వ్యవసాయ శాఖ యోచన
'పూర్తి ధర’ చెల్లిస్తేనే విత్తనం
తొలుత శనగ,వేరు శనగపై అమలు
కలెక్టర్ అనుమతి కోరిన అధికారులు
అనుమతిస్తే రబీ నుంచే అమలు
వ్యవహారం తేలిన తర్వాతే పంపిణీ షురూ
సాక్షి, సంగారెడ్డి: విత్తనాలు మరింత భారంగా మారనున్నాయి. ఇకపై పూర్తి ధర చెల్లిస్తేనే విత్తనాలు లభ్యం కానున్నాయి. విత్తనాలపై నేరుగా రాయితీ అందించకుండా ఇకపై ‘నగదు బదిలీ’ తరహాలో ఇవ్వాలని జిల్లా వ్యవసాయ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. తొలుత శనగ, వేరుశనగ విత్తనాల పంపిణీలో ఈ విధానం అమలు కానుంది. అయితే, ఆధార్ కార్డుల అనుసంధానంతో అమల్లోకి వస్తున్న నగదు బదిలీ పథకంతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. విత్తనాలు కోరుకునే రైతులు రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం నకలు, బ్యాంకు ఖాతా నంబర్‌తో స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే అక్కడ పర్మిట్లు జారీ చేస్తారు. ఆ తర్వాత పూర్తి ధర చెల్లించి అధీకృత దుకాణం నుంచి విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
అనంతరం కొంత కాలానికి రైతుల ఖాతాలో ్ల రాయితీ డబ్బులు జమ అవుతాయి. ఈ విధానాన్ని అమలు చేసేందుకు అనుమతిని కోరుతూ జిల్లా వ్యవసాయ శాఖ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించింది. విత్తనాల డిమాండ్ అంచనాలకు మించిపోతుండడంతో పంపిణీ క్లిష్టంగా మారుతోంది. ముఖ్యంగా శనగ విత్తనాలను రాయితీపై కొనుగోలు చేసి పంటలు వేయకుండా వంట అవసరాలకు వినియోగిస్తుండడంతో భారీగా దుర్వినియోగమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాయితీ బదిలీని అమల్లోకి తెస్తున్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. కలెక్టర్ అనుమతిస్తే ఈ రబీ నుంచే విత్తనాలపై నగదు బదిలీ అమలులోకి రానుంది. నేరుగా రాయితీపైనే జిల్లాలో విత్తనాలు పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ జిల్లా యంత్రాంగాన్ని కోరినట్లు ఏపీ సీడ్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.
శనగ విత్తనాలు క్వింటాల్ ధర రూ. 4,395గా నిర్ణయించింది. 33.33 శాతం రాయితీ రూ.1,465ను ప్రభుత్వం భరిస్తోంది. రైతులు రూ.2,930 చెల్లిస్తే సరిపోయేది. రబీలో 24,000 క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా. దీని ప్రకారం రైతులపై 3.516 కోట్ల రాయితీ భారం పడనుంది. ఆ తర్వాత ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది.
వేరుశనగ విత్తనాలు క్వింటాల్ ధర రూ.5,400గా ప్రభుత్వం నిర్ణయించింది. 33.33 శాతం ప్రభుత్వ రాయితీ రూ.1,800 పోగా రైతులు రూ.3,600 చెల్లిస్తే క్వింటాలు విత్తనాలు లభించాలి. రబీలో 4 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తు అవసరమని అధికారుల అంచనా. ఈ మేరుకు రైతులు రూ.72 లక్షల భారాన్ని తొలుత భరిస్తే ఆ తర్వాత ప్రభుత్వం తిరిగి చెల్లించ నుంది.
ప్రారంభం కాని పంపిణీ
జిల్లాలో రబీ విత్తనాల పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. ఆశాజనక వర్షాలతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశాలుండడంతో విత్తనాలకు విపరీత డిమాండు ఉండనుంది. రాయితీ విషయం తేలిన తర్వాతే విత్తనాల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఏపీ సీడ్స్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ ఈ పట్టికలో పేర్కొన్న విధంగా జిల్లాకు ఆయా రకాల విత్తనాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది.