
న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం, నచి్చన జడ్జిలనే బదిలీ చేయడం, ఇతరులను పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి తప్పుడు సంకేతాలను పంపిస్తుందని వెల్లడించింది. 11 మంది జడ్జిలను బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేయగా, ఐదుగురిని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఆరుగురి బదిలీ వ్యవహారం పెండింగ్‌లో ఉంది.
కొలీజియం సిఫార్సుల అమలు విషయంలో 2021 నాటి సుప్రీంకోర్టు తీర్పునకు కేంద్ర న్యాయ శాఖ కట్టుబడటం లేదని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని కోరుతూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్‌తోపాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. హైకోర్టు జడ్జిలుగా పలువురి పేర్లను కొలీజియం ఇటీవల సిఫార్సు చేయగా, 8 మంది పేర్లకు కేంద్రం ఇంకా ఆమోదం తెలియజేయాలని గుర్తుచేసింది. కేంద్రం జడ్జిలుగా నియమించిన వారికంటే వీరిలో కొందరు సీనియర్లు ఉన్నారని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment