న్యూఢిల్లీ: అంతర్జాతీయ మందగమన ప్రభావం ముఖ్యంగా అమెరికా, యూరోప్ మార్కెట్ల నిరాశావాద ధోరణి భారత్ వస్తు ఎగుమతులు–దిగుమతులపై ప్రభావం చూపుతోంది. జూన్‌లో వస్తు ఎగుమతులు 22 శాతం క్షీణించి 32.97 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గడచిన మూడేళ్లలో (కరోనా సంక్షోభ సమయం 2020 మే నెల్లో 36.47 శాతం క్షీణత) ఇంత స్థాయిలో వస్తు ఎగుమతుల పతనం ఇదే తొలిసారి. ఇక దిగుమతులు కూడా 17.48 శాతం క్షీణించి 53.10 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు జూన్‌లో 20.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
తొలి త్రైమాసికంలో క్షీణతే..
ఇక ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో (ఏప్రిల్, మే, జూన్) చూస్తే వస్తు ఎగుమతులు 15.13 శాతం క్షీణించి 102.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 12.67%క్షీణించి 160.28 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు 57.6 బిలియన్ డాలర్లుగా ఉంది.
విభాగాల వారీగా...
- జూన్‌లో చమురు దిగుమతుల విలువ 33.8 శాతం తగ్గి 12.54 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఏప్రిల్–జూన్ మధ్య 18.52 శాతం క్షీణతతో 43.4 బిలియన్ డాలర్లుగా ఉంది.
- పసిడి దిగుమతులు జూన్‌లో 82.38 శాతం పెరిగి 5 బిలియన్ డాలర్లకు చేరింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికాన్ని చూస్తే, 7.54 శాతం తగ్గి 9.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
- జూన్‌లో వెండి దిగుమతులు 94.36 శాతం పడిపోయి 0.79 బిలియన్ డాలర్లకు చేరాయి.
- జూన్ ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో 21 క్షీణత నమోదుచేసుకున్నాయి. వీటిలో పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్, రెడీమేడ్ దుస్తులు, ఇంజనీరింగ్, రసాయనాలు, రత్నాభరణాలు, తోలు, మెరైన్ ఉత్పత్తులు ఉన్నాయి.
- ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు జూన్‌లో 45.36% పెరిగి 2.43%గా నమోదయ్యాయి. ఏప్రిల్–జూన్‌లో ఈ ఎగుమతులు 47% పెరిగి 6.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment