగా మారిపోయింది. గురువారం ఈనాడు దినపత్రిక ప్రచురించిన ‘ఐటీ సెజ్ భూములను కట్టబెట్టేశారు’’ కథనమే దీనికి నిదర్శనం. 2016లో వైఎస్ఆర్ కడప జిల్లాలోని సీపీ బ్రౌన్ ఐటీ సెజ్ హోదా రద్దు కాకుండా భూముల కోసం అడ్వాన్సు తీసుకున్నప్పుడు తప్పుగా కనిపించని నిర్ణయం.. ఇప్పుడు సెజ్ హోదా రద్దైన తర్వాత కేటాయిస్తే సెజ్ భూములను కట్టబెట్టేశారంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఏపీఐఐసీ ఆధారాలతో దీన్ని ఖండించింది. ఏం జరిగిందంటే.. కడపలో ఐటీ సెజ్ అభివృద్ధి చేసేందుకు 2007లో ఏపీఐఐసీ 52.76 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఐటీ కార్యాలయాలను నెలకొల్పేందుకు కె.రహేజా కార్పొరేషన్‌కు 2008 సెప్టెంబర్ 29న ఐదెకరాల భూమిని 30 ఏళ్లు లీజు విధానంలో కేటాయించింది. అయితే అనంతరం రహేజా కంపెనీ తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. దీంతో అప్పటి నుంచి ఏపీఐఐసీ వెబ్సైట్లో అది ఖాళీ స్థలంగానే ఉంది. ఈ క్రమంలో ఒక్క ఐటీ కంపెనీ కూడా ముందుకు రాకపోవడంతో ఐటీ సెజ్ హోదా రద్దు చేయాలని 2013 నవంబర్ 5న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరారు. ఐటీ సెజ్ డీ–నోటిఫికేషన్ ప్రాథమిక అనుమతులను 2015 జూలై 8న టీడీపీ హయాంలోనే కేంద్రం జారీ చేసింది. ఐటీ కంపెనీలు రానందున ఇదే విధంగా విశాఖపట్నంలోని మధురవాడ, గంభీరం తదితర చోట్ల ఐటీ సెజ్‌లను డీ–నోటిఫికేషన్ చేశారు. 2016లోనే అడ్వాన్స్ చెల్లించిన షిర్డీసాయి షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కడపలో రూ.246.5 కోట్ల పెట్టుబడితో 400 మందికి ఉపాధి కల్పించేలా ట్రాన్స్ఫార్మర్ల తయారీ యూనిట్‌కు 2016లో దరఖాస్తు చేసుకుంది. ఐటీ పారిశ్రామిక వాడలో భూమి కేటాయించాలని రూ.2.85 కోట్లు అడ్వాన్స్‌గా డీడీ రూపంలో ఏపీఐఐసీకి 2016 అక్టోబర్ 16న చెల్లించింది. ఆ భూమి కోసం ఇతర కంపెనీల నుంచి దరఖాస్తులు రాకపోవడంతో నిబంధనల ప్రకారం ఏపీఐఐసీ వేలం వేయకుండా కేటాయించింది. అయితే అప్పటి నుంచి 2020 వరకు కేంద్రం నుంచి డీనోటిఫికేషన్ గెజిట్ రాకపోవడంతో షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ పనులను ప్రారంభించలేదు. ఇప్పుడు డీ–నోటిఫికేషన్ గెజిట్ రావడంతో ఏపీఎస్పీడీసీఎల్ అవసరాల కోసం కొంత భూమిని వదిలి మిగతాది షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు కేటాయించినట్లు ఏపీఐఐసీ పేర్కొంది. ఉపాధి నిమిత్తం పరిశ్రమలకు కేటాయించే భూములను మార్కెట్ ధర, గృహ సముదాయాల లే అవుట్ల ధరలతో పోల్చి చూడటం సరికాదని ఏపీఐఐసీ స్పష్టం చేసింది. -
ఇది ప్రారంభం మాత్రమే: కేటీఆర్
సాక్షి, వరంగల్: మడికొండ ఐటీ సెజ్‌లో నిర్మించిన టెక్ మహీంద్ర, సైయంట్ ఐటీ సెంటర్లను పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రారంభం మాత్రమేనన్నారు. తెలంగాణలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తున్నామని తెలిపారు. వరంగల్-హైదరాబాద్ హైవేను పారిశ్రామిక కారిడార్‌గా మార్చివేస్తామన్నారు. మంత్రి ఈటల రాజేందర్ చెప్పినట్లుగా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి వరంగల్, కరీంనగర్‌తో పాటు నల్గొండ, నిజామాబాద్, ఖమ్మంలో కూడా కంపెనీలను ఈ ఏడాదిలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అడిగిన వెంటనే తెలంగాణలో కంపెనీలు నెలకొల్పిన టెక్ మహీంద్రా సీఈఓ గుర్నాని, సైయంట్ ఎండీ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు నినాదమే తెలంగాణ ఆవిర్భావం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమానికి పెట్టాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పటికీ నిరుద్యోగ యువత సంఖ్య ఎక్కువగా ఉంది. 12-13 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణ ఇస్తున్నాం. రానున్న రోజుల్లో లైఫ్ సైన్స్ పరిశ్రమలు కూడా వస్తాయి. తెలంగాణలోని గ్రామీణ యువతకు మంచి స్కిల్‌తో విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. పరిశ్రమల్లో సింహభాగం మన తెలంగాణ యువతకే వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని కేటీఆర్ తెలిపారు. మిల్లు స్థానంలో మెగా టెక్స్టైల్ పార్క్ ‘యాదాద్రి, జనగామ, స్టేషన్ ఘన్పూర్, పరకాల లాంటి చిన్న ప్రాంతాల్లోనూ చేనేత పరిశ్రమలను నిర్మిస్తాం. వరంగల్‌లో అజంజాహి మిల్లు స్థానంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తున్నాం. మహబూబాబాద్‌లో ఆహార శుద్ధి పరిశ్రమ సెంటర్, ఖమ్మం, కరీంనగర్లో ఐటీ హబ్‌ను ప్రారంభిస్తాం. టెక్ మహీంద్రా సీఈఓ గుర్నాని సలహా మేరకు మామూనూర్ ఎయిర్‌పోర్టు పునరుద్దరణతో పాటు హెలిపాడ్ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్రా సీపీ గుర్నా, సైయంట్ ఎండీ మోహన్ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని కంపెనీలు రావాలి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషితో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఐటి మంత్రి కేటీఆర్ చొరవతో వరంగల్‌కు టెక్ మహీంద్రా, సైయంట్ వంటి రెండు పెద్ద కంపెనీలు రావడం ఆనందంగా ఉందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే మరిన్ని పరిశ్రమలు, కంపెనీలు రావాలని కోరుతున్నామన్నారు. గ్రామీణ యువత కోసం ప్రణాళికలు రూపొందించాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు పరిశ్రమలు అనగానే ఒక్క హైదరాబాద్ కు మాత్రమే పరిమితమయ్యేవి. ఇప్పుడు కేటీఆర్ చొరవతో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలు రావడం గొప్ప విషయం. ఇవి గ్రామీణ యువతకు ఉపయోగపడేలా కృషి చేయాలి. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్లో చదువుకున్న గ్రామీణ యువత సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ యువత కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఐటీ మంత్రి కేటీఆర్‌ను ఈటల కోరారు. చదవండి: స్టార్టప్‌ల రాష్ట్రంగా తెలంగాణ -
మడికొండ ఐటీ సెజ్‌లో మహీంద్రా కేంద్రాల ప్రారంభం
సాక్షి, మడికొండ(వరంగల్): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత అంతే వేగంగా అభివృద్ధి సాధిస్తున్న నగరంగా వరంగల్‌కు పేరు ఉంది. అయితే, కొన్నేళ్ల క్రితం నుంచి అభివృద్ధి పరుగులు తీస్తున్నా బహుళ జాతి కంపెనీలు వరంగల్‌లోకి అడుగు పెట్టడం లేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను పరిచయం చేయాలన్న భావనతో కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు తొలిసారి జిల్లాలోని మడికొండలో ఉన్న పారిశ్రామిక వాడలో ఐటీ సెజ్ ఏర్పాటుచేయగా.. టీఎస్ఐఐసీ ఆధ్వర్యాన ఇంక్యుబేషన్ సెంటర్ మొదలైంది. అక్కడ తొలుత 2016లో సైయంట్ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించగా..ఆ కంపెనీ అయిదు ఎకరాల్లో కొత్త సెంటర్ ఏర్పాటుచేసింది. దీనికి తోడు టెక్ మహీంద్రా కూడా తన సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. ఈ రెండు కేంద్రాలను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రాంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబర్‌లోనే ప్రారంభించాల్సి ఉన్నా... మడికొండ ఐటీ సెజ్‌లో నిర్మించిన టెక్ మహేంద్ర, సైయంట్ ఐటీ సెంటర్లను మంగళవారం మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ప్రారంభించనున్నారు. సైయంట్ సంస్థ కార్యాలయాన్ని ఆక్టోబర్‌లోనే ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. అప్పట్లో అనివార్య కారణాలతో ప్రారంభోత్స వం వాయిదా పడింది. ఇంతలోనే టెక్ మహీంద్ర సంస్థ సైతం తన కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం రెండు కేంద్రాలను కేటీఆర్ ప్రారంభి స్తారు. సైయింట్ ఐదు ఎకరాల స్థలంలో సుమారు రూ.25కోట్లతో సెంటర్ నిర్మించింది. ఇందులో ప్రస్తుతం 120 మందితో కార్యకలాపాలు సాగుతుండగా.. ఆరు బ్లాక్‌ల్లో 800 వరకు పని చేయడానికి అనుకూలంగా ఉందని కంపెనీ సీనియర్ మేనేజర్ కే.తిరుపతిరెడ్డి తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, చీఫ్ విప్ సైయంట్, టెక్ మహీంద్ర సంస్థల కార్యాలయాలను మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించనున్న క్యాబిన్లు, సమావేశ హాల్లు పరిశీలించిన అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కూడా ప్రాంగణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ వెంకారెడ్డి, తహసీల్దార్ నాగేశ్వర్రావు, కార్పొరేటర్ జోరిక రమేష్, నాయకులు దువ్వ కనుకరాజ్, పల్లపు నర్సింగరావు, రాజేందర్, వినోద్ పాల్గొన్నారు. ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం.. హన్మకొండ: ఐటీ హబ్‌గా వరంగల్‌ను తీర్చిదిద్దనున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. హన్మకొండ బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో కలిసి మాట్లాడారు. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్‌పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే ఇక్కడి విద్యార్థులు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించిన ప్రభుత్వం సైయంట్, టెక్ మహీంద్రా కంపెనీల సెంటర్లు ఏర్పాటుచేసేలా కృషి చేసిందని తెలిపారు. ఈ కంపెనీలను కేంద్రాలను మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. ఉదయం 11.30 గంటలకు జరిగే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటెల రాజేందర్, సత్యవతి రాథోడ్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్లు బోయినిపల్లి రంజిత్‌రావు, వేము ల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు సంగంరెడ్డి సుందర్రాజు, మాడిశెట్టి శివశంకర్, బొర్ర అయిలయ్య, నయీముద్దీన్ పాల్గొన్నారు. -
షాపూర్జీ–అలియాంజ్ చేతికి వేవ్‌రాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగర రియల్టీ రంగంలో అతిపెద్ద డీల్ నమోదైంది. నానక్‌రామ్‌గూడలోని ఐటీ సెజ్ వేవ్రాక్ను టిష్మన్ స్పేయర్, జీఐసీల నుంచి షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ ఫండ్ (ఎస్పీఆర్ఈఎఫ్ 2) కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు రూ.1,800 కోట్లు. 12 ఎకరాల్లో 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేవ్‌రాక్ విస్తరించింది. ఆపిల్, డీబీఎస్, డ్యూపాంట్, యాక్సెంచర్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ కొలువుదీరాయి. అలియాంజ్, షాపూర్జీ పల్లోంజీల జేవీయే ఎస్పీఆర్ఈఎఫ్–2. విక్రేతల తరఫున జేఎల్ఎల్ మధ్యవర్తిగా వ్యవహరించింది. -
తెలంగాణలో రెండు ఐటీ సెజ్‌లకు ఆమోదం
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో రెండు ఐటీ సెజ్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణలో ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలం(సెజ్)ల ఏర్పాటు కోసం వేల్యూ ల్యాబ్స్ ఇన్ఫ్రా ఎల్ఎల్పీ, జీఏఆర్ కార్పొరేషన్ సంస్థల ప్రతిపాదనలకు సెజ్ వ్యవహారాలను చూసే బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ పచ్చజెండా ఊపింది. దీంతో పాటు 13 మంది సెజ్ డెవలపర్లకు వారి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మరింత సమయం ఇచ్చింది. రిలయన్స్ ముకేశ్ అంబానీకి చెందిన నవీ ముంబై సెజ్‌తో సహా మొత్తం 13 ప్రత్యేక ఆర్థిక మండలాలు(సెజ్)లకు కేంద్రం ఈ వెసులుబాటును ఇచ్చింది. ఇటీవల జరిగిన వాణిజ్య కార్యదర్శి రీటా తియోతియా అధ్యక్షతన గల ఆమోదాల బోర్డ్(బోర్డ్ ఆఫ్ అప్రూవల్-బీఓఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 19 మంది సభ్యులు గల బీఓఏ సెజ్ సంబంధిత విషయాలను చూస్తుంది. ఉల్వే(నవీ ముంబై)లో ఏర్పాటు చేయనున్న ఐటీ/ఐటీఈఎస్ సెజ్‌కు మరింత గడువు కావాలని నవీ ముంబై సెజ్ కోరింది. గత ఏడాది అక్టోబర్ 24 వరకూ ఉన్న ఈ సెజ్ గడువును ఈ ఏడాది అక్టోబర్ 24 వరకూ బీఓఏ పొడిగించింది. గుర్గావ్లో జి.పి. రియల్టర్స్ ఏర్పాటు చేయనున్న ఐటీ/ఐటీఈఎస్ సెజ్‌కు కూడా ఏడాది పొడిగింపు లభించింది. -
హైదరాబాద్‌లో సింగపూర్ ఐటీ సెజ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఐటీ సెజ్ ఏర్పాటు కానుంది. సింగపూర్‌కు చెందిన ప్రైవేటు కంపెనీ హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఐటీ, ఐటీ ఆధారిత సెజ్‌ను ఏర్పాటుచేసేందుకు ఆసక్తి చూపుతోంది. సుమారు 160 ఎకరాల్లో ఈ సెజ్ ఏర్పాటు కానున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సింగపూర్, మలేిసియా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అయితే, కంపెనీ పేరు, పెట్టుబడి వివరాలు తెలియరాలేదు.