![Tech Tips Common Mistakes While Charging Your Phone That Can Cause Trouble](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/mobile01.jpg.webp?itok=tTENwbDV)
స్మార్ట్‌ఫోన్‌ను సరిగ్గా ఛార్జింగ్ చేయడం తెలుసా అంటే మీరేంమంటారు.. ‘ఇదేం ప్రశ్న..? సాధారణంగా ఛార్జింగ్ కేబుల్‌తో ఛార్జ్ పెడితే సరి’ అనుకుంటారు కదా. కానీ సరైన సమయంలో, సరైన విధంగా స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టకపోతే బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఎలాంటి అంశాలు గమనించాలో తెలుసుకుందాం.
ఇతర ఛార్జర్లను ఉపయోగించడం
ప్రతిఫోన్‌కు ప్రత్యేకంగా కంపెనీ ఛార్జర్ తయారు చేస్తుంది. ప్రతిసారి ఆ ఛార్జర్‌తోనే ఛార్జ్ చేయాలి. లేదంటే ఫోన్ పాడవుతుంది. పొంతన లేని ఛార్జర్లు కరెంట్ వోల్టేజ్‌ను కొన్నిసార్లు అధికంగా, ఇంకొన్నిసార్లు తక్కువగా సరఫరా చేస్తాయి. ఇది బ్యాటరీని దెబ్బతీస్తుంది. కాబట్టి సర్టిఫైడ్ ఛార్జర్లను వినియోగించాలి.
రాత్రంతా ఛార్జింగ్
చాలామందికి లేట్‌నైట్ వరకు ఫోన్ ఉపయోగించి ఛార్జ్ చేసి పడుకోవడం అలవాటు. రాత్రంతా కరెంట్ సరఫరా అవ్వడంతో ఓవర్ ఛార్జింగ్ అవుతుంది. దాంతో బ్యాటరీ బల్జ్ అయ్యేందుకు దారితీస్తుంది.
ఛార్జింగ్ చేస్తూ ఫోన్ వాడడం
ఛార్జింగ్ చేసినప్పుడు ఎట్టిపరిస్థితిలో ఫోన్ వాడకూడదు. తప్పని పరిస్థితిలో వాడాల్సి వస్తే ఛార్జింగ్ రిమూవ్ చేసి వాడుకోవాలి. ఇది చాలా సాధారణ విషయంగా కనిపించినా ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను విస్మరించడం
ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసు అందిస్తున్న కంపెనీలు, మొబైల్ తయారీ కంపెనీ నిత్యం వాటి సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్లను అందిస్తాయి. క్రమం తప్పకుండా వాటిని అప్‌డేట్ చేసుకోవాలి. బ్యాటరీ, ఛార్జింగ్ సమస్యలకు సంబంధించిన అప్‌డేట్లను కంపెనీ అందిస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయి.
0% నుంచి 100% వరకు
ఫోన్ వాడుతున్నప్పుడు మొత్తం ఛార్జింగ్ అయిపోయేంత వరకు చూడకుండా సుమారు 40 శాతం బ్యాటరీ ఉన్నప్పుడే ఛార్జ్ పెట్టాలి. తరచుగా 0% నుంచి 100% వరకు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీపై అనవసరమైన ఒత్తిడి పడుతుంది.
చలి, వేడికి దగ్గరగా..
విపరీతమైన వేడి, చలి రెండూ ఫోన్ బ్యాటరీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఫోన్‌ను నేరుగా వేడి ప్రదేశంలో ఛార్జ్ చేయడం లేదా ఎండలో వదిలివేయడం చేయకూడదు. అదేవిధంగా, చాలా చల్లని వాతావరణంలో ఛార్జింగ్ చేయడం కూడా బ్యాటరీకి హాని కలిగిస్తుంది.
దెబ్బతిన్న కేబుల్‌తో ఛార్జింగ్
పగిలిన లేదా దెబ్బతిన్న, అతుకులున్న ఛార్జింగ్ కేబుల్స్ వాడకూడదు. ఇవి అస్థిరమైన ఛార్జింగ్, షార్ట్ సర్క్యూట్లకు కారణమవుతాయి. కొన్నిసార్లు అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి.
ఇదీ చదవండి: టెల్కోల ఆశలన్నీ ప్రభుత్వం పైనే!
ఛార్జింగ్ పోర్ట్‌ను శుభ్రం చేయకపోవడం
ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో దుమ్ము పేరుకుపోతూంటుంది. ఇది పేలవమైన కనెక్షన్, ఛార్జింగ్ సమస్యలకు దారితీస్తుంది. మృదువైన బ్రష్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ ఉపయోగించి పోర్ట్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment