చార్జ్ & ఎంజాయ్
నేతలకు పదవులు.. హీరోలకు హిట్లు.. హీరోయిన్లకు గాసిప్స్.. ఎంత ఇంపార్టెంటో.. యూత్‌కు ‘చార్జింగ్’ అంతేముఖ్యం. చేతిలో ఉన్న ఫోన్లో బ్యాటరీ ఫుల్‌గా ఉంటే చాలు. ఇక రోజంతా ఆన్‌లైన్‌లో చక్కర్లుకొట్టొచ్చు. చార్జింగ్ ఇండికేషన్‌లో ఒక్క పుల్ల తగ్గినా.. ఫుల్ చార్జింగ్ పెట్టేవరకూ వదిలిపెట్టరు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఏది మరచిపోయినా ఫర్లేదు.. కానీ ఫోన్ విత్ ఫుల్ చార్జింగ్ లేకపోతే మాత్రం కుదరదు. అరచేతిలో ప్రపంచాన్ని ఉంచుతున్న స్మార్ట్ డివైజ్‌ను కరెంట్‌తో నింపేసి అన్ని పనులూ కానిచ్చేస్తున్నారు.
వేలు వెచ్చించి కొన్న స్మార్ట్ గాడ్జెట్స్ పని చేయాలంటే కావాల్సింది బ్యాటరీలో పవర్. అది ఫోన్ అయినా, డిజిటల్ కెమెరా అయినా.. చార్జింగ్ ఉంటేనే కదా మన అవసరాలు తీరేది. స్మార్ట్‌ఫోన్ల విషయానికి వస్తే 3జీ సేవలు విస్తరించిన వేళ, సమాచారం ఎంత వేగంగా అందుతుందో.. చార్జింగ్ అంతే వేగంగా పడిపోతుంది. 24 గంటలూ ఆన్‌లైన్‌లో ఉంటున్న యువత చార్జింగ్‌ను పెద్ద సమస్యగా ఫీలవుతున్నారు. ఫోన్లతో పాటు చార్జర్లను కూడా క్యారీ చేస్తూ అవసరం కాగానే చార్జింగ్ పెట్టేస్తున్నారు. బ్యాటరీ ప్రాధాన్యం గుర్తించే బస్సుల్లో, రైళ్లలోనూ చార్జింగ్ పాయింట్లు పెట్టేశారు. ఇంకొందరైతే డబుల్ బ్యాటరీలనూ మెయింటైన్ చేస్తున్నారు. ఒక బ్యాటరీలో చార్జింగ్ ఇంకిపోగానే.. స్టెప్నీ బ్యాటరీని తగిలించేస్తున్నారు.
మొబైల్ చార్జర్స్..
పేరుమోసిన కంపెనీ అప్‌డేటెడ్ స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్ తెచ్చిందనగానే.. ఫీచర్ల గురించి కాకుండా.. బ్యాటరీ బ్యాకప్ ఎంత టైం వస్తుందనేవారు కోకొల్లలు ఉంటున్నారు. ఒక రకంగా బ్యాటరీ బ్యాకప్ మీద కూడా సదరు స్మార్ట్ వస్తువు సేల్స్ ఆధారపడి ఉంటున్నాయి. అందుకే కొన్ని కంపెనీలు ఒక్కసారి చార్జింగ్ పెడితే వారాలకు వారాలు.. బ్యాటరీ నడుస్తుందంటూ ప్రకటనలతో ఊదరగొడుతున్నాయి. ఇంకొన్ని కంపెనీలు మొబైల్ బ్యాటరీ పవర్ బ్యాంక్ లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాయి. ఇవి ఒక్కసారి ఫుల్ చార్జింగ్ అయితే.. వీటి ద్వారా ఏకకాలంలో నాలుగు ఫోన్లు చార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. దూరప్రయాణాల్లో ఈ అడాప్టర్లు యూజ్‌ఫుల్‌గా మారుతున్నాయి. అందుకే స్మార్ట్ మార్కెట్‌లో వీటి విక్రయాలు కూడా రికార్డుస్థాయిలోనే సాగుతున్నాయి. అన్నట్టు నేడు నేషనల్ బ్యాటరీ డే. లెట్స్ చార్జ్ ద బ్యాటరీస్..
- త్రిగుళ్ల నాగరాజు