జస్టిస్ కేఎం జోసెఫ్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలన్న కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఎట్టకేలకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. జస్టిస్ జోసెఫ్‌తో పాటు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వినీత్ శరణ్‌ల పదోన్నతికి ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది. ఈ నియామకాలకు సంబంధించిన దస్త్రాలకు ఆమోదం లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 25కు పెరగనుంది. అయినా మరో 6 పోస్టులు ఖాళీగా ఉంటాయి. జస్టిస్ జోసెఫ్‌కు సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించాలని సుప్రీం సీజేఐ నేతృత్వంలోని కొలీజియం జనవరి 10న కేంద్రానికి సిఫార్సుచేసింది. కేరళ నుంచి సుప్రీంలో ఇది వరకే తగిన ప్రాతినిధ్య ఉందని పేర్కొంటూ ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కేంద్రం వెనక్కి పంపింది. ఆయన పేరును సుప్రీం జడ్జి పదవికి పరిశీలించాలని మే 10న కొలీజియం మరోసారి కేంద్రానికి సూచించగా, తాజాగా ఆమోదం లభించింది. మరోవైపు, జస్టిస్ జోసెఫ్‌కు ఉత్తరాఖండ్ హైకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment