యుద్ధానికి ముగింపు పలకాలి | Kamala Harris Calls For End To War In Gaza, No Israeli Reoccupation | Sakshi
Sakshi News home page

యుద్ధానికి ముగింపు పలకాలి

Published Thu, Sep 19 2024 6:08 AM | Last Updated on Sat, Oct 5 2024 1:57 PM

Kamala Harris Calls For End To War In Gaza, No Israeli Reoccupation

గాజాపై ఇజ్రాయెల్‌ దురాక్రమణకు దిగింది 

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ వ్యాఖ్య 

హైతీ శరణార్థులపై ట్రంప్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శ

ఫిలడెల్ఫియా: గాజా స్ట్రిప్‌లో దురాక్రమణకు దిగిన ఇజ్రాయెల్‌ ఇకనైనా మారణహోమం ఆపాలని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్‌ సాయుధుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందమే గాజా్రస్టిప్‌ సమస్యకు అసలైన పరిష్కారమని ఆమె అభిప్రాయపడ్డారు. గాజాలోని ప్రతి ఒక్కరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కాల్పుల విరమణకు ఇరు పక్షాలు ముందుకు రావాలని ఆమె అభిలషించారు.

 ఫిలడెలి్ఫయాలో జరిగిన నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బ్లాక్‌ జర్నలిస్ట్స్‌ (ఎన్‌ఏబీజే)సమావేశంలో కమల పాల్గొని ప్రసంగించారు. దాదాపు 45 నిమిషాలపాటు పలు అంశాలపై ఆమె మాట్లాడారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో బదులిచ్చారు. హైతీలు ఇంటి పెంపుడు జంతువులను తింటున్నారంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చను, వలసదారులను సామూహిక బహిష్కరణ చేస్తామని ట్రంప్‌ ఇచి్చన హామీని హారిస్‌ తప్పుబట్టారు. 

‘ట్రంప్‌ ద్వేషపూరిత వ్యాఖ్యలు హానికరం. ఇలాంటి వాటిని సహించకూడదు’అని అన్నారు. ఆర్థిక అంశాలపైనా ఆమె విస్తృతంగా మాట్లాడారు. ‘‘అమెరికన్లను ప్రభావితం చేసే పెద్ద సమస్యలలో సరిపడా గృహాలు లేకపోవడం కూడా ఒకటి. నేనుఅధ్యక్షురాలిగా ఎన్నికైతే గృహాల నిర్మాణానికి ప్రైవేట్‌ సంస్థలతో కలిసి పనిచేస్తా. చైల్డ్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను 6,000 డాలర్లకు విస్తరిస్తాం. దీంతో అమెరికన్లు తమ ఆదాయంలో ఏడు శాతం కంటే ఎక్కువ మొత్తాలను పిల్లల సంరక్షణకు చెల్లించాల్సిన అవసరం లేదు’’అని కమల వ్యాఖ్యానించారు.  

కమలకు నల్లజాతీయుల బాసట 
2020 అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతీయుల్లో ఏకంగా 92 శాతం మంది అప్పటి డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతు పలికారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున నాటి అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌కు కేవలం 8 శాతం మంది నల్లజాతీయులే మద్దతు పలికారు. ఈ సారిసైతం అదే సరళి కనిపిస్తోంది ఎన్‌ఏఏసీపీ సర్వే తేలి్చంది. ఇటీవల విడుదలైన ఎన్‌ఏఏసీపీ సర్వే ప్రకారం 63 శాతం మంది నల్లజాతి ఓటర్లు కమలా హారిస్‌కు మద్దతు పలికారు. గతంతో పోలిస్తే డెమొక్రటిక్‌ పార్టీ నుంచి నల్లజాతీయులు కాస్తంత దూరం జరిగారని చెప్పాలి. అయినప్పటికీ ఇప్పటికీ నల్లజాతీయుల మెజారిటీ మద్దతు కమలకే దక్కడం విశేషం. 

ఈసారీ పోటీలో నిలిచిన ట్రంప్‌కు కేవలం 13 శాతం మంది నల్లజాతీయులు మద్దతుగా నిలబడినట్లు సర్వే వెల్లడించింది. పెన్సిల్వేనియా, జార్జియా వంటి రాష్ట్రాల్లో నల్లజాతీయుల మద్దతు నిర్ణయాత్మకంగా ఉంటుంది. పెన్సిల్వేనియా అత్యంత కీలకమైన రాష్ట్రం. ఈ రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యం ఎన్‌ఏబీజేకు ఉందని చెబుతారు. దీంతో వీరిని ఎలాగైనా తమ వైపునకు తిప్పుకోవాలని కమలా హారిస్, ట్రంప్‌ ఇద్దరూ చెమటోడుస్తున్నారు. అయితే గతంలో ట్రంప్‌ చేసిన జాత్యాహంకార వ్యాఖ్యల కారణంగా ఇప్పటికీ నల్లజాతీయుల మద్దతు కూడగట్టడం ఆయనకు సంక్లిష్టంగా తయారైంది. జార్జియాలో మూడు వంతుల మంది నల్లజాతీయులే కావడంతో ఇక్కడా వారి ఓటు నిర్ణయాత్మకంగా మారింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement