న్యూఢిల్లీ: దేశంలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయం కోసం డీజిల్, విత్తనాలను సబ్సిడీపై అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యానవన పంటల పునరుద్ధరణకు హెక్టారుకు రూ. 35 వేల చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ గురువారం రాజ్యసభలో పలు వివరాలను వెల్లడించారు. ఖరీఫ్ పంటలను కాపాడేందుకు 50శాతానికి పైగా లోటు వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో డీజిల్ పంపుసెట్ల కోసం సబ్సిడీపై డీజిల్‌ను అందజేయనున్నట్లు చెప్పారు. దీనిపై రాష్ట్రాలకు ఆదేశాలు కూడా జారీచేశామన్నారు.
కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిన చోట్ల రైతులకు విత్తనాలపై అందించే సబ్సిడీని 50శాతానికి పెంచామని తెలిపారు. జాతీయ ఉద్యానవన మిషన్ కింద.. కరువు ప్రాంతాల్లోని ఉద్యానవన పంటల పునరుద్ధరణ కోసం రైతులకు హెక్టారుకు రూ. 35 వేల చొప్పున ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు చెప్పారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదైందని, జూన్ నాటికి 40 శాతం లోటు వర్షపాతం నమోదుకాగా.. ఆగస్టు 8 నాటికి పరిస్థితులు మెరుగుపడి ఈ లోటు 18 శాతానికి పరిమితమైందని పేర్కొన్నారు. రిజర్వాయర్లలో నీటిమట్టాలు కూడా గత పదేళ్ల సగటుతో పోలిస్తే.. 113 శాతంగా ఉన్నాయన్నారు.
పార్లమెంటు భద్రతపై సమీక్షకు కమిటీ
పార్లమెంటులో భద్రతా ఏర్పాట్లపై సమీక్షకు ఒక ప్రత్యేక కమిటీని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం ఏర్పాటుచేశారు. పార్లమెంటు లక్ష్యంగా 13 సంవత్సరాల కిందట ఉగ్రవాదులు దాడి జరిగిన నేపథ్యంలో చట్టసభ భద్రతను మరింత పటిష్టంచేసేందుకు ఈ కమిటీ ఏర్పాటైంది. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఆర్కే సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీకి పార్లమెంటు భద్రతను పటిష్టంచేసే చర్యలపై సూచనలిచ్చేందుకు నెల వ్యవధి ఇచ్చారు.
కరువు ప్రాంతాల్లో సబ్సిడీపై డీజిల్, విత్తనాలు: కేంద్రం
Published Fri, Aug 8 2014 2:09 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement