రైతు ఖాతాల్లోకి రూ.500 కోట్ల సబ్సిడీ
⇒ విత్తనాలు, వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై డీబీటీ
⇒ ఏప్రిల్ నుంచి అమలు
⇒ వ్యవసాయశాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: విత్తనాలు, వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఇక నుంచి రైతు ఖాతాల్లో నేరుగా జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి లబ్ధిదారునికి బదిలీ(డీబీటీ) విధానం ద్వారా దీనిని అమ లు చేస్తారు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా రాష్ట్ర వ్యవసాయశాఖ రూపొందిం చింది. సీఎం కేసీఆర్ కూడా ఈ పద్ధతికి అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఈ విధానం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.500 కోట్లకు పైగా విత్తనాలు, వ్యవసాయ యంత్రాలకు సంబంధించిన సబ్సిడీ సొమ్ము రైతు ఖాతాల్లోకి నేరుగా జమ కానుందని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ ఎం.జగన్‌మోహన్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ విధానం ద్వారా సబ్సిడీ సొమ్ము పక్కదారి పట్టకుండా ఉంటుందని ఆయన స్పష్టంచేశారు.
ధ్రువీకరించిన విత్తనాలు కొంటేనే...
రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రతీ ఏడాది వరి, సోయాబీన్, శనగ, వేరుశనగ, పచ్చిరొట్ట తది తర విత్తనాలను రైతులకు 33శాతం సబ్సిడీపై సరఫరా చేస్తుంది. అందుకోసం కొన్ని సంస్థల కు బాధ్యత అప్పగిస్తుంది. ప్రతీ ఏడాది దాదాపు రూ. 200 కోట్ల వరకు ఈ విత్తన సబ్సిడీ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అంచనా. అయితే అనేకచోట్ల విత్తన సబ్సిడీని కొందరు అక్రమార్కులు కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేం దుకే డీబీటీ విధానాన్ని అమలుచేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ నుంచి సర్టిఫికేట్ ఉన్న విత్తనాలనే రైతులు కొనుగోలు చేయాలి. అలా కొనుగోలు చే సిన వారికే సబ్సిడీ సొమ్ము వారి ఖాతాల్లోకి వెళుతుంది. తక్కువ ధరకు వస్తున్నాయని ఎక్కడో ఒకచోట సర్టిఫై కాని విత్తనాలు కొనుగోలు చేస్తే వారికి సబ్సిడీ సొమ్ము జమ చేయరు. ఎందుకంటే ధ్రువీ కరణ లేకుండా బయట కొనుగోలు చేసే విత్తనాల్లో కల్తీ... నాణ్యత లేకపోవడం వంటి కారణాలతో రైతు నష్టపోతాడు. ఇష్టారాజ్యం గా నకిలీ కంపెనీలు ముందుకొచ్చి రైతును దోపిడీ చేస్తాయి. ఇలా సబ్సిడీ సొమ్ము దుర్వినియోగం అయ్యే ప్రమాదముంది. అందుకే సర్కారు సర్టిఫై చేసిన విత్తనాలనే కొనుగోలు చేయాలనేది ప్రధాన షరతు.
వ్యవసాయ యంత్రాలకూ...
ప్రస్తుతం టార్పాలిన్ల కొనుగోలులో డీబీటీని అమలు చేస్తుండగా... దాన్ని ఇతర వ్యవసాయ యంత్రాలకూ విస్తరించాలని నిర్ణయించారు. సర్కారు నిర్వహించే బిడ్లలో పాల్గొని అర్హత సాధించిన కంపెనీల నుంచే రైతులు యంత్రాలను కొనుగోలు చేయాలి. అప్పుడే సబ్సిడీ సొమ్ము వారి ఖాతాల్లోకి చేరుకుంటుంది. ప్రస్తుతం వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీ, ఇతరులకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో వ్యవసాయ యంత్రాల కొనుగోలు ద్వారా దాదాపు రూ.300 కోట్ల సబ్సిడీ రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ కానుందని అంచనా.