Smart Device
-
స్మార్ట్ డివైసెస్ కంట్రోల్లో మనం చిక్కుకున్నామని.. తెలుసా!
ఇప్పుడన్నీ స్మార్ట్‌ఫోన్‌లోనే ఉన్నాయి.. ఇదివరకు ఫోన్.. కమ్యూనికేషన్ టూల్..! కానీ నేడు మనిషిని ఎంగేజ్ చేసే ఎంటర్టైన్మెంట్ వాల్.. అవసరమైనప్పుడు మాత్రమే కమ్యూనికేషన్.. ఎప్పుడూ ఎంటర్టైన్మెంటే!! మునుపు రోజువారీ ఒత్తిళ్ల నుంచి ఒక తెరపిగానే వినోదం ఉండేది..! ఇప్పుడు వినోదమే రోజువారీ ఒత్తిడిగా మారింది! ఇవన్నీ కూడా సోషల్ మీడియాలోని పలు ప్లాట్‌ఫామ్స్ మీద ప్లే అయిన జోక్సే.. స్మార్ట్‌ఫోన్‌కి మనం ఎంత అడిక్ట్ అయ్యామో చెబుతూ! వాటిని చూసి నవ్వుకుంటాం. కానీ అడిక్షన్ గురించి ఆలోచించం. ఎందుకంటే ఆ లిస్ట్‌లో మనం లేమని మన ధీమా! కానీ ఎవ్వరం ఈ అడిక్షన్కి అతీతులం కాదని ఒక్క క్షణం మనల్ని మనం తరచి చూసుకుంటే తెలిసిపోతుంది. ఈ కథనం చదవబోతున్న పాఠకులకు ఒక విజ్ఞప్తి.. ఒక్క అయిదు నిమిషాలు మీ స్మార్ట్‌ఫోన్‌ను మరచిపోండి.. నోటిఫికేషన్స్ టోన్ వినబడుతున్నా పట్టించుకోకుండా! వెల్కమ్ "బ్యాక్ టు దిస్ పేజ్.. " ఉండగలిగారా అయిదు నిమిషాలు.. స్మార్ట్‌ఫోన్‌ని పట్టించుకోకుండా! కాస్త కష్టమైంది కదా! ప్రపంచాన్నంతా ఇముడ్చుకుని మన అరచేతిలోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్స్, లాప్టాప్స్ ఎట్సెట్రా స్మార్ట్ డివైసెస్ మన జీవితాలను ఎంతలా కంట్రోల్ చేస్తున్నాయో కదా... జెన్ జెడ్‌కి తెలీదు కానీ మిలేనియల్స్‌కి గుర్తుండే ఉంటుంది.. ప్రైవేట్ టీవీ చానెల్స్ వచ్చిన కొత్తలో.. ఎవరైనా ఎవరింటికైనా వెళితే.. ‘రండి.. రండి..’ అంటూ పలకరించి ఆ అతిథికి గ్లాసుడు మంచినీళ్లిచ్చేంత తీరిక ఆ ఇంట్లో వాళ్లకు ఉండేది కాదు. అందరూ టీవీకి అతుక్కుపోయి కూర్చునేవారు. అంతేకాదు ప్రైవేట్ చానెళ్లలో ప్రసారమయ్యే సీరియళ్ల మోహంలో పడి.. ఇంట్లో ఇల్లాళ్లు తిండి కూడా పెట్టట్లేదు.. కమర్షియల్ బ్రేక్స్‌లోనే వంట అయినా.. తిండి అయినా అంటూ వాపోయిన కుటుంబ సభ్యులూ ఉన్నారు. ఇవీ పైన ఉదహరించిన తీరులో వారపత్రికల్లో కార్టూన్లుగా.. సినిమాల్లో హాస్య సన్నివేశాలుగా కనిపించిన దాఖలాలున్నాయి. దాన్ని మించిన వ్యసనమైంది ఈ స్మార్ట్ ఫోన్ అండ్ స్మార్ట్ డివైసెస్ వాడకం. నిరంతర వీక్షణ స్రవంతి.. ఇదివరకు లేవగానే చాలామంది భగవంతుడి ఫొటోనో.. లేకపోతే తమకిష్టమైన కుటుంబ సభ్యుల మొహమో.. లేదంటే తమ అరచేతులను తామే చూసుకునేవారు. ఇప్పుడు లేవగానే కళ్లు మూసుకునే పడక మీద ఫోన్ వెదుక్కునే పరిస్థితి. కళ్లు తెరవగానే కుడిచేయి దంతధావనం కోసం బ్రష్ పట్టుకోవడానికి సిద్ధమవదు. చూపుడు వేలు స్మార్ట్ ఫోన్ మీద స్క్రోల్ చేయడానికి సన్నద్ధమవుతుంది. ఇదివరకు న్యూస్ పేపర్ చదివితే కాని రోజు మొదలయ్యేది కాదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లోని వాట్సాప్ స్టేటస్‌ల నుంచి స్నాప్ చాట్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబుల్లోని అప్డేట్స్ చూస్తేగానీ డే స్టార్ట్ అవట్లేదు. చూశాక అక్కడితో ఆగదు.. ఆ వీక్షణ స్రవంతి నిర్విరామంగా.. రాత్రి పడుకునే వేళదాకా సాగుతూనే ఉంటుంది. అర్ధరాత్రి దాటినా.. ఇంకా ఫోన్ స్క్రీన్ వెలుగుతూనే ఉంటుంది. తెల్లవారి పనో.. ఆఫీస్ టాస్కో హఠాత్తుగా గుర్తొచ్చి.. బలవంతంగా నిద్రకు ఉపక్రమించాల్సిందే తప్ప ఫోన్లో వీక్షణలు చాలు అనిపించి మాత్రం కాదు. ‘డిన్నర్ రెడీ.. ’ అని అమ్మ పిలిస్తే ఎవరూ పట్టించుకోరు. అందరూ తమ సెల్‌ఫోన్ వాట్సాప్ చాట్స్‌లో నిమగ్నమై ఉంటారు. వాళ్ల వాలకం చూసి ‘డిన్నర్ రెడీ.. డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తే తినొచ్చు’ అని వాట్సాప్‌లోని వాళ్ల ఫ్యామిలీ గ్రూప్‌లో మెసేజ్ పెట్టగానే అందరూ చూసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేస్తారు. ఒక అబ్బాయి రోడ్ మీద ఫోన్లో యూట్యూబ్ చూసుకుంటూ వెళ్తుంటాడు. వెనుక నుంచి బైక్ మీద వచ్చిన ఇంకో కుర్రాడు అమాంతం అతని ఫోన్ తీసుకుని ఉడాయిస్తాడు. హాల్లో కుటుంబ సభ్యులంతా కూర్చుని ఉంటారు. కలసి కబుర్లు చెప్పుకోకుండా.. ఎవరికి వారే అందరూ వాళ్ల వాళ్ల ఫోన్స్‌లో నిమగ్నమై ఉంటారు. ఇంకొక ఇంట్లో.. భోజనాల వేళ.. అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని.. అందరికీ ప్లేట్స్‌లో సెల్ ఫోన్స్ సర్వ్ చేస్తుంటుంది. ఇంకో చోట.. డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా.. టేబుల్ మీదున్న బౌల్లో ఫోన్స్ పెడితే గానీ వాళ్ల కంచాల్లో అమ్మ భోజనం వడ్డించదు. ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. స్పీకర్ మాట్లాడుతుంటాడు. మిగిలినవాళ్లంతా ఫోన్స్‌లో జోక్స్ షేర్ చేసుకుంటూనో.. ఇన్‌స్టాలో రీల్స్ చూస్తూనో.. మీమ్స్ సెండ్ చేసుకుంటూనో.. చాట్ చదువుకుంటూనో.. యూట్యూబ్ షార్ట్స్ ఎంజాయ్ చేస్తూనో ఉంటారు! బ్రెడ్ అండ్ బటర్.. ‘ఒక్క అయిదు నిమిషాలు ఇన్‌స్టాలో రీల్స్ చూసి.. సీరియస్‌గా చదువుకుంటాను ఇక’.. ‘అబ్బ వర్క్‌తో తల వేడెక్కింది కాసేపు యూట్యూబ్ చూసి.. రిఫ్రెష్ అయితే మళ్లీ వర్క్‌లో పడొచ్చు’.. ‘పావు గంట నుంచి వాట్సాప్ చెక్ చేసుకోలేదు. ఒక్కసారి చెక్ చేసుకుని ఇంటి పనిలో పడిపోతా’ .. ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ ఊరించేవే! ఆ అయిదు నిమిషాలు.. రిఫ్రెష్మెంట్.. చెక్ చేసుకోవడానికి అంతే లేకుండా చేస్తాయి. చూస్తున్న కొద్దీ పుట్టుకొస్తుంటాయి అక్షయ పాత్ర మాదిరి. తలాతోకా లేని విషయాల నుంచి తలలు పగలకొట్టుకునే చర్చల దాకా యూజర్స్‌ని అందులో ఎంగేజ్ చేస్తాయి. వాటి తీరే అది. అవి బతుకున్నదే వాటి మీద. ఎలాగైనా.. ఎక్కడిదాకా వెళ్లయినా సరే యూజర్స్‌ని నిమగ్నం చేయాలి. అందుకే అస్ట్రాలజీ నుంచి అంతరిక్షం దాకా.. వంటింటి చిట్కాల నుంచి పాలెస్తినా, ఇజ్రాయేల్ దాకా, రైమ్స్ అండ్ రిడిల్స్ నుంచి రష్యా – ఉక్రెయిన్ యుద్ధం దాకా, కుల, మతాలు, కంట్రీ పాలిటిక్స్ నుంచి ఎన్ఆర్ఐ ఇంట్రెస్ట్‌ల దాకా.. కుట్లు, అల్లికలు, జడలు, మేకప్ నుంచి పారిస్ ఫ్యాషన్ దాకా.. లోకల్ స్ట్రీట్ సింగర్ నుంచి కొరియన్ పాప్ బాండ్స్ దాకా.. నెలల పిల్లల నుంచి సెంచరీకి దగ్గరగా ఉన్న వృద్ధుల దాకా.. డాన్స్, యాక్టింగ్, కామెడీ, సీరియస్, థియేటర్, సినిమా, ఫైన్ ఆర్ట్స్, స్పోర్ట్స్, మెన్, విమెన్, ఎల్జీబీటీక్యూ.. ఒక్కరేమిటీ.. ఒక్కటేమిటీ.. ఎన్నిటినో కలబెట్టడం.. ఎందరినో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మార్చి వీక్షకులను ఏమార్చడం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి బ్రెడ్ అండ్ బటర్..! 95% మంది తల్లిదండ్రులు తమ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కి అడిక్ట్ అయ్యారని ఆందోళన చెందుతున్నారు. 80 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు గేమింగ్ వ్యసనంగా మారిందని వాపోతున్నారు. 70 శాతం పేరెంట్సేమో తమ పిల్లలు అడల్ట్ కంటెంట్‌ను చూస్తున్నారని భయపడుతున్నారు. – ‘బాటు టెక్’ తాజా సర్వే. ఆ నెట్‌వర్క్‌లో.. మంచినీళ్ల వసతి ఉన్నా లేకపోయినా కూల్‌డ్రింక్ ఫెసిలిటీ లేని పల్లెలు ఎలా లేవో.. ఇంట్లో సరకులున్నా లేకపోయినా స్మార్ట్‌ఫోన్ లేని ఇల్లు లేదిప్పుడు. అంత ఎసెన్షియల్ కమొడిటీ అయిపోయింది అది. కమ్యూనికేషన్ నుంచి వాలెట్, నేవిగేటర్, న్యూస్ జర్నల్ వంటి అత్యవసరాలే కాక వినోదాన్ని పంచే సాధనంగా కూడా మారిపోయే! అలాంటప్పుడు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో చిక్కకుండా ఎలా ఉంటాడు మనిషి?! దైనందిన జీవితం నుంచి జ్ఞాన సముపార్జన వరకు అన్నీ.. అన్నిటికీ ఇంటర్నెట్.. దానితో అనుసంధానమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్సే సోర్స్ అయిపోయే! డిజిటల్ విప్లవం ప్రపంచాన్ని గ్రామం నుంచి ఇంకా సూక్ష్మంగా మార్చి అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో కూర్చింది. దానికి మనిషిని నిలువెత్తు బానిసను చేసింది. ఒక రోబోలా మార్చింది. దాంతో మనిషి ప్రాక్టికాలిటీలో కన్నా డిజిటల్ వరల్డ్‌లోనే ఎక్కువ గడుపుతున్నాడు. ప్రపంచంతో ఉన్న స్పర్శను కోల్పోయి.. డివైసెస్తో పెనవేసుకుపోతున్నాడు. ఒకరకంగా అవి మనిషికి అవిభక్త కవలలయ్యాయి. అవసరం కాదు వ్యసనం.. హఠాత్తుగా ఇంటర్నెట్ ట్రాఫిక్.. డిజిటల్ ట్రాఫిక్ జామ్ అయి ప్రపంచమంతా స్తంభించిపోయి.. డిజిటల్ డివైసెస్ అన్నీ స్క్రాప్‌గా మారిపోతే.. మనిషి పరిస్థితి ఏంటీ? మానసిక వైకల్యం వచ్చేస్తుందేమో! చూపుడు వేలిని గాల్లో స్క్రోల్ చేస్తూ నడుస్తాడేమో! చుట్టూ ఉన్న పరిసరాల పరిజ్ఞానం అప్పుడు మొదలవుతుందేమో! అతిశయోక్తేం కాదు.. ఆ స్థితీ ఎంతో దూరంలో లేదు అంటున్నారు మానసిక నిపుణులు. అంతేకదా.. దేన్నయినా అవసరాన్ని మించి వాడితే దేనిమీదైనా అవసరం కన్నా ఎక్కువ ఆధారపడితే.. అది వ్యసనమే అవుతుంది. ఇప్పుడు మనం ఆ దశలోనే ఉన్నాం. చంటి పిల్లలు కూడా స్మార్ట్‌ఫోన్ ముందుంటేనే ముద్ద మింగుతున్నారు. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి ఉండాలి. అయితే ఆ అప్డేట్ కాలాన్నే మరచిపోనివ్వవద్దు కదా! కానీ నేటి స్టేటస్ దీనికి భిన్నంగా ఉంది. డిజిటల్ డివైసెస్ ద్వారా డిజిటల్ వరల్డ్‌కి ఎంతలా కండిషన్డ్ అయ్యామంటే మనం చేసే ప్రతి చిన్న పనికీ అవతలి వాళ్ల లైకులు, షేర్లు, కామెంట్లతో ఆమోదం కోరుకోనేంతలా! ఇది మన పని మీద.. నైపుణ్యం మీద.. ఇందాక చెప్పుకున్నట్టు మానసిక ఆరోగ్యం మీదా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఆందోళనకు కారణమవుతోంది. డిప్రెషన్‌కి దారితీస్తోంది. చుట్టూ ఉన్న ప్రపచంతో డిస్కనెక్ట్ చేస్తోంది. ఫాస్టింగ్.. అదే ఉపవాసం..! ఏదైనా వ్యసనంగా మారితే ఏం చేస్తాం.. డీఅడిక్షన్కి ట్రై చేస్తాం. తిండి కూడా వ్యసనమైతే కంట్రోల్ చేయడానికి మొదట డైట్ ప్లాన్ తీసుకుంటాం. అందులో ఫాస్టింగ్ని ఇన్క్లూడ్ చేస్తాం. అలాగే ఈ డిజిటల్ అడిక్షన్ని పోగొట్టుకోవడానికీ ఉపవాసం ఉంది. అదే డిజిటల్ ఫాస్టింగ్ లేదా డిజిటల్ డిటాక్స్. స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్, లాప్టాప్స్ను పక్కనపెట్టి.. సోషల్‌మీడియా యాప్స్ నుంచి వారంలో ఒకరోజో.. పక్షానికి ఒకరోజో.. లేదా నెలలోనో ఇలా వీలును బట్టి బ్రేక్ తీసుకోవడమన్నమాట. ఇప్పుడు అదే ట్రెండ్.. ఇప్పుడున్న ప్రపంచానికి ఏ మంచినైనా అలవాటు చేయాలంటే దాన్ని ముందు ట్రెండ్‌గా వైరల్ చేయాలి. డిజిటల్ స్లేవరీలో అదీ ఒక భాగమే. సరే విషయానికి వస్తే.. ఇప్పుడు డిజిటల్ డీఅడిక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే అవసరానికి తప్ప మిగిలిన సమయాల్లో.. సందర్భాల్లో డిజిటల్ డివైసెస్‌ని దూరంగా ఉంచడం.. రియల్ వరల్డ్‌తో అంటే చుట్టూ ఉన్న మనుషులు.. పరిసరాలతో మమేకం అవడం.. ఇంటర్నెట్ హెల్ప్ తీసుకోకుండా.. స్వయంగా శోధించడం.. టెక్నికల్ సపోర్ట్‌తో కాకుండా సొంతంగా ప్రయత్నించడం.. సరికొత్త జీవన శైలిగా మారింది. ఇప్పుడు ఇదే వెల్నెస్ ట్రెండ్ అయింది. దీన్ని ప్రాక్టీస్ చేస్తోంది సెకండ్ యూత్ అనుకునేరు.. కాదు.. యువతే! ఒక పూటో.. ఒక రోజో భోజనం మానేయడానికి ఈ రోజుల్లో అంత విల్ పవర్ అక్కర్లేదు. కానీ డిజిటల్ వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ కావడానికి చాలా విల్ పవర్ అవసరం. అదంత ఈజీ కాదు. కాసేపు ఫోన్ కనిపించకపోతేనే ఊపిరి ఆగిపోతుందేమో అని గాభరాపడే ప్రాణాలు మనవి! అలాంటిది ఒక పూటో.. ఒక రోజో ఆ డివైసెస్‌కి దూరంగా.. ఇంటర్నెట్ నుంచి లాగౌట్ అవడమంటే నిజంగా సాహసమే! అందుకే మొదట్లో మాటి మాటికీ ఫోన్‌ని వెదుక్కోవాలనిపిస్తుంది. విసుగు, చిరాకు కలుగుతుంది. ఒంటరైపోయామనే భావన వెంటాడుతుంది. వీటన్నిటినీ అధిగమించి ఉపవాస దీక్షను విజయవంతం చేసుకోవడమంటే విల్ పవర్‌కి పరీక్ష పెట్టడమే! డిజిటల్ ఫాస్టింగ్ వల్ల ప్రయోజనాలు.. చేసే పని మీద ఏకాగ్రత కుదురుతుంది. పనిలో నాణ్యతా పెరుగుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఇచ్చే విస్తృతమైన సమాచారం ఎనలేని ఆనందాన్నే ఇస్తుండొచ్చు. కానీ అవసరం లేని అదనపు సమాచారమేదైనా మెదడుకు భారమే తప్ప పనికొచ్చే వ్యవహారంగా ఉండదు. పైగా లేనిపోని కన్ఫ్యూజన్లోకీ నెడుతుంది. అందుకే అప్పుడప్పుడూ డిజిటల్ ఫాస్టింగ్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. మెదడు విశ్రాంతి పొంది రీచార్జ్ అవుతాం. రాత్రివేళల్లో స్మార్ట్ ఫోన్, ట్యాబ్, లాప్టాప్ వంటివి చూడటం వల్ల వాటి స్క్రీన్ లైట్స్ కళ్ల మీద పడి.. మెదడు ఇంకా రాత్రి కాలేదేమో అనే భావనలో ఉండిపోయి నిద్రను దూరం చేస్తుంది. దాంతో సహజంగా ఉండే స్లీప్ – వేకప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. నిద్రలేమి చెంత చేరుతుంది. డిజిటల్ డివైసెస్ వ్యసనం వల్ల గనక నిద్రలేమి దరి చేరితే దానికి ఒకటే మార్గం.. ఇంటర్మిటెంట్ డిజిటల్ ఫాస్టింగ్. దీనివల్ల మంచి నిద్ర కంటికి చేరి.. ఉదయాలు ఫ్రెష్‌గా మొదలవుతాయి. ఆ రోజంతా ఆహ్లాదంగా గడుస్తుంది. డిజిటల్ వరల్డ్‌కు దూరంగా ఉంటే మెదడు చురుగ్గా ఉంటుంది. కొత్త కొత్త కాన్సెప్ట్స్‌ను ఆలోచించడానికి మెదడు మొగ్గు చూపుతుంది. సృజన వికసిస్తుంది. ఈ రోజుల్లో.. బంధాలు, అనుబంధాలు బలహీన పడటంలో డిజిటల్ డివైసెస్దే ప్రధాన పాత్ర అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. మునుపటిలా బంధాలు బలపడి.. అనుబంధాలు వెల్లివిరిసి, స్నేహానురాగాలను ఆస్వాదించాలను కుంటే దానికి సింపుల్ వే.. డిజిటల్ డివైసెస్‌కి డైవోర్స్ ఇవ్వడమే అని చెబుతున్నారు. కుటుంబం, బంధుమిత్రులతో గడిపిన క్షణాలు.. సందర్భాలు.. ఏ డిజిటల్ మీడియం ఇవ్వలేని అసలైన వినోదాన్ని.. ఆనందాన్నిస్తాయి. ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలుగా మలుస్తాయని చెబుతున్నారు మానసిక విశ్లేషకులు. మన దగ్గర 9 –17 ఏళ్లలోపు పిల్లల్లో 60 శాతం మంది రోజుకు మూడు గంటల కంటే ఎక్కువే సోషల్ మీడియా లేదా గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో గడుపుతున్నారని నిరుడు నవంబర్‌లో చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఎలా స్టార్ట్ చేయాలి.. ముందు ఈ డిజిటల్ వరల్డ్ నుంచి ఎందుకు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారో నిర్ధారించుకోవాలి. పని మీదే ఫోకస్ చేసి.. నైపుణ్యం పెంచుకోవడానికా? ఆందోళన తగ్గించుకోవడానికా? లేదంటే కళ్లముందున్న చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడానికా? ఇలా దేనికోసం డిస్కనెక్ట్ కావాలనుకుంటున్నారో స్పష్టంగా తెలిస్తేనే ఫాస్టింగ్ ఈజీ అవుతుంది. అలాగే రోజంతా ఉండాలనుకుంటున్నారా? రోజులో కొన్ని గంటలు మాత్రమే చాలనుకుంటున్నారా? ముందు గంటల నుంచి మొదలుపెట్టి.. రోజులకు పెంచుదామనుకుంటున్నారా.. అనేదాన్ని డిజిటల్ డివైసెస్ యూసేజ్.. దానికి అలవాటుపడిన తీవ్రతను బట్టి నిర్ణయించుకోవాలి. థసౌకర్యాన్ని బట్టి ఫాస్టింగ్ టైమ్‌ని నిర్ధారించుకుని వారం.. వర్జ్యం.. మీనం.. మేషం లేక్కపెట్టకుండా తక్షణమే స్టార్ట్ చేయాలి. ఏరోజు.. ఏ పూట డిజిటల్ ఫాస్టింగ్ ఉండబోతున్నారో.. ఆ సమాచారాన్ని కుటుంబం, ఆప్తులు, సన్నిహితులు.. బాస్.. కొలీగ్స్ ఇలా మీ సర్కిల్లో ఉన్న వారందరికీ తెలియజేయాలి. మీ స్మార్ట్ ఫోన్, ఇతర డివైసెస్లోని నోటిఫికేషన్ ఆప్షన్ని టర్న్ ఆఫ్ చేయడం.. వీలైతే సోషల్ మీడియాను అన్‌ఫ్రెండ్ చేయాలి. ఇంకా కుదిరితే ఫోన్‌తోపాటు మిగతా డివైసెస్లోని సోషల్ యాప్స్ అన్నిటినీ తాత్కాలికంగా అన్ఇన్స్టాల్ చేయడం మంచిది. భోజనం చేసేటప్పుడు.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు.. రాత్రి పడుకునే ముందు.. పని వేళల్లో స్మార్ట్‌ఫోన్‌కి దూరంగా ఉండాలి. మాటి మాటికీ ఫోన్ చెక్ చేయాలనుకునే టెంప్టేషన్కి డిలిట్ ఫరెవర్ కొట్టేయాలి. అయినా టెంప్ట్ అవుతుంటే డిజిటల్ ఫాస్టింగ్ ఎందుకు చేస్తున్నామో పదే పదే గుర్తుతెచ్చుకోవాలి. సోషల్ మీడియా నుంచి డిస్కనెక్ట్ అవడం వల్ల దొరికిన విలువైన సమయాన్ని రీడింగ్.. ఎక్సర్సైజెస్.. లేదా చిరకాల అభిరుచుల కోసం వినియోగించుకోవాలి. చేయాలనుకుని చేయలేకపోయిన.. ఎంతోకాలంగా వాయిదా వేసుకుంటూ వస్తూన్న పనుల కోసమూ కేటాయించుకోవచ్చు. లేదా ఇతర ఆసక్తుల మీదా వెచ్చించొచ్చు. బిఫోర్ లాగౌట్.. కళ్లముందు మంచి నీటి ప్రవాహం ఉన్నా.. గుక్కెడు నీళ్లు మాత్రమే దాహాన్ని తీరుస్తాయి. వెల్లువ ఉంది కదాని దాన్ని పొట్టలో నింపేయలేం కదా! ఈ డిజిటల్ ఇన్ఫో కూడా అంతే! ఆ అజీర్తి నుంచి బయటపడేసే ఏకైక మెడిసన్ డిజిటల్ ఫాస్టింగ్. ఈ ఉపవాస దీక్షవల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. అన్నీ అనుకూల ప్రభావాలే! కాబట్టి.. మీ డిజిటల్ ఫాస్టింగ్ గోల్స్‌ని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కూడా పంచుకుని.. ఫాస్టింగ్ వైపు వాళ్లనూ ప్రోత్సహించాలి. ఇలా ఏర్పాటు చేసుకున్న సపోర్ట్సిస్టమ్ మీ ప్రయాణాన్ని మీరు ఆస్వాదించేలా చేస్తుంది. లక్ష్యానికీ త్వరగా చేరుస్తుంది. సెలబ్రిటీలు ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా షేఖ్, అమిత్ సాద్, ఇషా గుప్తా వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు తరచుగా డిజిటల్ ఫాస్టింగ్ చేస్తుంటారు. బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా డిజిటల్ ఫాస్టింగ్‌లో ఉంటుందని వెబ్‌సైట్స్ సోర్సెస్ చెబుతున్నాయి. ఈ ఊళ్లో.. మాహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా.. వడ్గాంలో ప్రతిరోజు సాయంకాలం ఏడు గంటలకు ఒక సైరన్ మోగుతుంది. అలా మోగగానే ఆ గ్రామస్థులంతా తమ ఇళ్లళ్లో టీవీలు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. తర్వాత గం.8.30 నిమిషాలకు మళ్లీ సైరన్ మోగుతుంది. అప్పుడు టీవీలు, ఫోన్లు స్విచాన్ చేసుకుంటారు. ఈ గంటన్నరపాటు వాళ్లంతా కుటుంబంతో.. ఇరుగుపొరుగుతో కబుర్లు చెప్పుకుంటూ.. పిల్లలను ఆడిస్తూ.. చదివిస్తూ కాలక్షేపం చేస్తారు. ఇది దాదాపు రెండేళ్ల నుంచి అమల్లో ఉంది. వడ్గాంను డిజిటల్ డీటాక్స్ విలేజ్‌గా అభివర్ణిస్తున్నారు. ఇక్కడ మూడు వేల వరకు జనాభా ఉంటుంది. అంతా రైతులు, సుగర్ ఫ్యాక్టరీ కార్మికులే! కరోనా సమయంలో ఆన్లైన్ పాఠాలు తప్పనిసరై స్మార్ట్‌ఫోన్స్ వాడటంతో.. ఆ ఊరి విద్యార్థులంతా ఫోన్లకు అడిక్ట్ అయ్యారట. ఇరవైనాలుగ్గంటలూ ఫోన్లతోనే ఆడుకుంటుండంతో ఇటు చదువులోనూ.. అటు ఆటల్లోనూ చురుకుదనం తగ్గి బద్ధకంగా తయారయ్యాట. పెద్దవాళ్లూ ఇందుకు భిన్నంగా కనిపించక వాళ్లూ టీవీలకు అతుక్కుపోయారు. ఇలాగైతే కష్టమని.. పిల్లలు బాగుపడాలంటే ముందు పెద్దవాళ్లను దారిలో పెట్టాలని భావించిన స్కూల్ టీచర్లు.. గ్రామ పంచాయతీ సభ్యులతో మాట్లాడి ఈ డిజిటల్ డిటాక్స్ నిర్ణయాన్ని తీసుకున్నారు. మొదట్లో సైరన్ మోగగానే ఇంటింటికీ వెళ్లి చెక్ చేసేవారట.. ఫోన్లు, టీవీలు కట్టేశారా లేదా అని. గంటన్నర డిజిటల్ డీటాక్స్ మంచి ఫలితాలనివ్వడంతో.. గ్రామస్థులే స్వచ్ఛందంగా సైరన్ మోగగానే డివైసెస్‌ని కట్టేయసాగారని ఆ గ్రామ సర్పంచ్ విజయ్ మొహితే బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవి చదవండి: కిడ్నీ సమస్యలు ఈ కారణాలతో కూడా రావచ్చు.. జాగ్రత్త! -
ఆకతాయిల నుంచి రక్షించే లాకెట్.. ఎలాగంటారా..
ఆకతాయిలుంటున్న సమాజంలో మహిళలకు రక్షణ కరవైంది. వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించే విధంగా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత కల్పిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నా ఆకతాయిల ఆగడాలను పూర్తిగా కట్టడి చేయలేకపోతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో మహిళలకు భద్రత కల్పించేలా పలు యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అందులో భాగంగా అపరిచితులు వెంబడిస్తునప్పుడు మనం ప్రమాదంలో ఉన్నామనే విషయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేసేలా ప్రత్యేక ‘స్మార్ట్ జ్యూవెలరీ’ని రూపొందించారు. ఈ ‘సేఫర్ స్మార్ట్ జ్యూవెలరీ’లో లాకెట్ ఉంటుంది. అది మొబైల్ యాప్‌తో కనెక్ట్ చేసుకొని మనకు కావాల్సినవారి నంబర్లు సెట్ చేసుకోవాలి. దీన్ని చెయిన్‌లా మెడలో వేసుకుని ప్రమాదం వచ్చినప్పుడు లాకెట్ వెనుక బటన్ని రెండుసార్లు నొక్కితే చాలు. మనకు కావాల్సిన వారికి మనం ప్రమాదంలో ఉన్నామని మెసేజ్ వెళ్తుంది. ఇదీ చదవండి: విమానం కంటే వేగంగా వెళ్లే రైలు.. ప్రత్యేకతలివే.. అంతేకాదు, యాప్ నుంచి మీ లైవ్ లొకేషన్ కూడా షేర్ అవుతుంది. దీంతో మిమ్మల్ని వారు సులభంగా చేరుకోగలుగుతారు. అలాగే, ప్రమాదంలో ఉన్నవారు సమీపంలోని హాస్పిటల్ లేదా పోలీస్ స్టేషన్‌కి వెళ్లేలా నావిగేట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లోని యాప్‌ల ద్వారా ఈ స్మార్ట్లాకెట్ను కనెక్ట్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. -
విశాఖ ఐటీ సెజ్‌లో తొలి ఇండియన్ ప్రాసెసర్‌తో కంప్యూటర్ తయారీ
సాక్షి, విశాఖపట్నం : పాఠ్యాంశాల్లో సందేహాల నివృత్తికి నెట్ సౌకర్యం ఉన్న కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ఎంతో ముఖ్యం. కానీ, వీటిల్లో అశ్లీలతకు ఆస్కారం ఎక్కువ. దీనికి పరిష్కారంగా.. భవిష్యత్‌లో ఎదురయ్యే డిజిటల్ సవాళ్లని ఎదుర్కొనేందుకు విశాఖపట్నం ఐటీ సెజ్ వేదికగా.. మొట్టమొదటి ఇండియన్ లాంగ్వేజ్ కంప్యూటర్ ఆవిష్కృతమైంది. తొలి భారతీయ ప్రాసెసర్‌తో డిజిటల్ స్కూల్ బ్యాగ్ (డీఎస్బీ) పేరుతో రూపొందించిన సిద్ధి డీసీబీ పీఆర్4ఏ కంప్యూటర్లోని కంటెంట్‌ని 18 భారతీయ భాషల్లోకి అనువదించే సౌలభ్యం ఉంటుంది. త్వరలోనే ఇది మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతమున్న కంప్యూటర్లకు భిన్నంగా కేవలం చదువు కోసం మాత్రమే వినియోగించుకునేలా సరికొత్త డివైజ్‌ని విశాఖకు చెందిన స్టార్టప్ సంస్థ డ్రీమ్‌చిప్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించింది. ఇది కేవలం భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్న మొట్టమొదటి డిజిటల్ స్కూల్ బ్యాగ్ కంప్యూటర్‌గా చరిత్ర సృష్టించనుంది. అక్షరమాల నుంచి అన్ని రకాల అంశాలనూ ఇందులో చదువుకునేలా తీర్చిదిద్దారు. నూతన విద్యావిధానాలకు అనుగుణంగా.. పిల్లల బరువులో 10 శాతం మాత్రమే స్కూల్ బ్యాగ్ ఉండాలన్న నిబంధనల మేరకు కేవలం 1.5 కిలోల బరువుతోనే ఈ డిజిటల్ స్కూల్ బ్యాగ్ కంప్యూటర్ని తయారుచేశారు. ఏళ్ల తరబడి ప్రయోగాల తర్వాత.. అనేక ప్రయోగాల తర్వాత డ్రీమ్‌చిప్ డెవలపర్ కంపెనీ ప్రతినిధులు గోపీకుమార్ బులుసు, మురళీమనోహర్, వెంకటేశ్వరరావు చివరికి విజయం సాధించారు. ఎలాంటి అశ్లీలత కంటెంట్‌కు తావులేకుండా కేవలం చదువుకు సంబంధించిన పాఠాలు మాత్రమే ఇందులో ఉండేలా ఈ కంప్యూటర్ని అభివృద్ధి చేశారు. ఇది ఆఫ్‌లైన్ మోడ్‌లో పనిచేస్తుంది. బ్లూటూత్, వైఫై సౌకర్యం కూడా ఉంది. దేశంలోనే తొలి సొంత ప్రాసెసర్ వినియోగించిన కంప్యూటర్ ఇది. సొంత ఆపరేటింగ్ సిస్టమ్, కోడ్ లాంగ్వేజ్, ఫీచర్ల పరంగా.. ఇది ప్రస్తుతం ఉన్న ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మొత్తం ఐదువేల పేజీల్ని ఇందులో నిక్షిప్తం చేసుకునేలా అభివృద్ధి చేశారు. పైగా దీని ధర కూడా తక్కువే. కేవలం రూ.4 వేలకు ఈ కంప్యూటర్ని విక్రయించాలని డ్రీమ్‌చిప్ నిర్ణయించింది. ఏటా 50 లక్షల యూనిట్లు తయారీ భారతీయ భాషల్లో కంప్యూటర్ను తయారుచేసి.. విద్యార్థులకు కేవలం విద్యను మాత్రమే అందించాలన్న సంకల్పంతో రూపొందించాం. మేకిన్ ఇండియా స్ఫూర్తితో దీన్ని పూర్తిగా వైజాగ్‌లోనే తయారుచేశాం. ఇందులో 100 మల్టీ సబ్జెక్ట్స్ పాఠాలతో భారత బాలశిక్ష కూడా లోడ్ చేశాం. ఈ కంప్యూటర్లను పెద్దఎత్తున తయారుచేసేందుకు ప్రభుత్వం లేదా ఏదైనా విద్యా సంబంధిత ట్రస్ట్‌తో కలిసి ఏటా 50 లక్షల యూనిట్లు తయారుచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నూతన విద్యా విధానాలను స్ఫూర్తిగా తీసుకున్నాం. – గోపీకుమార్ బులుసు, డ్రీమ్ చిప్ చీఫ్ టెక్నాలజిస్ట్ డ్రీమ్‌చిప్ కంప్యూటర్ ప్రత్యేకతలివే.. ఇది తెలుగు భాషతో ప్రారంభమయ్యే కంప్యూటర్. ఇతర రాష్ట్రాల విద్యార్థులు తమ భాషలోనే మొదలు పెట్టేలా సెట్టింగ్స్‌ని మార్చుకోవచ్చు. ఒక పాఠాన్ని తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లోనూ చదువుకునే వెసులుబాటు ఇందులో ఉంది. కేవలం కంప్యూటర్‌లా మాత్రమే కాకుండా.. దీన్ని డిజిటల్ స్కూల్ బ్యాగ్‌గా కూడా వినియోగించుకోవచ్చు. దీనికి ఒకవైపు స్క్రీన్, మరోవైపు టెక్ట్ సబుక్ లేదా నోట్‌బుక్ షెల్ఫ్, రైటింగ్ ప్యాడ్ ఉంటుంది. స్క్రీన్ కింద భాగంలో పెన్నులు, పెన్సిళ్లు పెట్టుకునే అర కూడా ఉంది. స్క్రీన్ పైభాగంలో రాత్రిపూట చదువుకునేందుకు వీలుగా ఎల్ఈడీ టేబుల్ ల్యాంప్నూ అమర్చారు. -
Smart Bottle: ఈ బాటిల్ కేవలం నీళ్లకే కాదు.. మ్యూజిక్ కూడా.. ధర రూ.3,257
ప్రతి ప్రయాణంలో మంచి నీళ్లు ఎంత అవసరమో.. స్నేహితులతో కలిసి చేసే ప్రయాణాల్లో ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ కూడా అంతే అవసరం. 3 ఇన్ 1 స్మార్ట్ ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ అందుకు సై అంటుంది. ఒక వాటర్ బాటిల్ ఎంటర్టైన్మెంట్ని అందించడమేంటీ అనేగా మీ డౌటనుమానం? అదే దీని స్పెషాలిటీ. దీనిలో మ్యూజిక్ స్పీకర్స్, డాన్సింగ్ లైట్స్ ఆన్ చేసుకోవచ్చు. వేడి నీళ్లు కావాలంటే వేడి నీళ్లు, చన్నీళ్లు కావాలంటే చన్నీళ్లూ ఇందులో నిలవ చేసుకోవచ్చు. 12 గంటల పాటు వేడి నీళ్లను వేడిగా, 24 గంటల పాటు చన్నీళ్లను చల్లగా ఉంచుతుంది. వైర్ లెస్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ ఉండటంతో.. బ్లూటూత్ ద్వారా ఫోన్‌కి కనెక్ట్ చేసుకుని నచ్చిన పాటను పెట్టుకోవచ్చు. ఈ బాటిల్‌ని పార్టీల్లో, యోగా చేసే సమయాల్లో, వ్యాయామం చేసేటప్పుడు, క్యాంపింగ్ లేదా అవుట్ డోర్‌కి వెళ్లినప్పుడు వెంట పెట్టుకుంటే.. చక్కగా కావల్సిన మ్యూజిక్ వింటూ దాహం తీర్చుకోవచ్చు. ఇలాంటి బాటిల్‌ని మన సన్నిహితులకు లేదా కుటుంబ సభ్యులకు గిఫ్ట్‌గా కూడా ఇవ్వచ్చు. ఆరోగ్య స్పృహ ఉన్న ఆత్మీయులకు ఇలాంటి బాటిల్ బహుమతిగా ఇవ్వడం కూడా బాగుంటుంది. ధర: 42 డాలర్లు (రూ.3,257) -
2022లోనూ వర్క్‌ఫ్రమ్ హోమ్!!
Work From Home Continue In 2022: ఏడాది ముగింపుతో వర్క్‌ఫ్రమ్ హోంకీ ఎండ్ కార్డు పడనుందని అంతా భావించారు. ఈలోపే కొత్త వేరియెంట్ ‘ఒమిక్రాన్’ విజృంభణతో భయాందోళనలు తెర మీదకు వచ్చాయి. అయినప్పటికీ వ్యాక్సినేషన్ పూర్తైన ఉద్యోగులను కంపెనీలు ఎలాగైనా ఆఫీసులకు రప్పించి తీరతాయని, 2022 జనవరి నుంచి ఆఫీసులు కరోనాకి ముందు తరహాలో నడుస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పలు సర్వేలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తున్నాయి. గ్రాంట్ థోరంటన్ భారత్ సర్వే ప్రకారం.. దాదాపు 10 కంపెనీల్లో ఆరు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం వైపే మొగ్గు చూపిస్తున్నాయి. సుమారు 65 శాతం కంపెనీ మేనేజ్మెంట్లు.. ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా.. కరోనా భయంతో వాళ్లలో ఆత్మవిశ్వాసం సడలకుండా ఉండేందుకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్నే కంటిన్యూ చేయాలని నిర్ణయించాయి. అయితే మ్యానుఫ్యాక్చరింగ్, రవాణా, ఆతిథ్య, వైద్య, ఇతరత్ర అత్యవసర సర్వీసులు మాత్రం వర్క్ ఫ్రమ్ హోం నుంచి దూరంగానే ఉన్నాయి. మొత్తం 4, 650 రియాక్షన్ల ఆధారంగా ఈ సర్వేను పూర్తి చేసింది గ్రాంట్ థోరంటన్. మరోవైపు కంపెనీలు నిర్వహించిన అంతర్గత సర్వేల్లోనూ ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోం వైపే ఆసక్తి చూపిస్తున్నారు. కంపెనీలు కూడా ప్రొడక్టివిటీ పెరగడం, ఆఫీస్ స్పేస్ భారం తగ్గుతుండడంతో వాళ్లకు తగ్గట్లు నడుచుకోవాలని భావిస్తున్నాయి. పరిస్థితులను బట్టి జూన్, 2022 వరకు వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగించాలని తొలుత అనుకున్న కంపెనీలు, తాజా నిర్ణయం ప్రకారం.. 2022 మొత్తం వర్క్‌ఫ్రమ్ హోంలోనే కొనసాగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కొన్ని బెనిఫిట్స్‌ను దూరం చేస్తూనే.. వాళ్లకు వర్క్‌ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించాలని కొన్ని కంపెనీలు నిర్ణయించాయి. ఈ లెక్కన పూర్తిస్థాయిలో ఉద్యోగుల్ని రప్పించాలని భావిస్తున్న కంపెనీలు కొన్ని మాత్రమే. చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం.. గూగుల్‌కు ఉద్యోగుల ఝలక్! ఇప్పటికే కొందరు ఉద్యోగులకు శాశ్వత వర్క్‌ఫ్రమ్ హోంను ఇస్తూ.. హైక్‌లు, ఇతర వెసులుబాటులను దూరం చేశాయి. చిన్న, మధ్యస్థ కంపెనీలతో పాటు ఇదే తరహాలో టెక్ దిగ్గజ కంపెనీలు కూడా ప్రణాళికలు వేస్తున్నాయి. టీసీఎస్ 95 శాతం ఉద్యోగుల్ని వర్క్‌ఫ్రమ్ హోంలోనే కొనసాగించాలని, అత్యవసర సిబ్బంది మాత్రమే ఆఫీసులకు రావాల్సి ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా కేంద్రంగా నడుస్తున్న కంపెనీలు భారత్‌లోని ఉద్యోగులకు ఇప్పటికే సంకేతాలు అందించాయి కూడా. పర్యవేక్షణ కోసం! స్మార్ట్‌హోం డివైజ్‌లను రంగంలోకి దించుతుండడంతో దాదాపు ఇది ఖరారైనట్లేనని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘హోం ఆఫీసుల’లో ఉద్యోగుల పర్యవేక్షణ కోసమే వీటిని తీసుకురాబోతున్నట్లు, ఈ మేరకు అమెజాన్, మెటా, గూగుల్ సైతం దరఖాస్తులకు ఉద్యోగుల నుంచి ఆహ్వానం పలికినట్లు సమాచారం. ఒకవేళ దరఖాస్తులు రాకున్నా.. ప్రొత్సాహాకాలను మినహాయించుకుని ఈ ఎక్విప్మెంట్ అందించాలని(తప్పనిసరి) భావిస్తున్నాయి. ఏది ఏమైనా వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగింపుపై డిసెంబర్ మొదటి వారంలోగానీ, మధ్యలో వరుసబెట్టి ఒక్కో కంపెనీ కీలక ప్రకటన చేసే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి. చదవండి: వారంలో 3 రోజులే పని.. ఎలా ఉంటుంది? -
దేశంలో స్మార్ట్ స్పీకర్లకు భారీ డిమాండ్
భారతదేశంలో స్మార్ట్ స్పీకర్లకు ఆదరణ పెరుగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. భారతదేశంలో విక్రయించే స్మార్ట్ స్పీకర్ల సంఖ్య 2020 సంవత్సరం చివరినాటికి 7.5 లక్షల యూనిట్లు అమ్ముడు పోతాయని టెక్ నిపుణులు అంచనా. రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ 'టెక్ఆర్క్' నిర్వహించిన 'ఇండియా స్మార్ట్ స్పీకర్ మార్కెట్ స్కాన్ రిపోర్ట్' సర్వే ప్రకారం, స్మార్ట్ స్పీకర్ల మార్కెట్ లో ప్రధానంగా అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్లు అగ్రస్థానంలో నిలిచాయని సర్వేలో తేలింది. 2020 జనవరి నుండి సెప్టెంబర్ వరకు 95.9% మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. కానీ షియోమి జూలై-సెప్టెంబర్ 2020 త్రైమాసికంలో 7.1 శాతం మార్కెట్ వాటాతో 2వ స్థానంలో నిలిచింది. 2 శాతం వాటాతో గూగుల్ తర్వాత స్థానంలో ఉంది. (చదవండి: భారత్‌లో స్టార్‌లింక్ హై - స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు) టెక్ఆర్సి వ్యవస్థాపకుడు & చీఫ్ అనలిస్ట్ ఫైసల్ కవూసా మాట్లాడుతూ.. “భారతీయ గృహా వినియోగదారులు ఎక్కువగా స్మార్ట్ టెక్నాలజీల వైపు వెళ్తున్నారు, స్మార్ట్ స్పీకర్ వంటి వాయిస్-నియంత్రిత పరికరాలు ఇందులో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. వినియోగదారులకు స్మార్ట్ స్పీకర్లు అందుబాటు ధరలో ఉండటం వల్ల వీటిని కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని" తెలిపారు. భారత్‌లో డిస్ప్లేతో లభించే స్మార్ట్ స్పీకర్లను కొనుగోలు చేసే ధోరణి కూడా పెరుగుతోందని అధ్యయనం వెల్లడించింది. అందుకే దేశంలో వీటికి డిమాండ్ భారీగా ఉంది. ఈ సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో డిస్ప్లేతో ఉండే స్మార్ట్ స్పీకర్ల షిప్మెంట్ గత త్రైమాసికంతో పోలిస్తే 87 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది. డిస్ప్లేతో ఉండే స్మార్ట్ స్పీకర్లకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నందున, వాటి సగటు ధరలు కూడా కొంత వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సాధారణ స్మార్ట్ స్పీకర్ డివైజ్‌ల సగటు ధర 5,560 వరకు ఉంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది రూ.6,100 వరకు ఉండటం విశేషం. -
చార్జ్ & ఎంజాయ్
నేతలకు పదవులు.. హీరోలకు హిట్లు.. హీరోయిన్లకు గాసిప్స్.. ఎంత ఇంపార్టెంటో.. యూత్‌కు ‘చార్జింగ్’ అంతేముఖ్యం. చేతిలో ఉన్న ఫోన్లో బ్యాటరీ ఫుల్‌గా ఉంటే చాలు. ఇక రోజంతా ఆన్లైన్లో చక్కర్లుకొట్టొచ్చు. చార్జింగ్ ఇండికేషన్‌లో ఒక్క పుల్ల తగ్గినా.. ఫుల్ చార్జింగ్ పెట్టేవరకూ వదిలిపెట్టరు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఏది మరచిపోయినా ఫర్లేదు.. కానీ ఫోన్ విత్ ఫుల్ చార్జింగ్ లేకపోతే మాత్రం కుదరదు. అరచేతిలో ప్రపంచాన్ని ఉంచుతున్న స్మార్ట్ డివైజ్‌ను కరెంట్‌తో నింపేసి అన్ని పనులూ కానిచ్చేస్తున్నారు. వేలు వెచ్చించి కొన్న స్మార్ట్ గాడ్జెట్స్ పని చేయాలంటే కావాల్సింది బ్యాటరీలో పవర్. అది ఫోన్ అయినా, డిజిటల్ కెమెరా అయినా.. చార్జింగ్ ఉంటేనే కదా మన అవసరాలు తీరేది. స్మార్ట్ఫోన్ల విషయానికి వస్తే 3జీ సేవలు విస్తరించిన వేళ, సమాచారం ఎంత వేగంగా అందుతుందో.. చార్జింగ్ అంతే వేగంగా పడిపోతుంది. 24 గంటలూ ఆన్లైన్లో ఉంటున్న యువత చార్జింగ్‌ను పెద్ద సమస్యగా ఫీలవుతున్నారు. ఫోన్లతో పాటు చార్జర్లను కూడా క్యారీ చేస్తూ అవసరం కాగానే చార్జింగ్ పెట్టేస్తున్నారు. బ్యాటరీ ప్రాధాన్యం గుర్తించే బస్సుల్లో, రైళ్లలోనూ చార్జింగ్ పాయింట్లు పెట్టేశారు. ఇంకొందరైతే డబుల్ బ్యాటరీలనూ మెయింటైన్ చేస్తున్నారు. ఒక బ్యాటరీలో చార్జింగ్ ఇంకిపోగానే.. స్టెప్నీ బ్యాటరీని తగిలించేస్తున్నారు. మొబైల్ చార్జర్స్.. పేరుమోసిన కంపెనీ అప్డేటెడ్ స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త మొబైల్ తెచ్చిందనగానే.. ఫీచర్ల గురించి కాకుండా.. బ్యాటరీ బ్యాకప్ ఎంత టైం వస్తుందనేవారు కోకొల్లలు ఉంటున్నారు. ఒక రకంగా బ్యాటరీ బ్యాకప్ మీద కూడా సదరు స్మార్ట్ వస్తువు సేల్స్ ఆధారపడి ఉంటున్నాయి. అందుకే కొన్ని కంపెనీలు ఒక్కసారి చార్జింగ్ పెడితే వారాలకు వారాలు.. బ్యాటరీ నడుస్తుందంటూ ప్రకటనలతో ఊదరగొడుతున్నాయి. ఇంకొన్ని కంపెనీలు మొబైల్ బ్యాటరీ పవర్ బ్యాంక్ లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. ఇవి ఒక్కసారి ఫుల్ చార్జింగ్ అయితే.. వీటి ద్వారా ఏకకాలంలో నాలుగు ఫోన్లు చార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. దూరప్రయాణాల్లో ఈ అడాప్టర్లు యూజ్‌ఫుల్‌గా మారుతున్నాయి. అందుకే స్మార్ట్ మార్కెట్లో వీటి విక్రయాలు కూడా రికార్డుస్థాయిలోనే సాగుతున్నాయి. అన్నట్టు నేడు నేషనల్ బ్యాటరీ డే. లెట్స్ చార్జ్ ద బ్యాటరీస్.. - త్రిగుళ్ల నాగరాజు -
నెట్టింట్లో హార్ట్ బ్లీడ్!
వెబ్ వ్యవస్థకు వణుకు మొదలైంది. ఇంటర్నెట్ సెక్యూరిటీలో మరో పెద్ద సమస్య వచ్చి పడింది. వేలాది వెబ్సైట్లు, వందలాది సర్వర్ల, లక్షల సంఖ్యలోని స్మార్ట్ డివైజ్‌లు ఇప్పుడు ప్రమాదంలోపడ్డాయి. ‘హార్ట్‌బ్లీడ్’ బగ్‌తో అంతర్జాలం మొత్తం అతలాకుతలం అయ్యే పరిస్థితి నెలకొంది. ఇంటర్నెట్ రక్షణ వ్యవస్థలో అంతర్గతంగా మొదలైన ఈ సమస్య ఇప్పుడు హ్యాకర్ల పాలిట వరంగా మారింది. నెటిజన్ల పాలిట శాపంగా మారింది. ఇంటర్నెట్ గుండెకు గాయం అయ్యింది. ఆ గాయం పేరే ‘హార్ట్‌బ్లీడ్’. ఇంటర్నెట్ సమాచార వ్యవస్థను సవాల్‌గా మారిన బగ్(క్రిమి) ఇది. సెక్యూర్ సాకెట్ లేయర్(ఎస్ఎస్ఎల్)అనే ఇంటర్నెట్ సెక్యూరిటీ వ్యవస్థకు సోకిన చిన్న జబ్బు ఈ హార్ట్ బ్లీడ్. ప్రస్తుతం ఇంటర్నెట్లో సమాచార వాహినికి రక్షణగా ఉంటున్న ఎస్ఎస్ల్లో అంతర్గతంగా ఈ సమస్య మొదలైంది. పలితంగా వెబ్‌లోని సర్వర్లకు, ఆ సర్వర్లు దాచుకొన్న సమాచారానికి రక్షణ లేకుండా పోతోంది. హ్యాకర్లు అనుకోవాలే కానీ మొత్తంగా వెబ్వ్యవస్థను మొత్తంగా కబళించడానికి అవకాశం ఇస్తోంది ఈ బగ్. ఎస్ఎస్ఎల్ అంటే ఏంటి? ఏం చేస్తుంటుంది? వెబ్, ఈమెయిల్, ఇన్స్టంట్ మెసేజింగ్ సర్వీసులు విషయంలో భద్రతను, ప్రైవసీకి అవకాశం ఇచ్చేదే ఈ క్రైప్టోగ్రాపిక్ సాఫ్ట్ వేర్పని. సెక్యూర్ సాకెట్ లేయర్(ఎస్ఎస్ఎల్) అనే ఈ సాఫ్ట్వేర్ ఇంటర్నెట్లోని సమాచారం హ్యాకర్ల బారిన పడకుండా ఒక కవచంలా ఉపయోగపడుతుంది. ఒక రష్యన్ పత్రిక వెర్షన్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 60 శాతానికిపైగా సర్వర్లు ఈ సాఫ్ట్‌వేర్‌నే రక్షణ వ్యవస్థగా ఉపయోగిస్తున్నాయి. మనకొచ్చే ప్రమాదం ఏమిటి?! మనం ఉన్న అపార్ట్మెంట్ కు భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయని ప్రపంచానికి అర్థం అయ్యింది. మరి ఇప్పుడు దాని వల్ల మనకు వ్యక్తిగతంగా నష్టం కలగొచ్చు, ఆర్థికంగా నష్టం కలగొచ్చు, మానసికంగా భయం ఉండొచ్చు... ఇప్పుడు ఈ బగ్ వల్ల ఉండే ప్రమాదం కూడా అదే. మనం ఉపయోగిస్తున్న సోషల్నెట్వర్కింగ్ సైట్ అయినా మన కంపెనీ వెబ్సైట్ అయినా ఎస్ఎస్ఎల్ రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు అయితే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనకు నష్టం ఉండవచ్చు. బగ్ బలహీనతను గమనించి హ్యాకర్లు సర్వర్ల మీదకు దాడికి పూనుకొనే అవకాశం ఉంది. ఒక్కసారి అవకాశం దొరికితే వారు ఏమైనా చేయగల అవకాశం ఉంది. మొత్తం సమాచారం అంతా తస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఇంటర్నెట్తో కనెక్ట్ అయిన మొబైల్ఫోన్లకు కూడా దీంతో ప్రమాదం ఉంది. అందరం బాధితులమేనా?! మూడింట రెండొంతుల వెబ్సైట్లు హార్ట్‌బ్లీడ్ బారిన పడ్డాయని ఒక అంచనా. తాజాగా యాంటీ వైరస్ జెయింట్ మెకాఫే ఒక టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాన్ని ఓపెన్ చేసుకొని వెబ్సైట్ డొమైన్ నేమ్‌ను పేస్ట్ చేస్తే సదరు వెబ్సైట్ హార్ట్‌బ్లీడ్ బారిన పడిందా? లేదా?అనే విషయం గురించి స్పష్టత వస్తుంది! మీ సోషల్నెట్వర్కింగ్ అకౌంట్ లాగిన్ పాస్‌వర్డ్‌ను తక్షణం మార్చేసుకోవడం సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. పరిష్కారం ఎప్పుడు ఎలా?! ప్రస్తుతానికి వెబ్‌లో ఈ అంశం గురించే తెగ చర్చ జరుగుతోంది. ఎస్ఎస్ఎల్ నిపుణులు ఈ బగ్‌ను నశింపజేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి పరిష్కార మార్గం గురించి వారు చేసే ప్రకటన గురించి ఎదురు చూడటమే తప్ప మరో మార్గం ఏదీ లేకుండా పోయింది. సమస్య అయితే చాలా తీవ్రమైననదేనని అయినా పరిష్కార మార్గం మాత్రం కచ్చితంగా ఉందని వారు స్పష్టం చేస్తుండటం ఆశావహ పరిస్థితులకు కారణం అవుతోంది. - జీవన్ రెడ్డి .బి వైరస్‌కు బగ్ కూ తేడా ఇది... ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో లేదా ఒక ప్రత్యేకమైన వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని తయారు చేసే విచ్ఛిన్నకర సాఫ్ట్‌వేర్‌ను వైరస్ అంటాం. అయితే ‘బగ్’ అనేది భిన్నమైనది. ఒక సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు అనుకోకుండా ఏర్పడే బలహీనతనే బగ్ అంటాం. అంటే దీన్ని ప్రత్యేకంగా హ్యాకర్లు తయారు చేసి వెబ్మీదకి వదల్లేదు. అనుకోకుండా ఏర్పడినది. సాఫ్ట్‌వేర్‌లోని ఈ బలహీనత హ్యాకర్లకు ఆయుధంగా మారుతుంది. కంప్యూటర్ నరకులు విజృంభించడానికి అవకాశం ఇస్తోంది. -
వైర్లెస్ కమ్యూనికేషన్లో ప్రైస్‌లెస్ చాటింగ్!
మన కమ్యూనికేషన్ వైర్ లెస్... దీన్ని ప్రైస్ లెస్‌గా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. టెక్ట్స్, ఆడియో, వీడియో... ఏ రూపంలోనైనా సరే... మూడు మిక్స్ చేసి అయినా సరే... ఉచితంగా కమ్యూనికేట్ అవ్వడానికి చాలా సదుపాయాలున్నాయి. ఇంటర్నెట్ సదుపాయమున్న స్మార్ట్ డివైజ్ చేతిలో ఉండాలి కానీ.. స్నేహితులతో ఉచితంగా చాటింగ్ చేసుకోవచ్చు. సెల్‌ఫోన్ బిల్లును తగ్గించేసుకోవచ్చు! ఈ సదుపాయాన్ని కలిగించే స్మార్ట్‌ఫోన్ కమ్ పీసీ అప్లికేషన్లివి... చాలా మందికి స్కైప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.. అయితే దీన్ని అందరూ ఉపయోగించట్లేదు. కొందరు తెలియక, మరి కొందరికి తీరిక లేక! కోట్లాది ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్న మన దేశంలో ఈ స్కైప్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకుంటున్న వారి సంఖ్య తక్కువే. ప్రత్యేకంగా స్కైప్ అకౌంట్ లేకపోయినా, కేవలం స్కైప్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఫేస్బుక్ ఫ్రెండ్స్‌తో వీడియో చాటింగ్ చేసుకోవచ్చు. అయితే.. మన వాళ్ల దగ్గర వెబ్‌క్యామ్ సదుపాయం సరిగా లేకపోవడం స్కైప్ వినియోగం తక్కువగా ఉండటానికి ఒక కారణమని అంటున్నారు నిపుణులు. ల్యాప్‌టాప్‌లు వాడుతున్న వారు మాత్రం స్కైప్‌ను విస్తృతంగా వాడుతున్నారు. ఉచితంగా వీడియో చాటింగ్ ముచ్చట తీర్చుకుంటున్నారు. కేవలం సదుపాయ కోణంలో మాత్రమే కాదు.. ఎగ్జైట్మెంట్ విషయంలో కూడా స్కైప్ వీడియో చాటింగ్ మంచి కిక్ ఇస్తుంది! మొబైల్స్ కోసం వియ్‌చాట్... భిన్నమైన మొబైల్ ప్లాట్పామ్స్ మీద పనిచేస్తుంది ఈ అప్లికేషన్. లైవ్‌చాట్, గ్రూప్‌చాట్, వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, సింబియన్, విండోస్ఫోన్లపై ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. దీంట్లోని ‘షేక్’ ఫీచర్ ద్వారా కొత్త ఫ్రెండ్స్‌ను సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. పీసీ అయినా స్మార్ట్‌ఫోన్ అయినా గూగుల్ హ్యాంగౌట్స్.. జీమెయిల్ లేదా, గూగుల్‌ప్లస్ ద్వారా ఈ హ్యాంగౌట్‌ను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. వెబ్‌క్యామ్ ఉన్న పీసీ అయినా, ఫ్రంట్ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ అయినా గూగుల్ హ్యాంగౌట్‌ను సపోర్ట్ చేస్తుంది. అయితే స్కైప్, వుయ్ చాట్ల కన్నా గూగుల్ హ్యాంగౌట్ వెనుకపడింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ విషయంలో 2.3 జింజర్ బ్రీడ్ ఆ తర్వాతి మోడళ్లపై ఇది పనిచేస్తుంది. ఐఫోన్ల విషయంలో ఐఓఎస్6 ఆ తర్వాతి మోడళ్లపై పనిచేస్తుంది. రీచార్జ్ అవసరం లేకుండా చేసే టాంగో... మొబైల్ ద్వారా ఫ్రీ కాల్స్ చేసుకోవడానికున్న మరో అప్లికేషన్ ఇది. ఈ అప్లికేషన్ ద్వారా వీడియో, వాయిస్ కాల్స్, టెక్ట్స్, ఫోటో షేరింగ్‌కు అవకాశం ఉంటుంది. ఫ్రింగ్ తో ఫోన్‌కాల్స్ ఫ్రీ... ఫ్రీగా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి అవకాశమిచ్చే మరో ఉచిత అప్లికేషన్ ఇది. ఈ అప్లికేషన్ ద్వారా గరిష్టంగా నలుగురి వీడియో కాన్ఫరెన్స్‌కు అవకాశం ఉంటుంది. ఫోన్ నంబర్‌తో అకౌంట్.. వైబర్ ఈ అప్లికేషన్ ద్వారా ప్రత్యేకమైన అకౌంట్ ఏదీ లేకుండానే ఫ్రీ ఛాటింగ్ చేసుకోవచ్చు. వైబర్ను ఇన్స్టాల్ చేసుకుంటే మీ మొబైల్ నంబర్ ద్వారానే అకౌంట్ క్రియేట్ అవుతుంది. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న మిగతా నంబర్లలో వేటికైనా వైబర్ అకౌంట్ ఉంటే అవన్నీ ఆటోమెటిక్‌గా యాడ్ అవుతాయి. ఇవేకాదు... ఇంకా ఉన్నాయి.. నింబజ్ , వాట్స్ అప్, హైక్.. తదితరాలు కూడా ఉచిత కాలింగ్, టెక్ట్స్ మెసేజింగ్, వీడియో చాటింగ్ విషయాల్లో సదుపాయవంతమైన అప్లికేషన్స్‌గా ఉన్నాయి.