సాక్షి, విశాఖపట్నం : పాఠ్యాంశాల్లో సందేహాల నివృత్తికి నెట్ సౌకర్యం ఉన్న కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ఎంతో ముఖ్యం. కానీ, వీటిల్లో అశ్లీలతకు ఆస్కారం ఎక్కువ. దీనికి పరిష్కారంగా.. భవిష్యత్‌లో ఎదురయ్యే డిజిటల్ సవాళ్లని ఎదుర్కొనేందుకు విశాఖపట్నం ఐటీ సెజ్ వేదికగా.. మొట్టమొదటి ఇండియన్ లాంగ్వేజ్ కంప్యూటర్ ఆవిష్కృతమైంది. తొలి భారతీయ ప్రాసెసర్‌తో డిజిటల్ స్కూల్ బ్యాగ్ (డీఎస్‌బీ) పేరుతో రూపొందించిన సిద్ధి డీసీబీ పీఆర్4ఏ కంప్యూటర్‌లోని కంటెంట్‌ని 18 భారతీయ భాషల్లోకి అనువదించే సౌలభ్యం ఉంటుంది. త్వరలోనే ఇది మార్కెట్‌లోకి రానుంది.
ప్రస్తుతమున్న కంప్యూటర్లకు భిన్నంగా కేవలం చదువు కోసం మాత్రమే వినియోగించుకునేలా సరికొత్త డివైజ్‌ని విశాఖకు చెందిన స్టార్టప్ సంస్థ డ్రీమ్‌చిప్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించింది. ఇది కేవలం భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్న మొట్టమొదటి డిజిటల్ స్కూల్ బ్యాగ్ కంప్యూటర్‌గా చరిత్ర సృష్టించనుంది. అక్షరమాల నుంచి అన్ని రకాల అంశాలనూ ఇందులో చదువుకునేలా తీర్చిదిద్దారు. నూతన విద్యావిధానాలకు అనుగుణంగా.. పిల్లల బరువులో 10 శాతం మాత్రమే స్కూల్ బ్యాగ్ ఉండాలన్న నిబంధనల మేరకు కేవలం 1.5 కిలోల బరువుతోనే ఈ డిజిటల్ స్కూల్ బ్యాగ్ కంప్యూటర్‌ని తయారుచేశారు.
ఏళ్ల తరబడి ప్రయోగాల తర్వాత..
అనేక ప్రయోగాల తర్వాత డ్రీమ్‌చిప్ డెవలపర్ కంపెనీ ప్రతినిధులు గోపీకుమార్ బులుసు, మురళీమనోహర్, వెంకటేశ్వరరావు చివరికి విజయం సాధించారు. ఎలాంటి అశ్లీలత కంటెంట్‌కు తావులేకుండా కేవలం చదువుకు సంబంధించిన పాఠాలు మాత్రమే ఇందులో ఉండేలా ఈ కంప్యూటర్‌ని అభివృద్ధి చేశారు. ఇది ఆఫ్‌లైన్ మోడ్‌లో పనిచేస్తుంది. బ్లూటూత్, వైఫై సౌకర్యం కూడా ఉంది. దేశంలోనే తొలి సొంత ప్రాసెసర్ వినియోగించిన కంప్యూటర్ ఇది. సొంత ఆపరేటింగ్ సిస్టమ్, కోడ్ లాంగ్వేజ్, ఫీచర్ల పరంగా.. ఇది ప్రస్తుతం ఉన్న ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మొత్తం ఐదువేల పేజీల్ని ఇందులో నిక్షిప్తం చేసుకునేలా అభివృద్ధి చేశారు. పైగా దీని ధర కూడా తక్కువే. కేవలం రూ.4 వేలకు ఈ కంప్యూటర్‌ని విక్రయించాలని డ్రీమ్‌చిప్ నిర్ణయించింది.
ఏటా 50 లక్షల యూనిట్లు తయారీ
భారతీయ భాషల్లో కంప్యూటర్‌ను తయారుచేసి.. విద్యార్థులకు కేవలం విద్యను మాత్రమే అందించాలన్న సంకల్పంతో రూపొందించాం. మేకిన్ ఇండియా స్ఫూర్తితో దీన్ని పూర్తిగా వైజాగ్‌లోనే తయారుచేశాం. ఇందులో 100 మల్టీ సబ్జెక్ట్స్ పాఠాలతో భారత బాలశిక్ష కూడా లోడ్ చేశాం. ఈ కంప్యూటర్లను పెద్దఎత్తున తయారుచేసేందుకు ప్రభుత్వం లేదా ఏదైనా విద్యా సంబంధిత ట్రస్ట్‌తో కలిసి ఏటా 50 లక్షల యూనిట్లు తయారుచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నూతన విద్యా విధానాలను స్ఫూర్తిగా తీసుకున్నాం.
– గోపీకుమార్ బులుసు, డ్రీమ్ చిప్ చీఫ్ టెక్నాలజిస్ట్
డ్రీమ్‌చిప్ కంప్యూటర్ ప్రత్యేకతలివే..
- ఇది తెలుగు భాషతో ప్రారంభమయ్యే కంప్యూటర్.
- ఇతర రాష్ట్రాల విద్యార్థులు తమ భాషలోనే మొదలు పెట్టేలా సెట్టింగ్స్‌ని మార్చుకోవచ్చు.
- ఒక పాఠాన్ని తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లోనూ చదువుకునే వెసులుబాటు ఇందులో ఉంది.
- కేవలం కంప్యూటర్‌లా మాత్రమే కాకుండా.. దీన్ని డిజిటల్ స్కూల్ బ్యాగ్‌గా కూడా వినియోగించుకోవచ్చు.
- దీనికి ఒకవైపు స్క్రీన్, మరోవైపు టెక్ట్ సబుక్ లేదా నోట్‌బుక్ షెల్ఫ్, రైటింగ్ ప్యాడ్ ఉంటుంది.
- స్క్రీన్ కింద భాగంలో పెన్నులు, పెన్సిళ్లు పెట్టుకునే అర కూడా ఉంది.
- స్క్రీన్ పైభాగంలో రాత్రిపూట చదువుకునేందుకు వీలుగా ఎల్‌ఈడీ టేబుల్ ల్యాంప్‌నూ అమర్చారు.
Comments
Please login to add a commentAdd a comment