గాజాలో శాంతి.. ఇజ్రాయెల్, హమాస్‌ కీలక అంగీకారం | Israel And Hamas Reach Ceasefire Deal To End Gaza war | Sakshi
Sakshi News home page

గాజాలో శాంతి.. ఇజ్రాయెల్, హమాస్‌ కీలక అంగీకారం

Published Thu, Jan 16 2025 7:07 AM | Last Updated on Thu, Jan 16 2025 7:12 AM

 Israel And Hamas Reach Ceasefire Deal To End Gaza war

దోహా: యుద్ధం, మానవీయ సంక్షోభంతో 15 నెలలుగా అట్టుడుకుతున్న గాజా(Gaza)కు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. మరోసారి తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్(Israel), హమాస్‌(Hamas) అంగీకరించాయి. ఖతార్‌ రాజధాని దోహాలో వారాల తరబడి జరిగిన చర్చల అనంతరం బుధవారం ఎట్టకేలకు ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కనీసం ఆరు వారాల పాటు యుద్ధానికి విరామం ప్రకటిస్తారు.

ఇక, యుద్ధానికి పూర్తిగా తెర దించే దిశగా చర్చలను ముమ్మరం చేస్తారు. అంతేగాక హమాస్‌ తన వద్ద వంద మంది ఇజ్రాయెల్‌ బందీల్లో కనీసం 30 మందికి పైగా విడతలవారీగా వదిలేయనుంది. బదులుగా వందలాది మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్‌ విడుదల చేస్తుంది. దాంతోపాటు గాజాలో నిర్వాసితులైన వేలాది మంది స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు అనుమతిస్తుంది. అంతేగాక గాజాకు కొద్ది నెలలుగా పూర్తిగా నిలిపేసిన అంతర్జాతీయ మానవతా సాయాన్ని పూర్తిస్థాయిలో అనుమతిస్తుంది. ఈ మేరకు ఇరు వర్గాలూ అంగీకరించినట్టు చర్చల్లో పాల్గొన్న ముగ్గురు అమెరికా ఉన్నతాధికారులు, హమాస్‌ ప్రతినిధి తెలిపారు. దీనిపై దోహా త్వరలో అధికారికంగా ప్రకటన చేస్తుందని చెప్పారు.

ఇజ్రాయెల్‌ ప్రధాని కార్యాలయం మాత్రం ఒప్పందం విధివిధానాలు ఇంకా ఖరారు కావాల్సి ఉందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత దానికి కేబినెట్‌ ఆమోదముద్ర పడాల్సి ఉంటుందని పేర్కొంది. తాను ప్రమాణస్వీకారం చేసే లోపే గాజాలో యుద్ధానికి ముగింపు పలకాలంటూ అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హమాస్‌కు ఇటీవలే అల్టిమేటమివ్వడం తెలిసిందే. లేదంటే తీవ్ర చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మరోవైపు గాజాపై మంగళవారం ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు పిల్లలతో సహా 18 మంది మరణించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement